సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి : విఠల్‌‌రావు

నిజామాబాద్, వెలుగు:  రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని జడ్పీ చైర్మన్‌‌ దాదన్నగారి విఠల్‌‌రావు సూచించారు. బుధవారం ఆయన అధ్యక్షతన జరిగిన జడ్పీ మీటింగ్‌‌లో టీఎస్‌‌ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, కలెక్టర్‌‌‌‌ నారాయణరెడ్డి పాల్గొన్నారు. మీటింగ్‌‌లో ఆయా శాఖల వారీగా ఎజెండా అంశాలపై చర్చించారు. అనంతరం బాజిరెడ్డి మాట్లాడుతూ తాను ఆర్టీసీ చైర్మన్‌‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత జిల్లాకు అవసరమైన బస్సులతో పాటు బస్టాండ్‌‌ల మరమ్మతులు, ప్రహరీల నిర్మాణాలకు నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు. సిబ్బంది సహకారంతో ఆర్టీసీ నష్టాలను కొంతవరకు తగ్గించుకోగలిగామని వివరించారు. నిజామాబాద్ జిల్లాకు త్వరలోనే 40 కొత్త బస్సులను కేటాయించేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. మెయిన్‌‌ రోడ్లకు ఆనుకుని స్థలాలు ఉన్న బస్టాండ్లలో వాణిజ్య సముదాయాలను నిర్మించా లని ప్లాన్‌‌ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ సరిపోవడం లేదని,  రైల్వే స్టేషన్‌‌కు చేరువలో మరింత ఎక్కువ విస్తీర్ణంలో అన్ని వసతులతో కూడిన కొత్త బస్టాండ్‌‌ను నిర్మించేందుకు సీఎంకు ప్రతిపాదనలు అందించామని తెలిపారు. కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూర్చేలా ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు. రైతు బంధు కింద జిల్లా రైతాంగానికి ఎకరాకు రూ.5 వేల చొప్పున ఇప్పటివరకు రూ.2,122 కోట్లను వారి ఖాతాల్లో జమ చేశామన్నారు.

మరో రూ.273 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు చెప్పారు. జనవరి 18 నుంచి జిల్లాలో 70 బృందాలతో అన్ని ఆవాస ప్రాంతాల్లో కంటి వెలుగు కార్యక్రమం కింద నేత్ర పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అవసరమైన వారికి కంటి అద్ధాలు ఉచితంగా అందజేయనున్నట్లు చెప్పారు. మన ఊరు మన బడి కింద ప్రతి మండలంలో కనీసం రెండు ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సదుపాయాల కల్పన పనులన్నీ పూర్తి చేసినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 6,800 డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని, ఇప్పటికే వాటిలో కొన్ని లబ్ధిదారులకు కేటాయించామని కలెక్టర్ వివరించారు. మిగతా ఇండ్లను సంక్రాంతి సందర్భంగా అర్హులైన వారికి అందించేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కాగా, ఎరువులు, పురుగుమందుల కొరత తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ వి.గంగాధర్‌‌‌‌గౌడ్ జిల్లా యంత్రాంగాన్ని కోరారు. అలాగే, అర్హులైన గౌడ కులస్తులకు టీఎఫ్‌‌టీ లైసెన్సులు త్వరితగతిన మంజూరయ్యేలా చూడాలన్నారు. వ్యవసాయ పంట ఉత్పత్తులను ఆరబెట్టుకునేందుకు రైతులు నిర్మించుకునే కల్లాలకు కేంద్ర ప్రభుత్వమే నిధులు సమకూర్చాలని జడ్పీ చైర్మన్ తీర్మానాన్ని ప్రతిపాదించగా సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. సమావేశంలో ఐడీసీఎంఎస్ చైర్మన్ మోహన్, నుడా చైర్మన్ ప్రభాకర్‌‌‌‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్, జడ్పీ సీఈవో గోవింద్, డీఎఫ్‌‌వో వికాస్ మీనా పాల్గొన్నారు.