ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

అధికారుల తీరుపై జడ్పీ చైర్మన్, ఎమ్మెల్సీ ఆగ్రహం

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: ఎంతో ప్రాధాన్యత కలిగిన జడ్పీ స్టాండింగ్​ కమిటీ సమావేశాలకు జిల్లా అధికారులు రాకుండా కుంటి సాకులు చెబుతూ కింది స్థాయి ఆఫీసర్లను పంపిస్తున్నారని జడ్పీ చైర్మన్​ కోరం కనకయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమం, ఆర్థిక, ప్రణాళిక, వ్యవసాయ స్టాండింగ్​ కమిటీ సమావేశాలు జడ్పీ ఆఫీస్​లో శనివారం జరిగాయి. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్​ మాట్లాడుతూ స్టాండింగ్​ కమిటీ సమావేశాలకు జిల్లా అధికారులే అటెండ్​ కావాలని పలుమార్లు ఆదేశించినా రాకపోవడం సరైంది కాదన్నారు. స్టాండింగ్​ కమిటీ మీటింగ్​ అంటే లెక్కలేకుండా పోతుందన్నారు. అధికారుల పర్యవేక్షణ లోపంతో కొందరు దళిత బంధు లబ్ధిదారులు యూనిట్లను అమ్మేసుకుంటున్నారని తెలిపారు. పోడు దరఖాస్తుల సర్వే విషయంలో ఫారెస్ట్​ అధికారులు ట్రెంచ్​ల పేరుతో ఇబ్బందులు పెట్టవద్దని ఆదేశించారు. ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ మీటింగ్​లకు వచ్చేటప్పుడు ఆఫీసర్లు పూర్తి నివేదికలతో రావాలన్నారు. గత మీటింగ్​లో లేవనెత్తిన సమస్యల పరిష్కారం కోసం తీసుకున్న చర్యలను వివరించాలని అన్నారు. స్కూల్స్​లో పారిశుధ్యం బాగానే ఉందని డీపీవో రమాకాంత్​ చెప్పడంతో సామాన్యుల మాదిరిగా స్కూళ్లను విజిట్​ చేద్దామని ఎమ్మెల్సీ అన్నారు. వివిధ అంశాలపై చర్చించి పలు తీర్మానాలు చేశారు. జడ్పీ సీఈవో విద్యాలత, జడ్పీటీసీలు ఉమాదేవి, పైడి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. 

రామయ్యకు సువర్ణ తులసీదళార్చన

భద్రాచలం, వెలుగు: శ్రీసీతారామచంద్రస్వామికి శనివారం సువర్ణ తులసీదళాలతో అర్చన నిర్వహించారు. గోదావరి నుంచి తీర్థబిందె తెచ్చి గర్భగుడిలో మూలవరులకు సుప్రభాత సేవ చేసి బాలబోగం నివేదించారు. తర్వాత బంగారు తులసీ దళాలతో సీతారామచంద్రస్వామికి అర్చన నిర్వహించారు. అనంతరం రామపాదుకలకు భద్రుడి మండపంలో పంచామృతాలతో అభిషేకం చేశారు. కల్యాణమూర్తులను ప్రాకార మండపానికి తీసుకొచ్చి నిత్య కల్యాణం చేశారు. 43 జంటలు కంకణాలు ధరించి స్వామివారికి కల్యాణ క్రతువు నిర్వహించారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, ఆరాధన తర్వాత జీలకర్రబెల్లం, మాంగల్యధారణ, తలంబ్రాల వేడుక తర్వాత మంత్రపుష్పం నివేదించారు. మాధ్యాహ్నిక ఆరాధనల తర్వాత రాజబోగం సమర్పించారు. సాయంత్రం దర్బారు సేవ జరిగింది.

విద్యాప్రమాణాలు మెరుగుపర్చాలి

ములకలపల్లి,వెలుగు: విద్యా ప్రమాణాలు మరింత మెరుగు పర్చడంపై టీచర్లు దృష్టి పెట్టాలని డీఈవో సోమశేఖర శర్మ ఆదేశించారు. శనివారం ములకలపల్లి, పూసుగూడెం స్కూళ్లలో తొలిమెట్టు కార్యక్రమాన్ని సమీక్షించారు. స్టూడెంట్ల నైపుణ్యాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. సీతారాంపురం స్కూల్లో ముగ్గురు టీచర్లు సెలవుపై వెళ్లడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఏ వన్  పరీక్షలు మొదలవుతున్న దృష్ట్యా టీచర్లు సెలవులు పెట్టడం సరైంది కాదన్నారు. వెనకబడిన స్టూడెంట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. జిల్లా అకాడమిక్ కో ఆర్డినేటర్ నాగరాజు శర్మ ఉన్నారు.  

