ఆన్‌లైన్ ఫుడ్ కాస్ట్‌లీ గురూ.. ! మరోసారి ప్లాట్‌ఫామ్ ఫీజు పెంచిన జొమాటో

ఆన్‌లైన్ ఫుడ్ కాస్ట్‌లీ గురూ.. ! మరోసారి ప్లాట్‌ఫామ్ ఫీజు పెంచిన జొమాటో

ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో వినియోగదారులకు షాకిచ్చింది. ప్లాట్‌ఫామ్ ఫీజును మరోసారి పెంచింది. దీపావళి పండగ రద్దీని దృష్టిలో ఉంచుకొని 6 రూపాయలుగా ఉన్న ప్లాట్‌ఫామ్ ఫీజును రూ.10 చేసింది. ఈ పెంపు ప్రతి ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్ ధరపై ప్రభావం చూపనుంది.

ఏడాదిలో నాలుగు సార్లు పెంపు 

గతేడాది ఆగస్టులో జొమాటో సంస్థ ప్లాట్‌ఫామ్ ఫీజును పరిచయం చేసింది. అప్పుడు 2 రూపాయలు. ఆనాటి నుంచి ఇప్పటివరకూ నాలుగు సార్లు పెంపు చేపట్టడం గమనార్హం. 2 రూపాయితో మొదలు పెట్టి.. రూ.3, రూ.4.. రూ.6... అంటూ మెల్లగా 10 రూపాయలు చేసేసింది. ఈ ఏడాది ప్రారంభంలో ఆర్డర్‌కు రూ.4 నుంచి రూ.6కు పెంచిన రుసుముతో పోలిస్తే ఇది గణనీయమైన పెరుగుదల. ఏకంగా 60 శాతం పెంచింది. ఇప్పుడు వినియోగదారుల నుండి ఆర్డర్‌కు రూ. 10 చొప్పున వసూలు చేస్తోంది.

పెంపును సమర్థించిన జోమాటో 

పండుగల సీజన్‌లో అధిక డిమాండ్‌కు అనుగుణంగా నిర్వహణ ఖర్చులు, వేగవంతమైన సర్వీసుల కోసం ప్లాట్‌ఫామ్ ఫీజులను పెంచడం అవసరమని జొమాటో స్పష్టం చేసింది. వినియోగదారులకు తక్షణ సేవలు అందించడంలో ఈ రుసుము సహాయపడుతుందని పేర్కొంది.

వినియోగదారుల జేబులకు చిల్లు

ప్లాట్‌ఫామ్ ఫీజు అనేది నిర్దిష్ట ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించుకున్నందుకు వసూలు చేసే రుసుము. దీనికి డెలివరీ ఛార్జీలు, రెస్టారెంట్ ఛార్జీలు, GST వంటివి అదనం. తాజా పెంపుతో, జొమాటో వినియోగదారులు ప్లాట్‌ఫామ్ ఫీజులో రూ. 10తో కలిపి భారీగానే ముట్టచెప్పాల్సి ఉంటుంది. ప్రత్యర్థి ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ సైతం ప్లాట్‌ఫామ్ ఫీజులను అమలు చేస్తోంది. ప్రస్తుతం స్విగ్గీ.. ఆర్డర్‌కు రూ.6.50ల చొప్పున ప్లాట్‌ఫామ్ ఫీజు వసూలు చేస్తోంది.

ALSO READ | టమాటా సాస్ ఉపయోగిస్తున్నారా..? అయితే కచ్చితంగా మీరు ఈ విషయం తెలుకోవాల్సిందే..!