- జోనల్ టెండర్లపై కేసు
- అంగన్వాడీలకు అందని గుడ్లు
- ఈ ఏడాది జనవరి నుంచే కొత్త పద్ధతికి గ్రీన్‌సిగ్నల్
- హైకోర్టుకు వెళ్లిన కాంట్రాక్టర్లు
- బడా కాంట్రాక్టర్లకు మేలు చేసేందుకేనని ఆరోపణలు
మంచిర్యాల, వెలుగు : రాష్ట్రంలోని అంగన్వాడీ సెంటర్లకు గుడ్లు సరఫరా చేసేందుకు నిర్వహించిన జోనల్టెండర్ల అంశం హైకోర్టుకు చేరింది. గతంలో జిల్లా స్థాయిలో ఉన్న గుడ్ల టెండర్లను ప్రభుత్వం రద్దు చేసి జోనల్ టెండర్లు పిలిచింది. కొత్త టెండర్ల ప్రకారం ఈ ఏడాది జనవరి నుంచి రెండేళ్ల పాటు కోడిగుడ్లు సప్లై చేయడానికి కాంట్రాక్టర్లకు ఆర్డర్స్ఇచ్చింది. కొంతమంది పాత కాంట్రాక్టర్లు దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ హైకోర్టుకు వెళ్లారు. బడా కాంట్రాక్టర్లకు మేలు చేసే విధంగా ఉన్న ఈ జోనల్టెండర్సిస్టం రద్దు చేసి పాత పద్ధతినే కొనసాగించాలని కోరారు. ఈ కేసుపై హైకోర్టు స్టే విధించడంతో కొత్త టెండర్లకు టెంపరరీగా బ్రేక్ పడింది. ప్రస్తుతం పాత కాంట్రాక్టర్లే గుడ్లు సరఫరా చేస్తున్నా సక్రమంగా అందడం లేదని అంగన్వాడీ టీచర్లు చెబుతున్నారు.
ఇప్పటివరకు ఇలా....
అంగన్వాడీ సెంటర్ల ద్వారా ఆరోగ్యలక్ష్మి లబ్ధిదారులైన గర్భిణులకు, బాలింతలకు పౌష్టికాహారంలో భాగంగా రోజుకో గుడ్డును అందిస్తున్నారు. ఇందుకు అవసరమైన ఎగ్స్ సప్లై చేసేందుకు ఇప్పటివరకు జిల్లాస్థాయిలో జిల్లా సంక్షేమ అధికారి (డీడబ్ల్యూవో) టెండర్లు నిర్వహిస్తున్నారు. ఐసీడీఎస్ ప్రాజెక్టుల వారీగా పౌల్ర్టీ నిర్వాహకుల నుంచి టెండర్లు స్వీకరించి ట్రాన్స్‌పోర్టేషన్ రేటు తక్కువకు కోట్‌చేసిన వాళ్లకు అప్పగిస్తున్నారు. గుడ్డుకు ఆ రోజు ఉన్న నెక్ రేటు చెల్లిస్తున్నారు. నెలలో 5, 15, 25 తేదీల్లోపు మూడుసార్లు ఎగ్స్సప్లై చేయాల్సి ఉండగా, కాంట్రాక్టర్లు ఆలస్యం చేస్తున్నారు. 45 నుంచి 52 గ్రాముల బరువు కాకుండా చిన్నసైజు గుడ్లను సప్లై చేస్తున్నారు. అగ్మార్క్ నిర్దేశించిన ప్రమాణాలు పాటించకపోవడం, క్వాలిటీ లేకపోవడంతో కుళ్లిన గుడ్లు వచ్చిన సందర్భాలు అనేకం. కాంట్రాక్టర్లపై ఇలాంటి ఎన్నో ఫిర్యాదులు అందినా అధికారులు పట్టించుకోలేదు.
జోనల్ టెండర్లతో చెక్ పడేనా..?
జిల్లాస్థాయి టెండర్లలోని లోపాలకు చెక్‌పెట్టడంతో పాటు రాష్ర్టవ్యాప్తంగా ఉన్న అన్ని సెంటర్లకు అగ్మార్క్ ప్రమాణాల మేరకు క్వాలిటీ ఎగ్స్అందించేందుకే జోనల్టెండర్విధానాన్ని ప్రవేశపెట్టినట్టు విమెన్అండ్చైల్డ్వెల్ఫేర్డిపార్ట్మెంట్ చెబుతోంది. ప్రస్తుతం పాలు, కందిపప్పు సప్లై కోసం స్టేట్లెవల్టెండర్లు నిర్వహిస్తున్నారు. చాలా ఏండ్ల నుంచి ఈ టెండర్‌ను దక్కించుకుంటున్న సంస్థ సబ్‌కాంట్రాక్టర్ల ద్వారా సప్లై చేస్తున్నట్టు ఆరోపణలున్నాయి. ఈ రెండు సరుకులు సక్రమంగా సప్లై కావడం లేదని, క్వాలిటీ ఉండట్లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. ఎగ్స్జోనల్టెండర్ల విధానం కూడా ఇందుకు భిన్నంగా ఉండబోదని అంటున్నారు. కొత్త విధానంలో పలుకుబడి కలిగిన బడా కాంట్రాక్టర్లను నియంత్రించేది ఎవరన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
రెండేండ్ల కాలపరిమితితో..
నిరుడు నవంబర్‌లో జోన్ల వారీగా టెండర్లు పిలిచి డిసెంబర్లో బిడ్స్ఓపెన్ చేసి కాంట్రాక్టర్లను ఖరారు చేశారు. ఈ ఏడాది జనవరి నుంచి 2024 డిసెంబర్ వరకు రెండేళ్ల కాలపరిమితితో టెండర్లు అప్పగించారు. రాష్ట్రంలో ఏడు జోన్లు ఉండగా, కాళేశ్వరం జోన్ 8.95 కోట్లు, బాసర 14.97 కోట్లు, రాజన్న 13.44 కోట్లు, భద్రాద్రి 15.46 కోట్లు, యాదాద్రి 8.95 కోట్లు, చార్మినార్ 20.39 కోట్లు, జోగులాంబ జోన్ 12.71 కోట్ల గుడ్లు సప్లై చేయాల్సి ఉంది. మొత్తంగా 94.25 కోట్ల గుడ్లను చేరవేయాలి. గుడ్డు అగ్మార్క్ప్రమాణాల ప్రకారం 45–52 గ్రాముల బరువుండాలి. కాంట్రాక్టర్లు సొంత పౌల్ర్టీ ఫామ్ కలిగి టెండర్లో పేర్కొన్న మొత్తంలో 40 శాతం ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉండాలి. మిగతా 60 శాతం గుడ్లను ఇతర పౌల్ర్టీఫామ్ల నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. అయితే, బడా కాంట్రాక్టర్లకు మేలు చేయడం కోసమే జోనల్టెండర్విధానాన్ని తీసుకొచ్చారని, దీనిని రద్దు చేసి పాత పద్ధతినే కొసాగించాలని పలువురు పాత కాంట్రాక్టర్లు హైకోర్టును ఆశ్రయించగా స్టే ఇచ్చింది. దీనిపై కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందోనని పాత, కొత్త కాంట్రాక్టర్లు, అధికారులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.