గిరిజన పూజారులను ఆదుకోవాలి

చండ్రుగొండ,వెలుగు:గ్రామాల్లోని గిరిజన ఆలయాల్లో పని చేసే పూజారులకు ధూప దీప నైవేద్యం పథకాన్ని వర్తింపజేయాలని భారతీయ సర్వ సమాజ్ మహా సంఘ్ రాష్ట్ర అధ్యక్షుడు సామేలు డిమాండ్ చేశారు. శనివారం రావికంపాడు గ్రామంలోని రైతువేదికలో జరిగిన జిల్లా కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలోని 600 గ్రామాల్లో ఇండ్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేయాలని కోరారు. గిరిజన గ్రామాల్లో కనీస మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం తమ సంఘం ప్రభుత్వంపై పోరాటాలు చేస్తుందని తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర నాయకుడు ఫయ్యాజ్, హ్యూమన్  రైట్ కమిషన్ బాధ్యులు జ్ఞాన సుందరి, నాగమణి పాల్గొన్నారు.

వ్యవసాయ పంపుసెట్లకు కెపాసిటర్లు తప్పనిసరి

చండ్రుగొండ, వెలుగు: వ్యవసాయ పంపుసెట్లకు కెపాసిటర్లు అమర్చుకోవాలని విద్యుత్ శాఖ ఏఈ నరసింహారావు సూచించారు. శనివారం రావికంపాడు గ్రామంలో వ్యవసాయ పంపుసెట్లకు కెపాసిటర్లు అమర్చి అవగాహన కల్పించారు. కెపాసిటర్లు పెట్టుకోవడంతో కలిగే లాభాలను వివరించారు. పంపుసెట్లు తక్కువ కరెంట్ తీసుకొని ట్రాన్స్ ఫార్మర్ పై భారం పడకుండా ఉంటుందని చెప్పారు. ఆయన వెంట ఎస్ఎల్ఐ సత్యనారాయణ, ఎల్ఎం సతీశ్, రైతులు ఉన్నారు.

ఇన్నోవేషన్​ చాలెంజ్ లో ప్రతీ స్కూల్​ పాల్గొనాలి

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: ఇన్నోవేషన్​ చాలెంజ్​లో ప్రతీ పాఠశాల రిజిస్ట్రేషన్​ చేయించుకోవాలని డీఈవో సోమశేఖర శర్మ ఆదేశించారు. తెలంగాణ ఇన్నోవేషన్​లో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్​ స్కూల్స్​ నవంబర్​ 5 లోగా ఆన్​లైన్​లో రిజిస్ట్రేషన్​ చేయించుకోవాలని సూచించారు. ఆన్ లైన్​ రిజిస్ట్రేషన్​లో తప్పని సరిగా ఒక టీచర్​ ఇన్​చార్జిగా ఉండి వివరాలను నమోదు చేయాలన్నారు. ఏ సబ్జెక్ట్​ టీచర్​ అయినా ఇన్​చార్జిగా ఉండవచ్చని తెలిపారు. రిజిస్ట్రేషన్​ చేయించుకున్న టీచర్లకు జిల్లా స్థాయిలో నవంబర్​ 16న శిక్షణ ఉంటుందని చెప్పారు. పూర్తి వివరాలకు జిల్లా సైన్స్​ ఆఫీసర్​ చలపతి రాజును సంప్రదించాలని సూచించారు.

డైలీ వేజ్​ వర్కర్ల సమ్మె

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: జిల్లాలోని ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్స్​లలో పని చేస్తున్న డైలీ వేజ్​ కార్మికులు శనివారం నుంచి సమ్మె చేపట్టారు. లక్ష్మీదేవిపల్లి మండలంలో కార్మికులు నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్స్​లలో పని చేస్తున్న తమను పర్మినెంట్​ చేయాలని డిమాండ్​ చేశారు. ప్రతి నెలా జీతాలను ఐదో తేదీలోగా చెల్లించాలని, ఆరు నెలల పెండింగ్​ జీతాలను వెంటనే రిలీజ్​ చేయాలని అన్నారు. చనిపోయిన కార్మికుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం, మహిళలకు ప్రసూతి సెలవులు ఇవ్వాలన్నారు. సమస్యలు పరిష్కరించేంత వరకు ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. 

ఐటీడీఏ ఎదుట టీపీటీఎఫ్​ నిరసన

భద్రాచలం, వెలుగు: గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్​ చేస్తూ టీపీటీఎఫ్​ ఆధ్వర్యంలో శనివారం ఐటీడీఏ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు బి.రాజు మాట్లాడుతూ ఆర్థిక భారం లేని బదిలీలు, పదోన్నతులు కూడా  చేపట్టడం లేదన్నారు. హాస్టళ్లను ఆశ్రమ పాఠశాలలుగా కన్వర్ట్  చేసి కొత్త పోస్టులను మంజూరు చేయకపోవడం సరైంది కాదన్నారు. డిప్యూటీ వార్డెన్లను నియమించాలని, సీఆర్టీలను విధుల్లోకి తీసుకోవాలని, డైలీ వేజ్​ వర్కర్లకు ప్రతి నెలా జీతాలు ఇవ్వాలని డిమాండ్​ చేశారు.  అనవసరపు డిప్యుటేషన్లపై సమీక్ష చేయాలన్నారు. ప్రధాన కార్యదర్శి హరిలాల్, జిల్లా ఉపాధ్యక్షుడు రాంబాబు, కార్యదర్శులు ఉమాదేవి, కిషన్, ఎం రామాచారి, పూర్ణచందర్​రావు పాల్గొన్నారు.

