ఏం చేయలేకపోయాం.. జడ్పీటీసీ, ఎంపీటీసీల ఆవేదన

ఏం చేయలేకపోయాం.. జడ్పీటీసీ, ఎంపీటీసీల ఆవేదన
  •     బీఆర్​ఎస్ హాయాంలో ఫండ్స్​ఇయ్యలే
  •     ఐదేండ్లలో ఖర్చు చేసింది రూ.32.29 కోట్లు
  •     ఇందులో స్టేట్​ ఫండ్స్​ రూ.10.02 కోట్లే 

నిజామాబాద్​, వెలుగు:  జిల్లా, మండల పరిషత్​ల పాలన ముగిసింది. అధికారంలో ఉన్నామన్నా సంతోషం.. ప్రజలకు సేవ చేయగలిగామన్నా సంతృప్తి లేకుండానే తమ ఐదేండ్ల పదవీకాలం ముగిసిపోయిందని చాలామంది సభ్యులు ఆవేదన చెందుతున్నారు. గత బీఆర్ఎస్​ ప్రభుత్వం లోకల్​బాడీలకు ఫండ్స్​ ఇవ్వకపోవడంవల్ల అభివృద్ధి పనులు చేయలేక పోయామని చెప్తున్నారు. జిల్లా, మండల పరిషత్​ లను గత ప్రభుత్వం అసలు పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. ప్రజలకు ఏదో చేయాలన్న ఆశతో పోటీ చేసి గెలిచిన జడ్పీటీసీ, ఎంపీటీసీలు ఫండ్స్​ ఇవ్వకుండా మొండిచేయి చూపడం, పాలనాపరంగా గౌరవం దక్కకపోవడంతో హుషారుగా పనిచేయలేకపోయారు. 

ఐదేండ్లలో రాష్ట్రమిచ్చిన ఫండ్స్ 10 కోట్లే 

జడ్పీకి 2019 నుంచి 2024 జులై 4 వరకు ప్రభుత్వం నుంచి రూ.32.29 కోట్ల నిధులు వచ్చాయి. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది కేవలం రూ.10.02 కోట్లు మాత్రమే. మిగతా ఫండ్స్​ కేంద్ర ప్రభుత్వ పథకాల కింద మంజూరయ్యాయి. సెంట్రల్​ ఫండ్స్​ను కూడా బీఆర్ఎస్​ సర్కారు తమ ఖాతాలో వేసుకుంది. ఈ ఏడాదికి సంబంధించిన 15 వ ఫైనాన్స్​కమిషన్​ నిధులు ఇంకా రిలీజ్​ కాలేదు. జిల్లాల విభజన జరిగినప్పుడు నిజామాబాద్​జిల్లాలో 27 మండలాలు ఉన్నాయి. 2019లో జరిగిన పరిషత్​ ఎన్నికల్లో 27 మంది జడ్పీటీసీలు, 299 ఎంపీటీసీలు ఎన్నికయ్యారు. 

జిల్లా పరిషత్​ చైర్మన్​గా అప్పటి సీఎం కేసీఆర్​ దగ్గరి బంధువైన దాదన్నగారి విఠల్​రావు ఎన్నికయ్యారు. సీఎంతో సాన్నిహిత్యం ఉన్నందున జిల్లాకు భారీగా నిధులు వస్తాయని అందరూ భావించినా నిరాశే ఎదురయ్యింది. జిల్లా విభజన తర్వాత నిజామాబాద్​ నార్త్​, సౌత్, డొంకేశ్వర్​, ఆలూరు, సాలూరా, పోతంగల్ లను కొత్త మండలాలుగా ప్రకటించడంతో మండలాల సంఖ్య 33కు పెరిగినా నిధుల్లో మార్పు రాలేదు. 

ఐదేండ్లలో స్టేట్​ ఫైనాన్స్​ కింద రెండు విడతల్లో రూ.10.02 కోట్లిచ్చి చేతులు దులుపుకున్నారు. సెంట్రల్​ గవర్నమెంట్​ నుంచి 15వ ఫైనాన్స్​ నుంచి పర్​ కాపిటా నిధులు రూ.15 కోట్లు, ఉపాధి హామీ (ఈజీఎస్​) పనుల కోసం రూ.3.20 కోట్లు, బీఎంఎఫ్​ కింద రూ.2.50 కోట్లు అందాయి. సీనరేజ్​, స్టాంప్​ ఛార్జ్​ పర్సెంటేజీ కింద రూ.70 లక్షల మేరకు జడ్పీకి ఆదాయం సమకూరింది. రెండేండ్లుగా సీనరేజీ, స్టాంపుడ్యూటీ వాటా జడ్పీకి అందడంలేదు. 

గుర్తుండిపోయే పని ఒక్కటీ లేదు

మొత్తం ఐదేండ్ల కాలంతో జనాభా ప్రాతిపాదికన ఒక్కో జడ్పీటీసీ సభ్యుడికి రూ.63 లక్షల నుంచి రూ.85 లక్షల ఫండ్స్​ మాత్రమే దక్కాయి. అంటే యాడాదికి రూ.12 నుంచి రూ.17 లక్షలు అందాయి. ఈ నిధులతో స్కూళ్ల రిపేర్లు, సీసీ రోడ్లు, డ్రైనేజీల పనులు మాత్రమే చేయగలిగారు. ప్రజలకు గుర్తుండిపోయే పనులు చేయలేకపోయామనే అసంతృప్తి వారిలో ఉంది. 

ఒక్కో ఊరికి ఏడాదికి 10 లక్షల మేరకు పనులు చేయగలిగితే ప్రజలకు మేలు జరిగేదని వారు వాపోతున్నారు. ఎంపీటీసీల పరిస్థితి మరీ దారుణం. మొత్తం ఐదేండ్లలో వారికి వచ్చిన ఫండ్​ రూ.6 లక్షల నుంచి రూ.10 లక్షలు మాత్రమే. యాడాదికి రూ.50 వేల నుంచి రూ.80 వేల చొప్పున వచ్చిన ఫండ్స్​తో ఏమీ చేయలేక పోయామని వారు ఆవేదన చెందుతున్నారు. 

జడ్పీ మీటింగ్​ పట్ల చిన్నచూపే

నిజామాబాద్​జిల్లా పరిషత్​ 2019లో కొలువు దీరింది. ఇప్పటివరకు 23 జనరల్​బాడీ మీటింగ్​లు జరిగితే.. అప్పటి మంత్రులుగానీ, ఎమ్మెల్యేలు గానీ సమావేశాలకు అటెండ్​ కాకుండా తమ పట్ల చిన్నచూపు ప్రదర్శించారని జడ్పీటీసీ సభ్యులు అసంతృప్తితో ఉన్నారు. మీటింగ్​లకు మంత్రులు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు అటెండ్​ అయితే ప్రజాసమస్యలు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లడానికి అవకాశం ఉండేదని, మంత్రులు, ఎమ్మెల్యే స్పందించి వారి పరిధిలో నిధులు మంజూరు చేసే వీలుండేదని సభ్యులు అంటున్నారు. ఇటీవల జరిగిన చివరి మీటింగ్​కు మాత్రం కొత్తగా ఎన్నికైన ఆర్మూర్​ ఎమ్మెల్యే పైడి రాకేశ్​​రెడ్డి హాజరయ్యారు.