- గత ప్రభుత్వం లీడర్లను పట్టించుకోలేదని సీరియస్
- భద్రాద్రి జిల్లా చివరి జడ్పీ మీటింగ్‌లో సభ్యుల ఆవేదన
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఆఫీసర్లు, ప్రజాప్రతినిధుల సమిష్టి కృషితోనే జిల్లా సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని జడ్పీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, కోరం కనకయ్య, రాందాస్ నాయక్ అన్నారు. కొత్తగూడెంలో మైనింగ్ యూనివర్శిటీతో పాటు పాల్వంచ– కొత్తగూడెంలను కలుపుతూ కార్పోరేషన్ ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నారు. పట్టణంలోని కొత్తగూడెం క్లబ్లో ఆదివారం జిల్లా పరిషత్ జనరల్‌బాడీ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా లీడర్లు మాట్లాడారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం జడ్పీటీసీలను పట్టించుకోలేదని పలువురు సభ్యులు పేర్కొన్నారు. ఆఫీసర్లు మీటింగ్‌లలో తాము చెప్పింది విని నోట్ చేసుకుంటారే తప్ప, తర్వాత జరిగే మీటింగ్‌లో ఏ చర్యలు తీసుకున్నారో.. చెప్పడం లేదన్నారు. జిల్లాలోని 21 మండలాలకు గానూ లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్ జడ్పీటీసీలకు మండల పరిషత్‌లలో ప్రత్యేక రూంలు ఏర్పాటు ఎన్ని సార్లు చెప్పినా అధికారులు పట్టించుకోలేదని జడ్పీటీసీలు మేరెడ్డి వసంత, బిందు చౌహాన్ ఆవేదన వ్యక్తం చేశారు. మండల పరిషత్ జనరల్ బాడీ మీటింగ్‌లో తాను నిలబడి నిరసన వ్యక్తం చేసినా ఫలితం లేకుండా పోయిందని జడ్పీటీసీ వసంత వాపోయారు.
కొత్తగూడెంలోని గవర్నమెంట్ జనరల్ హాస్పటల్లో కరెంట్ లేకపోతే అరగంట అయినా జనరేటర్ వేయకపోవడంతో రోగులు ఇబ్బందులు పడ్తున్నారని పలువురు ప్రజాప్రతినిధులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. రైతులతో పాటు మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా పలు ప్రణాళికలను రూపొందిస్తున్నామని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ పేర్కొన్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో చిన్న చిన్న నీటి కుంటల్లో కొరమీను చేపల పెంపకం, మునగ చెట్ల పెంపకాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టనున్నట్టు తెలిపారు.
జనరల్ బాడీ మీటింగ్‌లోనే వీడ్కోలు..
కొత్తగూడెం క్లబ్లో ఏర్పాటైన జడ్పీ జనరల్ బాడీ చివరి మీటింగ్‌ను జిల్లా పరిషత్ సభ్యుల వీడ్కోలు ఆత్మీయ సమ్మేళనం ప్రోగ్రాంలో ఏర్పాటు చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. వీడ్కోలు ప్రోగ్రాం కోసం జనరల్ బాడీ మీటింగ్‌ను ఆఫీసర్లు మమ అనిపించారు. వీడ్కోలు ప్రోగ్రాంను మాత్రం హంగూ, ఆర్బాటాల మధ్య నిర్వహించారు. జడ్పీ చైర్మన్‌తో పాటు ఎమ్మెల్యేలు, జడ్పీటీసీలు, ఎంపీపీలను పలు శాఖల అధికారులు సన్మానించారు.