రుణమాఫీ అందరికీ వర్తించేలా చర్యలు

  •     జడ్పీ మీటింగ్​లో  చైర్మన్​ విఠల్​రావు
  •     సాదాసీదాగా  జడ్పీ మీటింగ్

నిజామాబాద్​, వెలుగు : జిల్లాలోని రైతులందరూ గత ప్రభుత్వం మంజూరు చేసిన రూ.లక్ష పంట రుణమాఫీ వర్తించేలా చర్యలు తీసుకోవాలని జడ్పీ మీటింగ్​లో సభ్యులు తీర్మానించారు. బుధవారం జడ్పీ చైర్మన్​ విఠల్​రావు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో పంట రుణమాఫీపై సభ్యులు ప్రశ్న లేవనెత్తగా లీడ్​ బ్యాంక్​ మేనేజర్​ సత్యనారాయణ చొరత తీసుకోవాలని కోరారు. ఖరీఫ్​లో 12 లక్షల మెట్రిక్​ టన్నుల దిగుబడి రాగా 8 లక్షల టన్నులు కొనుగోలు చేయాలని నిర్ణయించామన్నారు.

అయితే రైతుల నుంచి కేవలం 4 లక్షల టన్నులు మాత్రమే కొన్నామని చైర్మన్ చెప్పారు.  మద్దతు ధరకంటే రైస్​మిల్లర్లు ఎక్కువ రేటు చెల్లించి కొనుగోలు చేయడంతో మెజారిటీ రైతులు అటే వెళ్లారని వివరించారు.  వడ్ల కొనుగోళ్లకు సంబంధించి50,732 మంది రైతులకు  80 శాతం పేమెంట్ చేశామన్నారు. మిగితా డబ్బు వారంలో చెల్లిస్తామని సివిల్​ సప్లై ఆఫీసర్​ జగదీశ్ సభ్యుల ప్రశ్నకు ఆన్సర్​ ఇచ్చారు. సీఎంఆర్​ రైస్​ కూడా 92 శాతం సేకరించామన్నారు. జిల్లాలోని 259 రేషన్​ షాపుల ద్వారా ప్రతి నెలా 4,15,200 కార్డులకు బియ్యం అందిస్తున్నామని డీఎస్వో చంద్రప్రకాశ్ తెలిపారు.

కొత్త రేషన్​ కార్డుల జారీపై అడిగిన ప్రశ్నకు గవర్నమెంట్​ ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నామన్నారు.   పింఛన్​ వయస్సు 57 యేండ్లకు తగ్గించిన నేపథ్యంలో  ప్రతి ఒక్కరూ లాభం పొందేలా సర్కారుకు నివేదిక పంపాలని  ఆఫీసర్లకు సభ్యులుసూచించారు. గ్రామాల్లో గోపాలమిత్రులను అపాయింట్​ చేసుకునేటప్పుడు స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వాలని వెటర్నరీ శాఖ అధికారులను కోరగా వారు అంగీకరించారు. గవర్నమెంట్​ స్కూల్స్​లో జరిగిన దొంగతనం ఘటనలను మీటింగ్​లో కొందరు సభ్యులు లేవనెత్తారు.

నైట్​ వాచ్​మెన్​లు, అటెండర్లను నియమించుకొని సామగ్రికి భద్రత కల్పించాలని డీఈవో దుర్గాప్రసాద్ కు జడ్పీ చైర్మన్​ సూచించారు.  సీజనల్​ రోగాలపై వైద్య శాఖ సిబ్బందిని అలర్ట్​ చేశామని డీఎంహెచ్​వో సుదర్శనం తెలిపారు. ఏఎన్​ఎంలు, ఆశా వర్కర్లతో  సర్వే చేయించి ఇళ్లకే మందులు పంపాలని సభ్యులు సూచించారు. మీటింగ్​లో అదనపు కలెక్టర్​ చిత్రామిశ్రా, సీఈవో గోవింద్​నాయక్​  తదితరులు ఉన్నారు.