న్యూఢిల్లీ : ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫాం జొమాటో ఒక సంవత్సరంలోపు పది దేశాల నుంచి తప్పుకుంది. ఖర్చులను తగ్గించుకోవడానికి వియత్నాం, పోలాండ్‌లో ఉన్న తన స్టెప్-డౌన్ అనుబంధ సంస్థలను మూసివేస్తున్నట్టు స్టాక్ ఎక్స్ఛేంజీలకు తాజాగా తెలియజేసింది. గురుగ్రామ్ ఆధారిత ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ మార్చి 2023 నుంచి దాని పది అనుబంధ సంస్థలను రద్దు చేసింది.
వీటిలో రెస్టారెంట్ అగ్రిగేటర్ జొమాటో చిలీ ఎస్పీఏ, జొమాటో మీడియా ఇండోనేషియా, జొమాటో న్యూజిలాండ్ మీడియా ప్రైవేట్లిమిటెడ్, జొమాటో ఆస్ట్రేలియా ప్రైవేట్లిమిటెడ్ఉన్నాయి. మీడియా పోర్చుగల్ యునిపెస్సోల్ ఎల్డీఏ, జొమాటో ఐర్లాండ్ లిమిటెడ్ – జోర్డాన్, చెక్ రిపబ్లిక్ లంచ్‌టైమ్ జొమాటో స్లోవేకియాలనూ రద్దు చేసింది. గతంలో, జొమాటో కెనడా, యూఎస్, ఫిలిప్పీన్స్, యూకే, ఖతార్, లెబనాన్ సింగపూర్‌లోని అంతర్జాతీయ వ్యాపారాలను ఆపేసింది.
కంపెనీ ఇప్పటికీ ఇండోనేషియా, శ్రీలంక, యూఏఈలలో పనిచేస్తోంది. అనుబంధ సంస్థల లిక్విడేషన్ వల్ల కంపెనీ కార్యకలాపాలపై ప్రభావం చూపదని జొమాటో ప్రకటించింది. 2023 ఆర్థిక సంవత్సర వార్షిక నివేదిక ప్రకారం.. ఈ సంస్థకు జొమాటో పేమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, బ్లింకిట్కామర్స్, జొమాటో ఫైనాన్షియల్ సర్వీసెస్ సహా 16 డైరెక్ట్ సబ్సిడరీలు, 12 స్టెప్-డౌన్ సబ్సిడరీలు, ఒక అసోసియేట్ కంపెనీ ఉన్నాయి.
జొమాటో 2024 ఆర్థిక సంవత్సరంలో వరుసగా రెండు క్వార్టర్లలో లాభాలను సాధించింది. సెప్టెంబర్ క్వార్టర్లో రూ.36 కోట్ల నికర లాభాన్ని జూన్ క్వార్టర్లో రూ.2 కోట్ల లాభాన్ని నివేదించింది. ఆర్డర్ వాల్యూమ్ పెరుగుదల కారణంగా రెండో క్వార్టర్లో కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 71శాతం పెరిగి రూ.2,848 కోట్లకు చేరుకుంది. సెప్టెంబరుతో ముగిసిన క్వార్టర్లో కంపెనీ మొత్తం ఖర్చులు రూ.3,039 కోట్లకు పెరిగాయి. శుక్రవారం జొమాటో షేర్లు 52 వారాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఇది 2.89శాతం పెరిగి రూ.133.50 వద్ద ముగిసింది.