గూగుల్ పే, ఫోన్ పే లకు పోటీగా జొమాటో యూపీఐ

 గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం లకు పోటీగా ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో సొంతంగా యూపీఐ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఐసీఐసీఐ బ్యాంక్‌తో కలిసి ఈ సేవలను అందుబాటులోకి తెచ్చింది.  మూములుగా మనం జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేస్తే థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా బిల్లు చెల్లిస్తాం. 

అయితే  ఇప్పుడు నేరుగా  జొమాటో యాప్ యూపీఐ ద్వారానే డబ్బులను చెల్లించవచ్చు. ఇందుకోసం యూపీఐ ఐడీ క్రియేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం పైలెట్ ప్రాజెక్ట్ కింద జొమాటో ఈ యూపీఐ సర్వీసెస్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఫుడ్‌ ఆర్డర్‌ చేసే చాలా మంది కస్టమర్లు యూపీఐ సేవలను వాడుతున్నారని, అందుకే ఐసీఐసీఐ సహకారంతో యూపీఐ సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు జొమాటో అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.

 ఇక క్యాష్‌ ఆన్‌ డెలివరీ సేవలను కూడా ఎత్తివేయాలన్న ఆలోచనలోనూ జొమాటో ఉన్నట్లుగా తెలుస్తోంది.  క్యాష్‌ ఆన్‌ డెలివరీ ఆప్షన్‌ ఎంచుకున్న సందర్భాల్లో కస్టమర్‌ ఆహారాన్ని తిరస్కరించే అవకాశం ఉన్నందున ఈ విధానానికి స్వస్తి పలకాలని జొమాటో భావిస్తున్నట్లు సమాచారం.