వికారాబాద్​ కలెక్టర్‌‌పై జడ్పీ చైర్​పర్సన్ సునీతారెడ్డి ఆరోపణలు

వికారాబాద్​ కలెక్టర్‌‌పై జడ్పీ చైర్​పర్సన్ సునీతారెడ్డి ఆరోపణలు
  • ప్రభుత్వ సమావేశాలకు ఉద్దేశపూర్వకంగానే డుమ్మాలు
  • భూ సమస్యలు పరిష్కరించకుండా రైతుల ఉసురు పోసుకుంటున్నరు
  • సీఎం, సీఎస్​కు ఆధారాలతో ఫిర్యాదు చేస్తానని వెల్లడి

వికారాబాద్‌‌, వెలుగు: ప్రజా సమస్యలు పట్టించుకోని కలెక్టర్​తమకొద్దని వికారాబాద్​జడ్పీ చైర్​పర్సన్ ​సునీతారెడ్డి అన్నారు. ముఖ్యమైన ప్రభుత్వ సమీక్ష సమావేశాలకు సైతం కలెక్టర్​ హాజరు కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం వికారాబాద్‌‌ కలెక్టరేట్‌‌లో కంటివెలుగు సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లా మంత్రి, జడ్పీ చైర్​పర్సన్, జడ్పీటీసీలు, ఎంపీపీలు హాజరు కాగా కలెక్టర్​ గైర్హాజరయ్యారు. దీంతో కలెక్టర్​ నిఖిల తీరుపై జడ్పీ చైర్​పర్సన్ ​సునీతారెడ్డి మండిపడ్డారు. జిల్లా సమగ్ర అభివృద్ధిపై చర్చించే జడ్పీ సాధారణ సమావేశాలకు సైతం ఉద్దేశపూర్వకంగానే రావడం లేదని అన్నారు. గత జనరల్‌‌ బాడీ సమావేశానికి గైర్హాజరైనపుడు జిల్లా మంత్రి వారం రోజుల్లో కలెక్టర్‌‌తో సమావేశం నిర్వహిస్తామని హామీ ఇచ్చారని, కానీ ఇప్పటికీ సమావేశం ఏర్పాటుకు ముందుకు రాకుండా తప్పించుకు తిరుగుతున్నారన్నారు. ప్రజాప్రతినిధులుగా ప్రజల సమస్యలు చెబితే ఎవరి మాటా వినకుండా నియంతలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు కనీస గౌరవం ఇవ్వడం లేదన్నారు. జడ్పీటీసీలు, ఎంపీపీలు కలెక్టర్‌‌ ఆఫీసుకు వెళితే డోర్ దగ్గర గంటల తరబడి నిలబెట్టి అపాయింట్‌‌ మెంట్‌‌ కూడా ఇవ్వకుండా అవమానిస్తున్నారన్నారు. కలెక్టర్ అవినీతిపై నిలదీసే ప్రజాప్రతినిధులు,  ప్రజాసంఘాలు, మీడియా ప్రతినిధులపై కక్షసాధింపు చర్యలకు  దిగుతున్నారని చెప్పారు.

ఒక్క రోజైన గ్రామాల్లో పర్యటించారా.. ఏనాడైనా కనీసం మండల కేంద్రాలకైనా వెళ్లారా అని ప్రశ్నించారు. జడ్పీటీసీలు, ఎంపీపీలు, రైతులు సమస్యలపై దరఖాస్తు  చేసుకుందామని వెళితే కనీసం కలిసే తీరిక లేదా అని అన్నారు. అలాంటప్పుడు  మా జిల్లాలో మీరు పనిచేయడం ఎందుకు?  ఇక్కడ ఏమైనా ప్రత్యేక అధికారి పాలన నడుస్తుందా.. మీ తీరుతో మా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని మండిపడ్డారు. జిల్లాలో నెలకొన్న  భూ సమస్యలు, రైతుల సమస్యలు గాలికొదిలేసి  వాళ్ల ఉసురు పోసుకుంటున్నారని అన్నారు. ఇలాంటి అధికారి తమకు అవసరం లేదని, త్వరలో జిల్లా ప్రజాప్రతినిధులు, రైతులతో కలిసి సీఎం కేసీఆర్ కు ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు.  కలెక్టర్ అవినీతి పట్ల జిల్లాలో ఎంతోమంది రైతుల నుంచి తమకు  ఫిర్యాదులు అందాయని,  భూముల సెటిల్‌‌మెంట్లకు  సంబంధించి ఆధారాలతో సీఎస్ కు కూడా ఫిర్యాదు 
చేస్తామన్నారు.