మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

కోస్గి టౌన్, వెలుగు: కోస్గి మండలం గుండుమాల్‌‌ జడ్పీహెచ్‌‌ఎస్‌‌ స్టూడెండ్లు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు హెచ్‌‌ఎం వెంకటరాముడు తెలిపారు.  శుక్రవారం ఆయన మాట్లాడుతూ నారాయణపేట అథ్లెటిక్స్ అసోసియేషన్‌‌ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో షాట్‌‌పుట్‌‌లో విక్రమ్ రాథోడ్, 300 మీటర్లు రన్నింగ్ రేసులో చిన్న మల్లమ్మ జిల్లాలో ఫస్ట్‌‌ ప్లేస్‌‌, లాంగ్ జంప్‌‌లో దస్తమ్మ  సెకండ్ ప్లేస్‌‌లో నిలిచారన్నారు.  ఈ నెల 25న మెదక్‌‌లో జరగనున్న రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొననున్నాని చెప్పారు. అంతకుముందు  విద్యార్థులతో పాటు  పీఈటీ రాకేశ్‌‌కు సన్మానించారు.

మహనీయులను స్ఫూర్తిగా తీసుకోవాలి

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు :  భారత దేశానికి స్వేచ్ఛా వాయువులు అందించిన స్వాతంత్ర్య సమరయోధులను స్ఫూర్తిగా తీసుకోవాలని  జడ్పీ చైర్ పర్సన్ పద్మావతి పిలుపునిచ్చారు.  వజ్రోత్సవాల్లో భాగంగా గ్రామ, మండల, జిల్లా స్థాయిలో నిర్వహించిన ఫ్రీడమ్ కప్‌‌ విజేతలకు శుక్రవారం జిల్లా కేంద్రంలోని జడ్పీ బాయ్స్ స్కూల్‌‌లో బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రీడల్లో గెలుపోటములను సమానంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, అదనపు కలెక్టర్ మనూ చౌదరి పాల్గొన్నారు. 

ఆర్‌‌‌‌ఎంపీలపై చర్యలు తీసుకోండి

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: అల్లోపతి డాక్టర్లుగా చలామణి అవుతున్న ఆర్ఎంపీలపై చర్యలు తీసుకోవాలని కేవీపీఎస్‌‌ జిల్లా అధ్యక్షుడు కాశన్న డిమాండ్ చేశారు. శుక్రవారం నాగర్ కర్నూల్ డిప్యూటీ డీఎంహెచ్‌‌వో వెంకట దాస్‌‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  జిల్లాలో ఆర్ఎంపీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, జ్వరం, దగ్గు లాంటి చిన్న రోగాలకు కూడా టెస్టుల పేరిట వేలల్లో ఫీజులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు.  ప్రభుత్వ హాస్పిటల్ ముందు నిబంధనలకు విరుద్ధంగా క్లినిక్ నడుపుతున్నా జిల్లా ఆఫీసర్లు పట్టించుకోవడం లేదన్నారు.  ఈ కార్యక్రమంలో కేవీపీఎస్‌‌ జిల్లా ఉపాధ్యక్షుడు చింత శివ కుమార్, నేతలు చంద్రయ్య, రాములు పాల్గొన్నారు. 

