ఆదిలాబాద్‌టౌన్, వెలుగు: సీఎం కేసీఆర్ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నాడని బీజేపీ నేత, జడ్పీ మాజీ చైర్పర్సన్ సుహాసిని రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని కేంద్రీయ గ్రంథాలయంలో నిరుద్యోగ అభ్యర్థులతో కలిసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా మరోసారి నిరుద్యోగుల జీవితాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వానికి ఎన్నికల మీద ఉన్న శ్రద్ధ నిరుద్యోగుల జీవితాలపై లేదని ఎద్దేవా చేశారు. టీఎస్పీఎస్పీ గ్రూప్‌వన్ పేపర్ లీకేజీ ఘటన మరవకముందే రెండోసారి ప్రిలిమ్స్ పరీక్ష రద్దవడం దారుణమన్నారు. వెంటనే టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ర్ట వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నిరుద్యోగు యువతీ, యువకులు పాల్గొన్నారు.