- పనులైతలేవ్.. జనాలకేం చెప్పాలె
- ఆదిలాబాద్ జడ్పీ మీటింగ్‌లో టీఆర్ఎస్ జడ్పీటీసీల ప్రశ్నలు
ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ జడ్పీ మీటింగ్‌లో అధికార పార్టీ జడ్పీటీసీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తారు. సర్కారు నిధులు ఇవ్వకపోవడంతో పనులు చేయడంలేదని, ఊళ్లల్లో మీరు ఏం చేశారని ప్రజలు అడుగుతుంటే సమాధానం చెప్పలేకపోతున్నామని అన్నారు. శనివారం జరిగిన సమావేశంలో అధికార పార్టీ జడ్పీటీసీలు, ఎంపీపీలు అభివృద్ధిపై ఎమ్మెల్యేలు, చైర్మన్‌ను నిలదీశారు. పనులు ఎప్పుడు జరుగుతాయో చెప్పాలని డిమాండ్ చేశారు. వారికి ప్రతిపక్ష సభ్యులు తోడయ్యారు.
సొంత పైసలతో రైతు వేదికలు కట్టినం
పెండింగ్ సమస్యలపై అధికార పార్టీ నాయకులు జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశంలో నిరసన తెలిపారు. మిషన్ భగీరథ అంశంపై అధికారులు ప్రగతి నివేదికలు చదివి వినిపిస్తున్న సమయంలో టీఆర్ఎస్ జడ్పీటీసీ తాటిపెల్లి రాజు మాట్లాడుతూ.. తాంసి, భీంపూర్ మండలాల్లో మిషన్ భగీరథ నీళ్లు రావట్లేదని చెప్పారు. ఆయనకు తలమడుగు జడ్పీటీసీ గోక గణేశ్ రెడ్డి మద్దతు తెలిపారు. అర్అండ్ బీ రోడ్లపై అధికారులను సభ్యులు నిలదీశారు. దీంతో మెంబర్లు లేవనెత్తిన సమస్యలను పరిష్కరించాలని అధికారులను జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ ఆదేశించారు. రైతు వేదిక భవనాలను తమ సొంత డబ్బులతో నిర్మించామని, ఇప్పటి వరకు డబ్బులు రాలేదని సభ్యులు కలెక్టర్ సిక్తా పట్నాయక్ దృష్టికి తీసుకెళ్లారు.
డాక్టర్లను డిప్యుటేషన్‌పై ఎట్ల పంపుతరు?
తలమడుగు మండల పీహెచ్‌సీలో డాక్టర్లు, స్టాఫ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వెంటనే భర్తీ చేయాలని జడ్పీటీసీ గణేశ్ రెడ్డి కోరారు. ఏజెన్సీ లో పని చేస్తున్న డాక్టర్లను జిల్లా కేంద్ర ఆస్పత్రులకు డిప్యుటేషన్ మీద పంపడం ఏంటని ఉట్నూర్ జడ్పీటీసీ చారులత నిలదీశారు. ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ కూడా డాక్టర్ల డిప్యుటేషన్లపై అభ్యంతరం చెప్పారు. బ్యాంకులో రైతుబంధు డబ్బులు పడతాయా లేదా అన్నది వ్యవసాయ శాఖ అధికారులకే తెలియట్లేదని మెంబర్లు మండిపడ్డారు. బ్యాంకర్లు క్రాప్లోన్లు, వడ్డీ కింద కట్ చేసుకుంటున్నారని.. దీంతో వానాకాలం పంటల పెట్టుబడులకు రైతులు అప్పులు చేస్తున్నారన్నారని చెప్పారు.
ఆఫీసర్లు లంచాలకు అలవాటు పడ్డరు
అగ్రికల్చర్ ఆఫీసర్లు లంచాలకు అలవాటు పడ్డారని, రైతులకు సబ్సిడీ వ్యవసాయ పనిముట్లు ఇవ్వట్లేదని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావ్ ఆరోపించారు. సమావేశాల్లో ప్రస్తావించిన సమస్యలను అధికారులు పరిష్కరింట్లేదని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఐటీడీఏ పీవో లేక గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు.