- గురుకుల సీట్ల అక్రమాలపై ఎమ్మెల్యేలు, సభ్యుల మండిపాటు
- మిషన్ భగీరథ, విద్యుత్, ఇరిగేషన్అధికారులపైనా ఫైర్
- కలెక్టర్ వార్నింగ్‌తో సమావేశానికి పరుగెత్తికొచ్చిన ఐబీ ఎస్ఈ.
నల్గొండ అర్బన్, వెలుగు: సమస్యలపై అధికారులకు పట్టింపులేకుండా పోయిందని, ఫోన్లు చేసినా ఎత్తడం లేదని సభ్యులు మండిపడ్డారు. బుధవారం జడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి అధ్యక్షతన నల్గొండ జడ్పీ జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా మిషన్ భగీరథ పథకాన్ని దెబ్బతీశారని తన నియోజకవర్గంలో తాగునీరు సప్లై కావట్లేదని మండిపడ్డారు. స్కీం వైఫల్యానికి ఇంజనీర్లే కారణమని ఆరోపించారు.
హైదరాబాద్ సమీపంలోని చింతపల్లి మండలంలోని పలు గ్రామాలకు నీరు ఇవ్వని అధికారులు చందంపేట, నేరేడుగొమ్ము మండలాలకు నీరు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. మీతో చర్చించినా ఉపయోగం లేదని, నియోజకవర్గంలో 30 బోర్లు వేసినా చుక్కనీరు పడటం లేదని వాపోయారు. ఒక్క ప్రాజెక్టుల్లో కూడా నీరు లేదని, నాలుగు నెలలుగా వర్షాలు కూడా పడడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, మీటింగ్‌కు నీటిపారుదల శాఖ ఏఈలు, డీఈలు వచ్చినా సీఈ రాకపోవడంతో ఎమ్మెల్యేతో పాటు జడ్పీ చైర్మన్ మండిపడ్డారు. జిల్లా అధికారి రాకుండా ఇంజినీర్లు రావడం వల్ల ఉపయోగం లేదని, ఇలా అయితే రివ్యూ చేయడం కష్టమని చెప్పారు. దీంతో కలెక్టర్ కర్ణన్ జోక్యం చేసుకుని సంబంధిత అధికారులతో సీఈకి ఫోన్ చేయించారు. దీంతో ఆయన హుటాహుటిన సమావేశానికి హాజరయ్యారు.
ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతున్నా పట్టించుకోవట్లే
లూజులైన్లు సరిచేయరు.. కొత్త వైరు ఇవ్వరు.. లోడ్‌ఎక్కువై ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతున్నా పట్టించుకోవడం లేదని పలువురు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓవర్‌లోడ్ కింద ట్రాన్స్‌ఫార్మర్లు ఇవ్వకపోవడంతో రైతులు నానా తంటాలు పడాల్సి వస్తోందన్నారు. ట్రాన్స్‌ఫార్మర్ల దిమ్మెలు రైతులతోనే కట్టిస్తూ కాంట్రాక్టర్లు డబ్బులు కాజేస్తున్నారని, ఏబీ స్విచ్‌లు లేకపోవడంతో ఒక్కచోట రిపేరు వస్తే పది నుంచి 15 గ్రామాలకు కరెంట్ సరఫరా నిలిచిపోతుందని మండిపడ్డారు.
పలు మండలాల్లో రహదారులు గుంతలమయంగా మారి వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారని, కనీసం గుంతల్లో మట్టి అయినా పోసి పూడ్చాలని విజ్ఞప్తి చేశారు. వేములపల్లి మండల కేంద్రంలో సర్వీస్‌రోడ్డు లేక ప్రమాదాలు జరుగుతున్నాయని వాపోయారు. త్రిపురారం మండలంలో మిషన్ భగీరథ నీటికి బదులు మురుగు నీరు వస్తోందని ఫిర్యాదు చేశారు. నాంపల్లి, వేములపల్లి, నిడమనూరు మండలాల్లో నీళ్లు సరఫరా కావడం లేదని, కొన్ని గ్రామాలకు వస్తున్నా ఎర్రగా ఉంటున్నాయని సభ దృష్టికి తీసుకెళ్లారు.
