సమస్యలపై చర్చించకుండానే .. జడ్పీ సర్వసభ్య సమావేశం ముగించేశారు

సమస్యలపై చర్చించకుండానే  ..  జడ్పీ సర్వసభ్య సమావేశం ముగించేశారు
  • విద్యుత్ సరఫరాపై కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్
  • బిల్లులు విడుదల చేయాలని మొర పెట్టుకున్న పలువురు సభ్యులు

సూర్యాపేట, వెలుగు: సూర్యాపేట చివరి జడ్పీ సర్వసభ్య సమావేశం సమస్యలపై చర్చించకుండానే ముగిసింది. జడ్పీ చైర్ పర్సన్ గుజ్జా దీపిక అధ్యక్షతన బుధవారం నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సమేల్ పాల్గొన్నారు. విద్యుత్ రంగంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఎన్ని గంటల కరెంట్ ఇస్తున్నారో చెప్పాలని జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ విద్యుత్ అధికారులను కోరారు.

దీంతో కాంగ్రెస్ సభ్యులు జోక్యం చేసుకొని 24 గంటల కరెంట్ అంటూ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అసత్యాలు ప్రచారం చేసిందని అడ్డుకున్నారు. సబ్ స్టేషన్లలో లాగ్ బుక్​లను బయటపెట్టి ఈ బాగోతాన్ని ప్రస్తుత మంత్రి కోమటి రెడ్డి వెంకట్​ రెడ్డి బయటపెట్టారన్నారు. కావాలనే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు.

అయితే, దీనిపై అధికారులు సమాధానం చెప్పాలంటూ బీఆర్ఎస్ నాయకులు పట్టుబట్టడంతో గతంలో రైతులకు 18 గంటలు కరెంట్ అందిస్తే, ప్రస్తుతం 18.15 గంటల కరెంట్ సరఫరా చేస్తున్నామని స్పష్టం చేశారు. నాగార్జున సాగర్​లో నీటి నిల్వలు లేకపోవడంతో కరెంట్ ఉత్పత్తి జరగడం లేదని, అయినా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు. 

సమస్యలపై నిలదీత 

గ్రామాల్లో తాగునీటి కింద చేసిన పనులకు ఆరు నెలలు గడిచినా బిల్లులు రావడం లేదని, ఫండ్స్ ఉన్న క్వాలిటీ పేరుతో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని పలువురు సభ్యులు మండిపడ్డారు. కరెంట్ పోల్స్ కోసం రైతులు డీడీలు కట్టి నిరీక్షిస్తున్నారన్నారు. అర్వపల్లి యోగానంద లక్ష్మీనరసింహ స్వామి దేవాలయ సమీపంలోనే వైన్స్ షాప్స్ నడిపిస్తున్నారని మూడేండ్లుగా ఫిర్యాదు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు.  

విరమణ ప్రజాసేవకు కాదు

విరమణ పదవికే కానీ, ప్రజా సేవకు కాదని జడ్పీ చైర్ పర్సన్ గుజ్జ దీపికా యుగేందర్ అన్నారు. పార్టీలకతీతంగా జడ్పీ సభ్యులందరం కలసిమెలిసి ఉన్నామని తెలిపారు. రాజకీయంగా ఎదగడానికి తన భర్త యుగంధర్ ప్రోత్సాహం ఎంతో ఉందని తెలిపారు.