
హైదరాబాద్, వెలుగు: జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవుల కోసం అధికార టీఆర్ ఎస్‌లో తీవ్ర పోటీ నెలకొంది. మూడు జడ్పీ పీఠాలపై సీఎం కేసీఆర్ ఇప్పటికే క్లారిటీ ఇవ్వగా మరో పదింటికి కూడా క్యాండిడేట్లు ఖరారయ్యారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం సహా కొన్ని జడ్పీ పీఠాలపై క్లారిటీ రావాల్సి ఉంది. వాటికి అభ్యర్థుల ఎంపికకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయా జిల్లాల పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలతో సమావేశమవుతున్నారు. పోటీ తీవ్రంగా ఉన్న చోట అందరినీ ఒప్పించి క్యాండిడేట్లను ఫైనల్ చేసే పనిలో ఉన్నారు. అయితే కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి, ఇప్పటికే పదవుల్లో ఉన్న కుటుంబాలకు చాన్స్ ఇస్తుండటంపై కొందరు నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ‘‘మంత్రులు, ఎమ్మెల్యే లు, ఎంపీ క్యాండిడేట్ల కుటుంబీకులకే చాన్సిస్తున్నారు. వాళ్లను వేరే ప్రాంతాలకు షిఫ్ట్ చేసి మరీ బరిలో దించుతున్నారు. ఒకే కుటుంబానికి ఎన్ని పదవులిస్తారు!” అంటూ సన్నిహిత నేతల వద్ద వాపోతున్నారు.
మాజీ ఎమ్మెల్యే కోవా లక్ష్మి, మంథని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు పేర్లను ఆసిఫాబాద్, పెద్దపల్లి జడ్పీలకు ఇటీవల పార్టీ ముఖ్య నేతల భేటీలో సీఎం కేసీఆర్ ఖరారు చేయడం తెలిసిందే. తెలంగా ణ ఉద్యమంలో తొలి నుంచి ఉన్న కుసుమ జగదీశ్ కు ములుగు జడ్పీని ఖాయం చేశారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కోడలు దివ్యా రెడ్డికి నిర్మల్ ఖాయమంటున్నారు. నిర్మల్ జడ్పీ పీఠం కోసమే బీజేపీ నుంచి టీఆర్‌ఎస్ చేరిన స్వర్ణకు మొండి చేయి తప్పదని సమాచారం. ఆదిలాబాద్ పీఠాన్ని లోక్ సభ ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్ చేరిన యువనేతకు ఇస్తారంటున్నారు. వరంగల్ రూరల్ జడ్పీ అవకాశం సోమవారం టీఆర్‌ఎస్ చేరిన గండ్ర జ్యోతికి ఇవ్వనున్నట్టు తెలిసింది. దాంతో ఈ పదవిపై ఆశలు పెట్టుకు న్న ఓ సీనియర్ నేత మండిపడుతున్నట్టు తెలిసింది. కరీంనగర్ జడ్పీ పీఠాన్ని మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ భార్యకు ఇస్తారని సమాచారం. ఈ పదవి తన అనుచరులకు దక్కేలా మంత్రి ఈటల రాజేందర్ ప్రయత్నిస్తున్నట్టు చెబుతున్నారు.
ఇక హాట్ సీట్ గా భావించే రంగారెడ్డి జడ్పీ పీఠం కోసం మాజీ ఎమ్మెల్యే లు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, తీగల కృష్ణారెడ్డి, ప్రతాప్ రెడ్డి కుటుంబాలు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నాయి . ప్రతాప్ రెడ్డి ఈ హామీతోనే పార్టీలో చేరినట్టు ప్రచారంలో ఉంది. భువనగిరి జడ్పీని మాజీ మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి తనయుడు సందీప్ రెడ్డికి ఖరారు చేశారు. సిద్దిపేటకు వి.రోజా రాధాకృష్ణశర్మ, నల్గొండకు అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి పేర్లను ఫైనల్ చేశారు. ఖమ్మం జెడ్పీ చైర్మన్ పదవికి నలుగురు సీనియర్లు, కొత్తగూడానికి ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు పోటీలో ఉన్నారు. సంగా రెడ్డికి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ భార్య సతీమణికి ఇస్తారనుకున్నా ఆమెకు గ్రామీణ ప్రాంతంలో ఓటు లేకపోవడంతో వేరొకరిని ఎంపిక చేస్తారని తెలిసింది. సూర్యాపేట జడ్పీకి రేణుక అనే నాయకురాలి పేరు ఖరారైందని తెలిసింది. వరంగల్ అర్బన్ జడ్పీ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు అనుచరుడు సుధీర్ కుమార్ కు ఇవ్వచ్చంటున్నారు. మరో సీనియర్ నేత కుటుంబం కూడా ఈ పదవి కోసం ప్రయత్నిస్తోంది. ఇక ఎంపీటీసీ, జెడ్పీటీసీ టికెట్ల కోసం కూడా పార్టీలో విపరీతంగా పోటీ నెలకొంది.