- సూర్యాపేట జడ్పీ మీటింగ్‌లో సభ్యుల తీర్మానం
- కర్నాటక సర్కారుతో మాట్లాడి ఆల్మట్టి నీటిని తెప్పించాలి
- రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్
- గ్రామాలకు మిషన్ భగీరథ నీళ్లొస్తలేవ్
- కమీషన్లకు అడ్డాగా లేబర్ డిపార్ట్‌మెంట్
- సూర్యాపేట జడ్పీ మీటింగ్‌లో సభ్యుల మండిపాటు
సూర్యాపేట, వెలుగు: కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు పరిధిలోకి సాగునీటి ప్రాజెక్టులను తీసుకురావొద్దని సూర్యాపేట జడ్పీ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం జిల్లా కేంద్రంలో శనివారం సూర్యాపేటలో జడ్పీ చైర్ పర్సన్ గుజ్జా దీపిక అధ్యక్షతన జనరల్ బాడీ మీటింగ్‌లో తీర్మానించారు. ఈ మీటింగ్‌కు హాజరైన రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ.. కేఆర్‌ఎంబీ పరిధిలోకి సాగునీటి ప్రాజెక్టులు వెళ్తే రాష్ట్రం హక్కులను కోల్పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
సాగర్‌లో నీటి లభ్యత లేకపోవడంతో వేసవిలో తాగునీటి సమస్య వచ్చే ప్రమాదం ఉందని, ఎడమ కాలువకు నీటిని వదిలి చెరువులను నింపాలని కోరారు. పాలేరుకు వెళ్తున్న నీటిని మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాల్లోని చెరువులు నింపాలని సూచించారు. శ్రీశైలం నీటితో పాటు కర్నాటక ప్రభుత్వంతో మాట్లాడి ఆల్మట్టి డ్యామ్ నుంచి సాగర్‌కు నీటిని విడుదల చేయించాలని కోరారు.
రోజుల తరబడి నీళ్లొస్తలేవు
అంతకుముందు సభ్యులు మాట్లాడుతూ గ్రామాలకు రోజుల తరబడి మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని , ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే వేసవిలో ఎలా ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేశారు. హుజూర్ నగర్ అమరరామ్ గ్రామంలో 12 రోజులుగా నీళ్లు రావడం లేదని సభ దృష్టికి తెచ్చారు. మిషన్ భగీరథ నీటిని శుద్ధి చేయకుండానే సరఫరా చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో డాక్టర్లు అందుబాటులో ఉండడం లేదని, మాత శిశు కేంద్రంలో గర్భిణులను పట్టించుకోకపోవడంతో ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్తున్నారని వాపోయారు. నేరేడుచర్ల, పాలకీడు బస్తీ దవాఖానలో డాక్టర్లు, స్టాఫ్‌ను ఇప్పటికీ నియమించలేదని మండిప్డడారు. మఠంపల్లిలో సర్వే నెంబర్ 540లోని భూములను బ్లాక్ లిస్ట్‌లో పెట్టడంతో పట్టదారులు అమ్ముకోలేని పరిస్థితి నెలకొందని, వెంటనే బ్లాక్ లిస్ట్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
అర్వపల్లి మండలంలో అక్రమ మైనింగ్ జోరుగా సాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే ఫెనాల్టీ వేసి చేతులు దులుపుకుంటున్నారని అన్నారు. గత 10 ఏండ్లుగా ఎస్సీ కార్పొరేషన్ లోన్లు రావడం లేదని, ఎస్టీ కార్పొరేషన్ ద్వారా ఒక్కసారి మంజూరు చేసినా.. కానీ నేటి వరకు ఫండ్స్ రాలేదన్నారు. మహాలక్ష్మి పథకంతో బస్సులలో రద్దీ పెరిగిందని, గ్రామాలకు బస్సు సర్వీస్ పెంచాలని కోరారు. జిల్లా కార్మిక శాఖలో దళారులు లేనిదే పనులు జరగడం లేదని ఆరోపించారు. ఏండ్ల కొద్దీ డెత్ క్లెయిమ్‌లు చేయకుండా ఆఫీసుల చుట్టూ తిప్పుతున్నారని మండిపడ్డారు. ప్రజా ప్రతినిధులు చెప్పినా అధికారులు వినడం లేదన్నారు.
ప్రతి నియోజకవర్గానికి రూ.10 కోట్లు: కలెక్టర్
జిల్లాలోని ప్రతి నియోజకవర్గానికి ప్రభుత్వం రూ. 10 కోట్లు మంజూరు చేసిందని, అత్యవసర పనులకు రూ. కోటి వరకు ఖర్చు చేసుకోవచ్చని కలెక్టర్ వెంకట్‌రావు తెలిపారు. రైతుభరోసా పథకంలో భాగంగా 2023 వానాకాలం పంటకు 2,76,764 రైతులకు రూ.310.82 కోట్లు, యాసంగికి ఇప్పటి వరకు 1,19,965 రైతులకు రూ. 46.28 కోట్లు అందించామని చెప్పారు.
వేసవిలో తాగునీటి కొరతను రాకుండా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. అనంతరం కలెక్టర్ వెంకట్‌రావు బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా సభ్యులు ఆయనను సన్మానించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ గోపాగాని వెంకట నారాయణ, జడ్పీ సీఈవో సురేశ్, డీఆర్డీవో కిరణ్ కుమార్, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
తాగు, సాగునీటికి ప్రాధాన్యం ఇవ్వండి : జడ్పీ చైర్‌పర్సన్
జిల్లాలో తాగు, సాగు ప్రాధాన్యం ఇవ్వాలని జడ్పీ చైర్‌పర్సన్ గుజ్జ దీపికాయుగంధర్ అధికారులను ఆదేశించారు. యాసంగిలో 3 .67 లక్షల ఎకరాలలో వరి పంట సాగైందని, పంట చేతికొచ్చే వరకు సాగునీరు అందించాలని సూచించారు. వేసవిలో ఎక్కడ కూడా తాగునీటి ఇబ్బందులు రానివ్వొద్దని, ఈ మేరకు ముందస్తు చర్యలు చేపట్టాలని మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు.