కల్తీపాలపై చర్యలేవి?.. జడ్పీ మీటింగ్​లో మెంబర్లు

  • మార్చురీలో శవాలను పీక్కుతింటున్న ఎలుకలు
  • బ్లాస్టింగ్‌‌తో ఇండ్లు కూలిపోతున్నయ్
  • జడ్పీ మీటింగ్​లో మెంబర్లు 

యాదాద్రి, వెలుగు: రోజుకో చోట కల్తీపాలు పట్టుబడుతున్నా ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌‌మెంట్‌‌ అధికారులు ఏం చేస్తున్నారని  జడ్పీ మెంబర్లు ప్రశ్నించారు. మంగళవారం జడ్పీ చైర్మన్​ ఎలిమినేటి సందీప్​రెడ్డి అధ్యక్షతన జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా  మెంబర్లు తమ పరిధిలోని సమస్యలను సభ దృష్టికి తెచ్చారు.  వ్యాపారులు పాలను కల్తీ చేస్తుండడంపై ఆందోళన వ్యక్తం చేశారు.  ఇక్కడి నుంచి ప్రతిరోజూ వేల లీటర్ల పాలు హైదరాబాద్‌‌కు సరఫరా అవుతున్నాయని, వీటి విషయంలో నిఘా అవసరమన్నారు.  

పాల ఉత్పత్తులు కల్తీ కాకుండా ఫుడ్​ సేఫ్టీ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. భువనగిరి మార్చురీని ఆధునీకరించకపోవడంతో  శవాలను ఎలుకులు పీక్కొని తింటున్నాయని మండిపడ్డారు. ఆలేరు సీహెచ్​సీలో వైద్య సేవలు అందడం లేదని సభ దృష్టికి తెచ్చారు.  విచ్చలవిడిగా మైనింగ్​అనుమతుల కారణంగా బ్లాస్టింగ్‌‌లు జరుపుతుండడంతో ఇండ్లు కూలిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. చౌటుప్పల్ జడ్పీటీసీ ప్రభాకర్‌‌‌‌ రెడ్డి మాట్లాడుతూ మూసీ పరివాహక ప్రాంతంలోనే ఎక్కువగా పంటలు పండుతున్నాయని, మిగిలిన ప్రాంతాల్లో కరువు పరిస్థితులే ఉన్నాయన్నారు.  

జిల్లాను కరువు ప్రాంతంగా తీర్మానం చేయాలని కోరారు.  ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న రైతు వేదికలు వృథాగా ఉంటున్నాయని, చాలామంది రైతులకు రుణమాఫీ జరగలేదన్నారు.  పింఛన్లు లేటుగా ఇస్తుండడంతో లబ్ధిదారులకు ఇబ్బంది కలుగుతోందన్నారు.  సదరం స్లాట్​ బుక్సింగ్​ పరిమితంగా ఉండడంతో దివ్యాంగులకు న్యాయం జరగడం లేదని వాపోయారు. 

సమస్యలు పరిష్కరించండి

ప్రజాసమస్యలు దృష్టికి వచ్చిన వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని యాదాద్రి కలెక్టర్​ వినయ​ కృష్ణారెడ్డి ఆఫీసర్లను ఆదేశించారు. చిన్నచిన్న సమస్యలను కూడా పరిష్కరించకపోవడంతో మెంబర్లు పదేపదే ప్రస్తావిస్తున్నారని తెలిపారు.  వడ్ల  ట్రాన్స్​పోర్ట్​ కోసం ఈ సారి ట్రాక్టర్లను ఉపయోగిస్తామని చెప్పారు.  మార్చురీ ఆధునీకరణ, హాస్పిటల్స్​లో వసతులపై సిఫారసులు చేస్తామన్నారు. డ్యూటీ సరిగా చేయని డాక్టర్స్​పై డిపార్ట్​మెంట్​పరంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ మీటింగ్లో  జడ్పీ సీఈవో కష్ణారెడ్డి, కాంగ్రెస్​ జడ్పీ ప్లోర్​ లీడర్​ డాక్టర్ కుడుదుల​ నగేశ్​, జడ్పీటీసీలు, ఎంపీపీలు, అన్ని డిపార్ట్​మెంట్ల ఆఫీసర్లు ఉన్నారు.