తాను చనిపోతూ.. ఐదుగురి జీవితాలకు వెలుగు

ముదిగొండ, వెలుగు : తమ కుమారుడు చనిపోయాడన్న బాధను భరిస్తూనే అతడి అవయవాలు దానం చేసి మరో ఐదుగురి జీవితాల్లో వెలుగు నింపారు ఆ తల్లిదండ్రులు. వివరాల్లోకి వెళ్తే... ముదిగొండ మాజీ సర్పంచ్‌‌‌‌ ఉసికల సుధారాణి, కాంగ్రెస్‌‌‌‌ నాయకుడు రమేశ్‌‌‌‌ కొడుకు శ్రీకర్‌‌‌‌ (15) శుక్రవారం రాత్రి వెంకటాపురం వద్ద జరిగిన యాక్సిడెంట్‌‌‌‌లో తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని ఖమ్మంలోని హాస్పిటల్‌‌‌‌కు తరలించగా, పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌‌‌‌లోని ఓ ప్రైవేట్‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌కు తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్లు పరీక్షించి శ్రీకర్‌‌‌‌ బ్రెయిన్‌‌‌‌ డెడ్‌‌‌‌ అయినట్లు చెప్పారు. దీంతో అతడి అవయవాలను దానం చేసేందుకు రమేశ్‌‌‌‌ దంపతులు ముందుకు రావడంతో జీవన్‌‌‌‌దాన్‌‌‌‌ సంస్థకు సమాచారం ఇచ్చారు. అనంతరం డాక్టర్లు శ్రీకర్‌‌‌‌ గుండె, కిడ్నీలు, కళ్లు, కాలేయాన్ని సేకరించారు. వాటిని ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తులకు అమర్చనున్నారు. 

హోరాహోరీగా వాలీబాల్​ పోటీలు 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: రాష్ట్ర స్థాయి ఏడో జూనియర్​ వాలీబాల్​ పోటీలు కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో రెండో రోజు హోరాహోరీగా సాగాయి. ఈ పోటీల్లో ప్రతిభ చూపిన క్రీడాకారులతో రాష్ట్ర జట్టును ప్రకటిస్తామని రాష్ట్ర వాలీబాల్​ అసోసియేషన్​ ప్రెసిడెంట్​ గజ్జెట రమేశ్​బాబు తెలిపారు. బాలుర విభాగంలో నిజామాబాద్​ జట్టుపై మహబూబ్​నగర్​ జట్టు 3–1 తేడాతో, నల్గొండ జట్టుపై రంగారెడ్డి జట్టు 3–0తో గెలిచింది. బాలికల విభాగంలో ఖమ్మం జట్టుపై వరంగల్​ జట్టు 3–0, కరీంనగర్​పై నిజామాబాద్​ 3–0, ఆదిలాబాద్​పై రంగారెడ్డి 3–0, మహబూబ్​నగర్​పై నల్గొండ 3–1 తేడాతో విజయం సాధించాయి. జడ్పీ చైర్మన్​ కోరం కనకయ్య, పీఎస్ఆర్​ ట్రస్ట్​ ప్రతినిధులు కంచర్ల చంద్రశేఖర్, వూకంటి గోపాల్​రావు, ఆళ్ల మురళి, ఎండీ రజాక్, అసోసియేషన్​ ప్రతినిధులు హనుమంతరెడ్డి, గోవింద్ రెడ్డి, ఉస్మాన్, పి గణపతి, రవీందర్​రెడ్డి పోటీలను తిలకించారు.

వ్యవసాయ పంపుసెట్లకు కెపాసిటర్లు తప్పనిసరి

చండ్రుగొండ, వెలుగు: వ్యవసాయ పంపుసెట్లకు కెపాసిటర్లు అమర్చుకోవాలని విద్యుత్ శాఖ ఏఈ నరసింహారావు సూచించారు. శనివారం రావికంపాడు గ్రామంలో వ్యవసాయ పంపుసెట్లకు కెపాసిటర్లు అమర్చి అవగాహన కల్పించారు. కెపాసిటర్లు పెట్టుకోవడంతో కలిగే లాభాలను వివరించారు. పంపుసెట్లు తక్కువ కరెంట్ తీసుకొని ట్రాన్స్ ఫార్మర్ పై భారం పడకుండా ఉంటుందని చెప్పారు. ఆయన వెంట ఎస్ఎల్ఐ సత్యనారాయణ, ఎల్ఎం సతీశ్, రైతులు ఉన్నారు.