- సర్వసభ్య సమావేశంలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్
ఖమ్మం టౌన్,వెలుగు : నష్టపోయిన రైతులను ఆదుకోవాలని జడ్పీ చైర్మన్ లింగాల కమలరాజు అధికారులకు సూచించారు. శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కమలరాజు అధ్యక్షతన సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధిపై సమీక్షించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితులతో ఆశించిన మేర పంట దిగుబడులు రాలేదని
అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు ఆర్థిక చేయూత అందించనున్నట్లు చెప్పారు. ఈ యాసంగికి 1,66,319, ఎకరాల విస్తీర్ణంలో వివిధ పంటలు వేసేందుకు ప్రణాళికను సిద్ధం చేయగా, ఇప్పటి వరకు 37 వేల 149 ఎకరాల్లో సాగు చేసినట్లు వివరించారు. జిల్లాలో రైతులకు అవసరమైన 39, వేల 411 మెట్రిక్ టన్నుల వివిధ రకాల ఎరువులను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
రైతు వేదికల్లో సమావేశాలు..
జిల్లాలో రైతు వేదికల ద్వారా సస్యరక్షణ, ముందస్తు వరిసాగు, పచ్చిరోట్ట ఎరువుల వినియోగం వలన కలిగే లాభాలు, ఇతర అంశాలపై వారానికి రెండుసార్లు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కమలరాజు వివరించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి బ్యాంకు లింకేజి కింద 16,642 గ్రూపులకు రూ.931.68 కోట్ల లక్ష్యానికి గాను రూ.723.01 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. గ్రామీణ నూతన దుకాణాల సముదాయం కింద రూ.71.13 కోట్లతో 7,491 దుకాణాల సముదాయాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. పింఛన్ల కింద 4435.82 లక్షలు చెల్లించినట్లు చెప్పారు.
వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాసు నాయక్ మాట్లాడుతూ భర్త పింఛన్ పొందుతూ మరణిస్తే అతడి భార్యకు పింఛన్ త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ మాట్లాడుతూ రైతులకు విత్తనాలు, ఎరువులు సకాలంలో అందేలా అధికారులు పర్యవేక్షించాలన్నారు
సమావేంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి వీవీ అప్పారావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విజయనిర్మళ, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి విద్యాచందన, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి.మాలతి, జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖరశర్మ, మైన్స్ శాఖ ఏడీ సంజయ్, వివిధ శాఖల జిల్లా అధికారులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు తదితరులు పాల్గొన్నారు.
పథకాల ద్వారా..
రైతుబంధు పథకం కింద యాసంగిలో1,30,533 మంది రైతులకు రూ.41.72 కోట్లు అందించినట్లు చైర్మన్ వెల్లడించారు. రైతుబీమా కింద 287 క్లైమ్లకు రూ.14.35 కోట్లు అందించినట్లు తెలిపారు. పంట రుణమాపీ కింద ఇప్పటి వరకు 1,11,692 మంది రైతులకు రూ.510.63 కోట్లు అందించామన్నారు. గత వానాకాలంలో 231 కొనుగోలు కేంద్రాల ద్వారా 67,113 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు చెప్పారు.