- కొనసాగుతున్న ఇరాన్ సుప్రీం లీడర్ అధికారిక ఖాతా
టెహ్రాన్: ఇజ్రాయెల్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ చేసిన పోస్ట్‌పై ట్విట్టర్ చర్యలు తీసుకున్నది. హిబ్రూ భాషలో ఖమేనీ ఇటీవల తెరిచిన అకౌంట్‌ను సోమవారం సస్పెండ్ చేసింది. గత శనివారం ఇరాన్ సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. దీనిపై స్పందిస్తూ ఖమేనీ ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. ‘‘ఇజ్రాయెల్ దుర్మార్గాన్ని తక్కువగా అంచనా వేయొద్దు. అదేసమయంలో అతిగా కూడా తీసుకోవద్దు. ఇజ్రాయెల్‌కు ఇరాన్ సత్తా ఏంటో చూపాలి” అని ఖమేనీ పోస్ట్ చేశారు. అయితే, ఈ వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయని పేర్కొంటూ ఖమేనీ తాజా ఖాతాను పోస్ట్ చేసిన రెండు రోజులకే ఎక్స్ తొలగించింది. ఇదిలా ఉండగా ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ అధికారిక ఖాతా కొనసాగుతుండడం గమనార్హం.
ఊహించనివిధంగా దెబ్బకొడ్తం: ఇరాన్ గార్డ్స్ చీఫ్
ఇరాన్ సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ ఇటీవల భీకర దాడులు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ తీవ్రంగా స్పందించింది. ఇజ్రాయెల్తొందర్లోనే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటుందని గార్డ్స్చీఫ్ హొస్సేనీ సలామీ హెచ్చరించినట్టు సోమవారం స్థానిక మీడియా వెల్లడించింది. శనివారం జరిపిన వైమానిక దాడులతో ఇజ్రాయెల్ తన లక్ష్యాలను సాధించడంలో విఫలమైందని అన్నారు. వారి దాడి నిస్సహాయత, తప్పుడు లెక్కలకు సంకేతంలా నిలిచిందని తెలిపారు. అయినా.. ఇజ్రాయెల్ ఊహించనివిధంగా తాము దెబ్బకొడ్తామని హెచ్చరించారు. కాగా, తాము యుద్ధాన్ని కోరుకోమని, కానీ తమ దేశ హక్కులను కాపాడుకుంటామని ఇరాన్ ప్రెసిడెంట్ మాసౌద్ పెజిష్కియాన్ అన్నారు. ఇజ్రాయెల్ దుశ్చర్యలకు తప్పక సమాధానం చెప్తామని హెచ్చరించారు.