హోదా రికార్డు అసిస్టెంట్.. చేసేది చైన్​మెన్ పని.. తీసుకునే జీతమూ ఎక్కువే.. చందానగర్​సర్కిల్లో ఆఫీసర్ల ఇష్టారాజ్యం

హోదా రికార్డు అసిస్టెంట్.. చేసేది చైన్​మెన్ పని.. తీసుకునే జీతమూ ఎక్కువే.. చందానగర్​సర్కిల్లో ఆఫీసర్ల ఇష్టారాజ్యం

మాదాపూర్, వెలుగు: ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా తను పనిచేయాల్సిన పోస్టులో కాకుండా కింది స్థాయి పోస్టులో పని చేయాలని కోరుకోరు. ఒక మెట్టుపైకి ఎక్కిన తర్వాత మళ్లీ కింది పోస్టుకు వెళ్లాలనుకోరు. జీహెచ్ఎంసీ శేరిలింగంపల్లి జోన్ ​పరిధిలోని చందానగర్​ సర్కిల్​టౌన్​ప్లానింగ్​లో ఇద్దరు ఉద్యోగులు మాత్రం తాము పనిచేయాల్సిన పోస్టులో కాకుండా కింది స్థాయి సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. సిబ్బంది లేరనే సాకుతో జోనల్​కమిషనర్, సర్కిల్​డిప్యూటీ కమిషనర్లు ఆ ఇద్దరు ఉద్యోగులను చైన్​మెన్లుగా కొనసాగిస్తుండడం గమనార్హం.  

చేయాల్సింది ఒకటి.. చేస్తున్నది మరొకటి
శేరిలింగంపల్లి జోన్​పరిధిలోని నాలుగు సర్కిళ్ల టౌన్​ ప్లానింగ్ విభాగంలో పనిచేస్తున్న చైన్​మెన్లను 2024 అక్టోబర్​ 21న జోనల్​ కమిషనర్​ ఉపేందర్​రెడ్డి ట్రాన్స్​ఫర్​ చేశారు. అదే టైంలో శేరిలింగంపల్లి సర్కిల్​లో పనిచేస్తున్న రికార్డ్​అసిస్టెంట్​జావీద్, పటాన్​చెరు సర్కిల్​లో పనిచేస్తున్న రికార్డ్​అసిస్టెంట్​రాజేందర్​చందానగర్​సర్కిల్​టౌన్ ప్లానింగ్​విభాగానికి బదిలీపై వచ్చారు. 

ఈ ఇద్దరూ తమకు కేటాయించిన విభాగంలో రికార్డులను పరిశీలిస్తూ, ఆఫీసర్ల ఆదేశానుసారం వారికి కావాల్సిన రికార్డులను అందజేస్తూ ఆఫీస్​లోనే ఉండాలి. కానీ చైన్​మెన్లుగా ఫీల్డ్​లో తిరుగుతున్నారు. జీతం మాత్రం రికార్డు అసిస్టెంట్ పోస్టుదే తీసుకుంటున్నారు. చైన్​మెన్​జీతం రూ.30 నుంచి రూ.40 వేల మధ్య ఉంటే వీరు చైన్​మెన్లుగా జాబ్​చేస్తూ ఒకరు రూ.85 వేలు, మరొకరు రూ.55వేలు తీసుకుంటున్నారు. 

అక్రమ నిర్మాణాల అడ్డా..
ఈ సర్కిల్​పరిధిలోని మాదాపూర్​ డివిజన్​ అయ్యప్ప సొసైటీ, సర్వే ఆఫ్​ఇండియా, అగర్వాల్​లే అవుట్, చంద్రనాయక్​తండా, మియాపూర్​లోని100,101, 44 సర్వే నంబర్లలోని వివాదాస్పద భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని కోర్టు ఆదేశాలు ఉన్నా బిల్డర్లు భారీ నిర్మాణాలు చేపడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. 

వీటిని అడ్డుకోవాల్సిన ఆఫీసర్లు అటువైపు కన్నెత్తి చూడడం లేదని తెలుస్తోంది. ఇంతకుముందు కూడా ఈ సర్కిల్​టౌన్​ప్లానింగ్​విభాగంలో టీపీఎస్​, చైన్​మెన్లను పనిచేసిన వారిని ఉన్నతాధికారులు ఆరు నెలల్లో రెండు సార్లు మార్చారు. అయినా, ఇంకా ఆరోపణలు వినవిస్తూనే ఉన్నాయి.