నాలుగైదు రోజుల్లో జూపార్కు ఫ్లైఓవర్ ప్రారంభిస్తాం

నాలుగైదు రోజుల్లో జూపార్కు ఫ్లైఓవర్ ప్రారంభిస్తాం
  • జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబరితి వెల్లడి 

హైదరాబాద్ సిటీ, వెలుగు: జూపార్క్– ఆరాంఘర్ ఫ్లైఓవర్ ను నాలుగైదు రోజుల్లో ప్రారంభిస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబరితి చెప్పారు. బుధవారం హెచ్ఎండీ ఆఫీసులో నిర్వహించిన చిట్ చాట్ లో ఆయన తెలిపారు. ఫ్లైఓవర్​పనులు పూర్తయ్యాయని, అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ సమస్య చెక్​పడుతుందన్నారు. ఎస్ఆర్డీపీలో భాగంగా 2021లో ఫ్లైఓవర్​పనులు ప్రారంభించగా, పలు కారణాలతో కొన్నేళ్లపాటు పనులు జరగలేదు. 

గతేడాది పనుల్లో స్పీడ్​పెరిగింది. దీని అంచనా వ్యయం రూ.636.80 కోట్లు కాగా, పూర్తయ్యేనాటికి ఖర్చు రూ.736 కోట్లకు చేరింది. 24 మీటర్ల వెడల్పుతో 6 లేన్లలో 4.08 కిలోమీటర్ల పొడవుతో ఈ ఫ్లైఓవర్​ను నిర్మించారు. ప్రారంభిస్తే జూపార్క్ నుంచి ఆరాంఘర్ మీదుగా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్, మహబూబ్‌నగర్, కర్నూలు, అనంతపురం, బెంగళూరుకు రాకపోకలు సాఫీగా సాగుతాయి. 

ప్రస్తుతం ఈ రూట్​లోని తాడ్​బన్, దానమ్మ హట్స్, హసన్ నగర్ జంక్షన్లలో ఎక్కడా ఆగకుండా నేరుగా వెళ్లేందుకు వీలుంటుంది. జూపార్క్‌ సందర్శకులు, పాతబస్తీ వైపు వెళ్లేవారికి జర్నీ ఈజీ కానుంది.