ALSO READ: తుది దశకు ఖైరతాబాద్ గణేశ్ విగ్రహ పనులు
ల్యాండ్‌సర్వే ఏడీపై ఎమ్మెల్యే చిరుమర్తి ఆగ్రహం
చిట్యాల మండలంలో ఓ గుట్ట వద్ద ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అవుతోందని సర్వే చేయించినా రిపోర్ట్ ఎందుకు ఇవ్వరని ల్యాండ్‌సర్వే ఏడీని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటన్న మీకు బాధ్యత లేదా..? అని మండిపడ్డారు. ఎనిమిది ఎకరాల భూమి ప్రైవేట్ వెంచర్ వాళ్లు ఆక్రమించుకున్నారని, సర్వే అధికారులకు ఎందుకు సోయి ఉండడం లేదని నిలదీశారు. సర్వే నంబర్ల వారీగా సర్వే చేయాలని, తప్పుడు సర్వే చేస్తే సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ అధికారులు బాధ్యతతో పనిచేసి ప్రజల సమస్యలు పరిష్కరించాలని కోరారు. ప్రజాప్రతినిధుల ఫోన్లు ఎత్తాలని, సభ్యులు లేవనెత్తిన సమస్యలను త్వరగా పరిష్కరించాలని సూచించారు.
గురుకుల సీట్లపై లొల్లి
గురుకులాల్లో ఖాళీగా ఉన్న సీట్లను ఎవరి అనుమతి లేకుండా భర్తీ చేస్తున్నారని, సభ్యులు సభ దృష్టికి తేగా.. ఇక నుంచి తన పర్మిషన్ లేకుండా ఎవరినీ చేర్చుకోవద్దని కలెక్టర్ కర్ణన్ ఆర్‌సీవోలను ఆదేశించారు. ఎన్నికలు సమీపిస్తున్నందున ఓటర్ల జాబితాలో ఓటర్లు పేరు చెక్ చేసుకోవాలని, ఏదైనా కారణంతో తొలగిస్తే మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని కోరారు. జిల్లాలో ఆయిల్ పామ్‌తో పాటు బత్తాయి, మిర్చి పంటలపై దృష్టి సారించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం 15 పైనాన్స్ కమిషన్, ఈజీఎస్కింద చేపట్టనున్న పలు పనులకు సంబంధించి తీర్మానాలు చేశారు.
అలాగే స్వచ్ఛ సర్వేక్షణ్ 2023లో ఉత్తమ జీపీలు నిలిచిన శ్రీనివాస్ నగర్, సింగరాజుపల్లి, జక్కల వారి గూడెం, రాజా గట్టు, తమ్మడపల్లి, వట్టిపల్లి, ఉరుమడ్ల, వాడపల్లి, అప్పాజీపేట, పోచంపల్లి, మునుగోడు, నిడమనూరు, ఏడిపల్లి, కేతపల్లి, నాంపల్లి సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, ఎంపీడీవో, ఎంపీవోలను శాలువా, మెమెంటో, ప్రశంసా పత్రాలతో సన్మానించారు. వీరితో పాటు ఇటీవల రాష్ట్రస్థాయిలో ఉత్తమ అవార్డులు పొందిన టీచర్లను కూడా సత్కరించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు రవీంద్ర కుమార్ నాయక్, చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్ రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, సీఈవో ప్రేమ్ కరణ్ రెడ్డి, సీఈవో కాంతమ్మ, ఆగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహారెడ్డి, ట్రైకార్ చైర్మన్ రాంచంద్రనాయక్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, జడ్పీటీసీలు ఎంపీపీలు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.