- హైకమాండ్ దృష్టి పెట్టినా ఆగని వలసలు
- ఎమ్మెల్యే చందర్ వైఖరిని నిరసిస్తూ ఇతర పార్టీల్లో చేరిక
- చందర్ వర్గీయులు సైతం దూరంగానే..
గోదావరిఖని, వెలుగు : ఎన్నికలు దగ్గరికొచ్చి, అభ్యర్థిని ప్రకటించినా రామగుండం బీఆర్‌ఎస్‌లో అసమ్మతి సెగలు చల్లారడం లేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వల్ల నష్టపోయామని సీనియర్ లీడర్లు కారు దిగి ఇతర పార్టీల్లో చేరిపోతున్నారు. ఇప్పటికే ముగ్గురు కార్పొరేటర్లు కాంగ్రెస్‌లో చేరగా, తాజాగా పాలకుర్తి జడ్పీటీసీ కందుల సంధ్యారాణి బీజేపీలో చేరారు. అలాగే బీఆర్‌ఎస్‌కు చెందిన ఎన్టీపీసీ ఏరియా మహిళా అధ్యక్షురాలు టి.పద్మ బుధవారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
కేటీఆర్‌తో మాట్లాడించినా కారు దిగారు
రామగుండం నియోజకవర్గం నుంచి 2018లో జరిగిన ఎన్నికల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా సింహం గుర్తుపై పోటీచేసిన కోరుకంటి చందర్‌ను గెలిపించుకున్నామని, ఆ తర్వాత ఆయన తమను మోసం చేశాడని పేర్కొంటూ అసమ్మతి నేతలు బహిరంగంగా విమర్శిస్తూ వచ్చారు. ముఖ్యంగా జడ్పీటీసీ కందుల సంధ్యారాణి, బీఆర్‌ఎస్ కార్పొరేటర్ పాతపెల్లి లక్ష్మి ఎల్లయ్య, మాజీ మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ, టీబీజీకేఎస్ జనరల్ సెక్రెటరీ మిర్యాల రాజిరెడ్డి, బసంత్ నగర్ కార్మిక సంఘం నాయకుడు మనోహర్ రెడ్డి బొగ్గు గనులు, కార్మిక వాడలు, ఇతర పరిశ్రమల గేట్ల వద్ద ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా మీటింగ్‌లు, పాదయాత్రలు నిర్వహించారు.
ఒక దశలో చందర్‌కు తప్ప తమ ఐదుగురిలో ఎవరికి టిక్కెట్ ఇచ్చినా గెలిపించుకుంటామని ప్రకటించారు. ఈ క్రమంలో మంత్రి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ ఐదుగురిని పిలిపించి మాట్లాడారు. అయినప్పటికీ లోలోపల చందర్‌పై తమ అసమ్మతిని వెళ్లగక్కుతూనే ఉన్నారు. మాజీ మేయర్ కొంకటి లక్ష్మీనారాయణకు రాష్ట్ర స్థాయిలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ మెంబర్‌గా నియమించడంతో ఆయన శాంతించారు. మిగిలిన వారు ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌తో కలిసి పనిచేయబోమనే సంకేతాలు ఇస్తున్నప్పటికీ పార్టీలోనే కొనసాగుతూ వచ్చారు. ఎన్నికలు దగ్గరపడుతుండగా తాజాగా వీరంతా కారు దిగి తలో పార్టీలో చేరుతున్నారు.
గెలిపించినవారే దూరంగా..
రామగుండం నియోజకవర్గం నుంచి సింహం గుర్తుపై పోటీ చేసిన కోరుకంటి చందర్ ఎమ్మెల్యేగా గెలుపొందడానికి కీలకంగా పనిచేసిన వారిలో చాలా మంది నేడు ఆయనకు దూరమయ్యారు. బొగ్గు గనులపై కార్మికులను ఒప్పించి చందర్‌ను గెలిపించాలని కోరిన వారికి పార్టీలో సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో వారు దూరమవుతూ వచ్చారు. ఈక్రమంలో కందుల సంధ్యారాణి తన మద్దతుదారులతో కలిసి బుధవారం హైదరాబాద్‌లో బీజేపీలో చేరారు. ఆమెకు రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి, పార్టీ మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్, జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి కండువా కప్పి ఆహ్వానించారు.
ఇక బీఆర్‌ఎస్ సీనియర్లు, కార్పొరేటర్లు అయిన పాతపెల్లి లక్ష్మి ఎల్లయ్య, ఫాతిమా సలీంబేగ్, శంకర్ నాయక్ కారు దిగి కాంగ్రెస్‌లో చేరారు. ఎన్టీపీసీ ఏరియాకు చెందిన బీఆర్‌ఎస్ పట్టణ మహిళా అధ్యక్షురాలు టి.పద్మ కూడా బుధవారం కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇదిలా ఉండగా మరో అసమ్మతి లీడర్ టీబీజీకెఎస్ జనరల్ సెక్రటరీ మిర్యాల రాజిరెడ్డి చందర్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.