ప్రజాధనం వృథా చేస్తున్న అధికారులు

కల్వకుర్తి, వెలుగు: అధికారులు కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని వృథా చేస్తున్నారని మాజీ మంత్రి, టీఆర్‌‌‌‌ఎస్‌‌ సీనియర్‌‌‌‌ నేత చిత్తరంజన్‌‌ దాస్‌‌ మండిపడ్డారు.  శుక్రవారం  కల్వకుర్తిలోని ఇండోర్ స్టేడియం, డబుల్ బెడ్‌‌ రూమ్ ఇండ్లను పరిశీలించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇండ్లలో సామగ్రి పాడవుతోందని, అధికారులు సెక్యూరిటీ గార్డును కూడా పెట్టకపోవడం సరికాదన్నారు.  కొంత కేర్‌‌‌‌ తీసుకుంటే అన్నింటినీ వినియోగంలోకి తేవచ్చన్నారు. ఈ ప్రాంత నాయకులు, అధికారులు కావాలనే సీఎం కేసీఆర్‌‌‌‌ బద్నాం చేస్తున్నారని ఆరోపించారు. ఆయన వెంట తలకొండపల్లి ఎంపీపీ నిర్మల శ్రీశైలంగౌడ్, నాయకులు పెద్దయ్య యాదవ్, శశి కుమార్ గౌడ్, సదానందం, పుట్ట శేఖర్ ముదిరాజ్, కానుగుల శేఖర్, రామాంజనేయులు  పాల్గొన్నారు.

ఎన్నికల సంస్కరణలు చేపట్టాలి

గద్వాల,వెలుగు:   ఎన్నికల సంస్కరణలు చేపట్టాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.  శుక్రవారం గద్వాల స్మృతి వనంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌‌లో వారు మాట్లాడుతూ..  మారిన పరిస్థితులకు అనుగుణంగా ప్రజా ప్రాతినిత్య చట్టం–1951కి సవరణలు చేయాలని కోరారు.  65 ఏళ్లు పైబడిన వారు ఎంపీ, ఎమ్మెల్యేలు పోటీ చేయకూడదని,  రెండుసార్లు ఎన్నికైతే మూడోసారి అవకాశం లేకుండా చేయాలన్నారు.   బ్యాలెట్‌‌ పేపర్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని,  ఎంపీ, ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే అధికారం కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలకు ఉండాలన్నారు. ఈ మేరకు ఎన్నకల సంఘం, సుప్రీంకోర్టుకు  లేఖను పంపించారు.  ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల లీడర్లు వాల్మీకి, వినోద్ కుమార్, కోళ్ల హుస్సేన్, సవరన్, దామోదరం, సుభాన్ పాల్గొన్నారు.

ఓడీఎఫ్‌‌ ప్లస్ జీపీలుగా మారుద్దాం

పాలమూరు, వెలుగు: జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలను ఓడీఎఫ్  ప్లస్‌‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని ఇన్‌‌చార్జి కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ సూచించారు. శుక్రవారం ఆయన జడ్పీ మీటింగ్‌‌ హాల్‌‌లో గ్రామ కార్యదర్శులతో మీటింగ్‌‌ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  జిల్లాలో  ఓడీఎఫ్ ప్లస్ కింద ఎంపికైన 183 గ్రామాలల్లో వందశాతం ప్యారామీటర్లు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ గ్రామాల్లో ఈనెల 20 నుంచి థర్డ్‌‌ పార్టీ తనిఖీలు చేయనుందని, శానిటేషన్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ , సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, కమ్యూనిటీ సోక్ పిట్లపై ఫోకస్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీపీవో వెంకటేశ్వర్లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.   
సత్ప్రవర్తనతోనే మెరుగైన జీవనం

మహబూబ్ నగర్ టౌన్, వెలుగు:సత్ప్రవర్తనతోనే సమాజంలో మెరుగైన జీవనం సాధ్యమవుతుందని ఇన్‌‌చార్జి కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ చెప్పారు. వజ్రోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఎస్పీ ఆర్.వెంకటేశ్వర్లుతో కలిసి జిల్లా జైలును సందర్శించారు. ఈ సందర్భంగా ఖైదీలకు పండ్లను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ  తప్పులను సరిదిద్దుకునే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఖైదీలకు సూచించారు. 

