ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ ఒక జూలోని పులికి కూడా సోకింది. న్యూయార్క్ లో కరోనా కేసులో లక్ష దాటాయి. మొత్తం అమెరికాలో 3 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదైతే.. అందులో సగం కేసులు న్యూయార్క్ లోనే నమోదు కావడం గమనార్హం. అయితే అక్కడ ఇప్పటి వరకు మనుషుల నుంచి మనుషులకే ఈ వైరస్ సోకింది. కానీ, ఇప్పుడు ఆ వైరస్ జూలోని పులికి కూడా సోకింది.
బ్రోంక్స్ జూలోని మలయన్ జాతికి చెందిన 4 ఏళ్ల నదియా అనే ఆడ పులికి ఈ వైరస్ సోకినట్లు వైల్డ్‌లైఫ్ కన్జర్వేషన్ సొసైటీ అధికారులు తెలిపారు. ఈ నదియా దగ్గుతో బాధపడుతండటం చూసి అనుమానంతో పరీక్ష చేయగా.. కరోనా పాజిటివ్ వచ్చినట్లు వారు తెలిపారు.
నదియాతో పాటు.. మరో మూడు పులులు మరియు మూడు ఆఫ్రికన్ సింహాలకు కూడా ఈ లక్షణాలు ఉన్నట్లు వారు గుర్తించారు. వైరస్ సోకిన పులులు, సింహాలు ఇప్పటికైతే బాగానే తిరుగుతున్నాయని జూ అధికారులు తెలిపారు. కాగా.. అవి తినడం బాగా తగ్గించాయని వారు తెలిపారు. అయితే వాటి ఆలనాపాలనా చూసే జూ ఉద్యోగి ద్వారానే ఈ కరోనా సోకినట్లు జూ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వైరస్ బారిన పడిన వాటిని జూలోని టైగర్ మౌంటైన్ ఎగ్జిబిట్‌లో ఉంచినట్లు వారు తెలిపారు. న్యూయార్క్ లో వైరస్ వ్యాప్తి ఎక్కవగా ఉండటంతో బ్రోంక్స్ జూను మార్చి 16 నుంచి మూసివేసినట్లు అధికారులు తెలిపారు. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం.. జంతువులు కూడా కరోనా వైరస్ బారిన పడతాయని.. కానీ, వాటి నుంచి మానవులకు సోకడమనేది చాలా తక్కువని శాస్త్రవేత్తలు అంటున్నారు.
For More News..