మహబూబ్‌నగర్, వెలుగు : జడ్పీ మీటింగులు సక్కగా సాగడం లేదు. ఎంజెండాలోని అంశాల వారీగా చర్చ జరగాల్సి ఉన్నా.. దాన్ని పక్కన పెట్టేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని నాగర్‌కర్నూల్ జడ్పీ మీటింగ్ ఆగస్టులో, నవంబర్‌లో పాలమూరు, నారాయణపేటలో, ఇటీవల వనపర్తిలో మీటింగులు జరిగాయి. ఈ మీటింగులను పరిశీలిస్తే అధికార పార్టీ సభ్యులు ఏడాదిన్నరగా బిల్లులు చెల్లించడం లేదని, పనులు పెండింగ్‌లో పెట్టారని విద్య, వైద్యం, మైనింగ్, ఎలక్ట్రిసిటీ, ఆర్‌డబ్ల్యూఎస్ లాంటి నాలుగైదు శాఖల అధికారులనే నిలదీస్తున్నారు. ప్రజలకు తాము సమాధానం చెప్పుకోలేకపోతున్నామని వాగ్వాదం చేస్తూ సాయంత్రం వరకు సాగదీస్తున్నారు. ఉన్న టైం అయిపోవడంతో మిగతా శాఖలపై చర్చ చేయకుండానే సభకు ఎండ్ కార్డు పడుతోంది.
ఏడాదిన్నరగా అదే చర్చ..
ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కు సంబంధించి కొందరు రైతులు డీడీలు కట్టినా ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వడం లేదని.. ఇతర కరెంటు సామన్లు అందించడం లేదని సభ్యులు మండిపడుతున్నారు. అయితే, కరోనా కారణంగా ఇనుము రేట్ భారీగా పెరిగింది. గవర్నమెంట్‌కు ట్రాన్స్ఫార్మర్లు ఇతర సామగ్రిని సప్లై చేస్తున్న కాంట్రాక్టర్సరఫరాను తగ్గించేశాడు. పెరిగిన రేట్‌కు అనుగునణంగా ధరలు ఇవ్వాలని ఏడాదిన్నరగా గవర్నమెంట్‌ను కోరుతున్నా స్పందించడం లేదు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ర్టిసిటి మెటీరియల్ కొరత ఉంది. ఈ విషయాలన్నీ అధికార పార్టీ సభ్యులకు తెలిసినా పదే పదే ఇదే శాఖపై.. ఇవే అంశాలపై చర్చ కొనసాగిస్తున్నారు.
రెగ్యులర్ డాక్టర్లు లేరని తెలిసినా..
హెల్త్డిపార్ట్మెంట్కు సంబంధించి సభ్యులు పీహెచ్సీలలో డాక్టర్లు లేరని, మెడిసిన్ ఇవ్వడం లేదని ఆఫీసర్లపై ఫైర్అవుతున్నారు. కానీ, పీహెచ్సీలలో చాలా కాలం నుంచి ప్రభుత్వం రెగ్యులర్డాక్టర్లను నియమించడం లేదు. కేవలం ఔట్ సోర్సింగ్ సిబ్బందితో నెట్టుకొస్తోంది. వారిలో కూడా చాలా మంది పీజీలు చదివేందుకు వెళ్లిపోయారు. దీంతో పీహెచ్సీలలో ఎవరూ ఉండటం లేదు. దీనికితోడు రెగ్యులర్ జబ్బులకు తప్ప అత్యవసర సమయాల్లో అవసరం అయ్యే మెడిసిన్‌ను ప్రభుత్వం సప్లై చేయడం లేదు. జిల్లా ఆస్పత్రుల్లోనూ యాంటిబయాటిక్స్ సప్లై లేక, హాస్పిటల్ ఫండ్స్ నుంచి వాటిని తెప్పిస్తున్నారు.
భగీరథ స్టార్ట్ అయినప్పటి నుంచి అవే సమస్యల ప్రస్తావన
మిషన్‌భగీరథకు సంబంధించి ఫీల్డ్ లెవెల్‌లో వంద శాతం పనులు పూర్తి కాలేదు. కొన్ని గ్రామాలు అప్పర్ ప్లాట్‌లో ఉండటంతో నీటి సంపులు కట్టించి ట్యాంకులకు నీళ్లు ఎక్కించాల్సి ఉంది. కానీ, ఈ పనులు నాలుగేండ్లుగా పెండింగ్‌లో ఉన్నాయి. పాత పైపులైన్లకు కనెక్షన్లు ఇవ్వడంతో కొన్ని గ్రామాల్లో పైపులైన్లు పగిలి నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. అయితే కాంట్రాక్టర్లకు బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో వాళ్లు వీటిని మెయిన్టెనెన్స్చేయడం లేదు. అధికారులు ఔట్ సోర్సింగ్సిబ్బందితోనే ఈ పనులు చేయిస్తున్నారు.
బిల్లులు రావడం లేదని తెలిసినా..
‘మన ఊరు-మన బడి’ పరిస్థితి కూడా ఇలానే ఉంది. పనులు ఎప్పుడు పూర్తి చేస్తారని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ఆఫీసర్లపై అధికార పార్టీ సభ్యులు మండిపడుతున్నారు. నిజానికి ఈ స్కీం కింద పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు బిల్లులు రాకపోవడంతోనే పనులు పెండింగ్‌లో పెడుతున్నారు. కేవలం ఎన్ఆర్ఈజీఎస్కింద చేపట్టిన పనులకు మాత్రమే కొందరికి బిల్లులు క్లియర్ అయ్యాయి. ప్రస్తుతం కొత్త పనులకు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. ఇవన్నీ తెలిసినా.. సభ్యులు మాత్రం ఇవే అంశాలను ప్రశ్నిస్తున్నారు.
ఇసుక దందా వద్దకు రానివ్వడం లేదని..
ఉమ్మడి జిల్లాలోని కొందరు ఎమ్మెల్యేలు వారి షాడోలతో ఇసుక అక్రమ దందా చేస్తున్నారు. లోకల్‌గా ఉండే జడ్పీటీసీలు, ఎంపీపీలను ఈ దందాలోకి రానివ్వడం లేదు. దీంతో కొందరు సభ్యులు జడ్పీ మీటింగుల్లో మైనింగ్ ఆఫీసర్లపై గరం గరం అవుతున్నారు. అక్రమ దందాను నిరోధించడం చేతనైతుందా? కాదా? అని ప్రశ్నిస్తున్నారు. మన ఊరు– మనబడి, మిషన్ భగీరథ విషయంలోనూ ఇలా
వ్యవహరిస్తున్నారు.
ప్రతిపక్షాలకు మాట్లాడే చాన్స్ఇవ్వట్లే..
ప్రతిపక్ష పార్టీ సభ్యులకు జడ్పీ మీటింగుల్లో మాట్లాడే చాన్స్కూడా ఇవ్వడం లేదు. వారు మైక్ అందుకునే సరికి అధికార పార్టీ సభ్యులు మరో సమస్యను లేవనెత్తుతూ అందరూ అదే టాపిక్ మీద మాట్లాడేలా చేస్తున్నారు. మీటింగులకు హాజరవుతున్న చీఫ్ గెస్ట్‌లు, జడ్పీ చైర్పర్సన్లు మొత్తం రూలింగ్పార్టీ వారే కావడంతో.. ప్రతిపక్ష సభ్యులు మాట్లాడనివ్వకుండా స్కిప్ చేసేస్తున్నారు. ఫైనల్ ఈ శాఖలపైనే సుదీర్ఘంగా చర్చించి, సభను ముగిస్తున్నారు.