కోటకొండను మండలంగా ప్రకటించాలి

ఎమ్మెల్యేకు  అఖిలపక్ష నాయకుల వినతి

నారాయణపేట, వెలుగు:

నారాయణపేట మండల పరిధిలోని కొటకొండ గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం ఎమ్మెల్యే రాజేందర్​రెడ్డికి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  కోటకొండలో ఇప్పటికే బ్యాంకు, పీహెచ్‌‌సీ,  ఆయుర్వేద వైద్యశాల, యోగా కేంద్రం, పశు వైద్యశాల, పోస్ట్ ఆఫీస్, టెలిఫోన్ ఎక్స్‌‌చేంజ్,  చేనేత సొసైటీ, వారంతపు సంత,  ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్స్‌‌ ఉన్నాయన్నారు.  స్పందించిన ఎమ్మెల్యే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని మాటిచ్చారు.  ఈ కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్ ప్రజాపంథా జిల్లా కార్యదర్శి బి రాము, టీఆర్‌‌‌‌ఎస్‌‌ మండల అధ్యక్షుడు వేపూర్ రాములు,  
టీఆర్‌‌‌‌ఎస్‌‌ నేత వెంకట్ రాములు గౌడ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పగడాకుల శ్రీనివాసులు,  ఓబీసీ ఎల్ రాష్ట్ర నాయకుడు కెంచి శ్రీనివాసులు, పీవైఎల్​రాష్ట్ర అధ్యక్షుడు కె. కాశీనాథ్, సీపీఎం నేతలు బలరాం, బాలప్ప, కాశప్ప,బాలకృష్ణ, దస్తప్ప పాల్గొన్నారు. 

పండ్లు, స్వీట్లు పంచిన్రు..

స్వాతంత్ర్య వజ్రోత్సవాలు ఉమ్మడి జిల్లాలో ఘనంగా కొనసాగుతున్నాయి.  శుక్రవారం ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్‌‌‌‌ పర్సన్లు కలెక్టర్లు,  స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లు శుక్రవారం ఆస్పత్రులు, మాతా, శిశు సంరక్షణ సెంటర్లు,  అనాథ, వృద్ధాశ్రమాలు,  చిల్ట్రన్‌‌ హోమ్‌‌లలో పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు.  

– నెట్‌‌వర్క్‌‌, వెలుగు

ముకుందా.. ముకుందా..

ఉమ్మడి పాలమూరులో కృష్ణాష్టమి వేడుకలను శుక్రవారం వైభవంగా నిర్వహించారు. స్కూళ్లలో చిన్నారులు గోపి, గోపిక వేషధారణలో సందడి చేశారు.  పలుచోట్లు ఉట్టిలు కొట్టేందుకు యువకులు పోటీ పడ్డారు.  నిర్వాహకులు రంగులు చల్లుతూ, నీళ్లు పోస్తూ వారిని ఉత్సాహ పరిచారు. జోగులాంబ  ఉప ఆలయమైన శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో రుక్మిణి సత్యభామ సమేత స్వామివారి కల్యాణాన్ని కనుల పండువగా నిర్వహించారు. నారాయణపేటలోని అనాథాశ్రమంలో నిర్వహించిన వేడుకల్లో కలెక్టర్‌‌‌‌ హరిచందన పాల్గొన్నారు.

–నెట్‌‌వర్క్, వెలుగు

ఘనంగా ఫొటోగ్రఫీ డే

ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు.  శుక్రవారం ఫోటో, వీడియో అసోసియేషన్ల ఆధ్వర్యంలో ఫొటోగ్రఫీ పితామహుడు లూయిస్ డాగురే ఫొటోకు పూలమాలవేసి నివాళి అర్పించారు.  అనంతరం సీనియర్ ఫొటోగ్రాఫర్లను పూలమాల, శాలువాతో సన్మానించారు. గద్వాలలో అసోషియేషన్ జిల్లా అధ్యక్షుడు, బీజేపీ నేత బండల వెంకట్ రాములు  మాట్లాడుతూ  ఫొటో, వీడియో గ్రాఫర్ల సంక్షేమానికి  ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. 

– గద్వాల, వనపర్తి టౌన్, నాగర్‌‌‌‌ కర్నూల్ టౌన్, పెబ్బేరు, వెలుగు