పాలమూరు, వెలుగు: రూ.2.38 కోట్ల పదిహేనో ఫైనాన్స్ ఫండ్స్‌తో పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు జడ్పీ పాలకవర్గం తీర్మానించింది. జడ్పీ చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం జడ్పీ మీటింగ్ హాల్లో జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. అసెంబ్లీ సమావేశాలు ఉండడంతో జిల్లాలోని ముగ్గురు ఎమ్మెల్యేలు సభకు హాజరు కాలేదు.
ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ 15వ ఆర్థిక సంఘం నిధులను అభివృద్ధి పనులకు కేటాయిస్తూ తీర్మానించినట్లు తెలిపారు. స్కూల్స్, గవర్నమెంట్ ఆఫీసుల్లో సౌలతులు కల్పించడంతో పాటు కౌకుంట్ల పీహెచ్సీ బిల్డింగ్ నిర్మాణానికి రూ.75 లక్షలు కేటాయించినట్లు చెప్పారు. ఇదిలాఉంటే అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండడంతో ఎమ్మెల్యేలు హాజరు కాలేదని, ఈ సమయంలో జడ్పీ సమావేశం పెట్టడం సరికాదని జడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, జడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు.
దీంతో సభను ఈనెల 29న మరోసారి సమావేశం నిర్వహించనున్నట్లు జడ్పీ చైర్పర్సన్ తెలిపారు. జడ్పీ సీఈవో రాఘవేంద్రరావు, అడిషనల్ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, డిప్యూటీ సీఈవో శర్మ, జడ్పీటీసీలు కల్యాణి, అరవింద్ రెడ్డి, వెంకటేశ్వరమ్మ, నిర్మల పాల్గొన్నారు.