పారదర్శకంగా పని చేశాం

పారదర్శకంగా పని చేశాం
  •     ఐదేళ్లలో సభ్యులు సంపూర్ణ మద్దతిచ్చారు
  •     చివరి పాలకవర్గ సమావేశంలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్​రాజు

ఖమ్మం టౌన్, వెలుగు :  జిల్లాలో ఐదేళ్ల పాటు పారదర్శకంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినట్టు  జడ్పీ చైర్మన్ లింగాల కమల్​రాజు అన్నారు. జిల్లా పరిషత్​ పదవీకాలం ముగిస్తున్న సందర్భంగా మంగళవారం చివరి జనరల్​ బాడీ సమావేశం జరిగింది. తొలుత వైద్యం, పశు సంవర్ధక శాఖల ఎజెండాను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి.మాలతి, పశు సంవర్ధక శాఖ ఏడీ రమణి చదివి వినిపించారు. ఇందుకు సభ్యులు గ్రామాలలో జ్వరాలు ఎక్కువగా నమోదవుతున్న ఏరియాలను గుర్తించి, వైద్య శిబిరాలు నిర్వహించాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారికి సూచించారు.

సర్పంచుల పదవీ కాలం ముగియడంతో గ్రామాలలో ఇప్పటికే పారిశుధ్యం లోపించిందన్నారు. విషజ్వరాలు విజృంభిస్తున్నాయని, కనీసం బ్లీచింగ్ కూడా కరువైందని ఆరోపించారు. హాస్టళ్లలో ఉండే స్టూడెంట్స్ విష జ్వరాల బారిన పడుతున్నట్లు చెప్పారు. నియంత్రణకు వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు. జడ్పీ చైర్మన్ లింగాల కమల్​ రాజు మాట్లాడుతూ సభ్యులకు ఏడు నెలలుగా గౌరవ వేతనాలు రావడం లేదని, ఈ విషయాన్ని ఎమ్మెల్సీ తాతా మధు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. తెలంగాణ సమాజ అభివృద్ధి లో పాలకవర్గ సభ్యుల పాత్ర కీలకంమని,  సభ్యులు బాధ్యతగా పని చేశారని తెలిపారు.

పదవి ఉన్నా, లేకున్నా ప్రజల మధ్య ఉండి పని చేస్తే రాజకీయ భవిష్యత్​ ఉంటుందన్నారు. తాతా మధుసూదన్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న 589 జీపీ లలో డంపింగ్ యార్డ్ లు, వైకుంఠధామాల నిర్మాణాలు జడ్పీ చైర్మన్ కమల్ రాజ్ పని తనానికి గుర్తుగా ఉంటాయన్నారు. అనంతరం కమల్ రాజ్ దంపతులను ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ శాలువాతో సన్మానించారు. పాలకవర్గ సభ్యులను కూడా  సత్కరించారు. సభ్యులు ఐదేళ్ల పదవీ కాలంలో తమ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో ఎస్.వినోద్, డిప్యూటీ చైర్మన్ ధనలక్ష్మి, ఆయా జిల్లా శాఖల అధికారులు పాల్గొన్నారు.