ఈశాన్య రాష్ట్రం మిజోరం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయింది. మొత్తం 40 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో జోరం పీపుల్ మూవ్‌మెంట్(జడ్‌పీఎం) 27 స్థానాలను గెలుచుకుంది. మిజోనేషనల్ ఫ్రంట్(ఎంఎన్‌ఎఫ్)10, బీజేపీ 2, కాంగ్రెస్ ఒక స్థానంలో గెలుపొందాయి. తాజా ఫలితాల్లో అధికార ఎమ్‌ఎన్‌ఎఫ్‌కు గట్టి షాక్ తగిలింది. ఏకంగా ముఖ్యమంత్రి జోరంథంగా సహా డిప్యూటీ సీఎం, పలువురు మంత్రులు ఈ ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. లాల్‌దుహోమా నేతృత్వంలోని జడ్‌పీఎం స్పష్టమైన మెజార్టీతో విజయం సాధించింది.
వాస్తవానికి ఆదివారం (డిసెంబర్ 3న) తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌తోపాటు మిజోరం ఓట్ల లెక్కింపు కూడా చేపట్టాల్సి ఉంది. అయితే.. ఆదివారం తమకు ప్రత్యేక దినమని, ఆ రోజు కౌంటింగ్ వద్దంటూ ఆ రాష్ట్ర ప్రజలు, పలు సంస్థలు చేసిన విజ్ఞప్తి మేరకు ఎన్నికల సంఘం కౌంటింగ్ ప్రక్రియను సోమవారానికి (డిసెంబర్ 4) వాయిదా వేసింది. 40 సీట్లున్న మిజోరంలో నవంబర్ 7న ఎన్నికలు జరిగాయి.