ములకలపల్లి, వెలుగు: ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని టీపీసీసీ మెంబర్, జడ్పీటీసీ సున్నం నాగమణి డిమాండ్ చేశారు. ఆదివారం మండలంలోని పాతూరు గ్రామంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తాండ్ర ప్రభాకర్ రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ తమది రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న బీఆర్ఎస్ ప్రభుత్వం రుణమాఫీ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. రుణమాఫీ చేయకపోవడంతో రైతులు బ్యాంకుల్లో అధిక వడ్డీలు చెల్లిస్తూ అప్పుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎండీ అంజుమ్, పామర్తి కృష్ణారావు, బూరుగుపల్లి పద్మశ్రీ, గుర్రం జయసుధ, గుర్రం కృష్ణమూర్తి, కొండ్రు మహేశ్, గడ్డం వెంకటేశ్వరరావు పాల్గొన్నారు .
బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పించాలి
చండ్రుగొండ, వెలుగు: చట్ట సభల్లో బీసీలకు 50 శాతం రిజ్వరేషన్ కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రెడ్డిమళ్ల వెంకటేశ్వరావు డిమాండ్ చేశారు. ఆదివారం మండల కేంద్రంలో సంఘం జిల్లా, మండల కమిటీ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ కార్పొరేషన్ కు రూ.10 వేల కోట్ల ఫండ్స్ కేటాయించాలన్నారు. స్టూడెంట్ల పెండింగ్ స్కాలర్ షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మండల కమిటీ అధ్యక్షుడిగా వెంకయ్య, ఉపాధ్యక్షుడిగా అంచె కృష్ణ, ప్రధాన కార్యదర్శిగా అబ్బాస్ అలీ, కోశాధికారిగా ఒగ్గం శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షుడిగా రాఘవులు, కార్యదర్శిగా కన్నయ్య, సంయుక్త కార్యదర్శిగా సత్యనారాయణలను ఎన్నుకున్నారు. లింగయ్య, రామకృష్ణ, మల్లేశ్, నాగేశ్వరావు, సునీల్ కుమార్, సైదుబాబు పాల్గొన్నారు.
ఉచిత కంటి వైద్య శిబిరం
ఖమ్మం, వెలుగు: కస్బాబజార్ లో గురుదత్త నేత్రాలయ సహకారంతో, శ్రీ గురుపాదుకా పీఠం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. 82 మందికి డాక్టర్ మాదిరాజు అశోక్, డాక్టర్ నందనందన్ వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం పేదలకు ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. శ్రీ గురుపాదుకా పీఠం ట్రస్ట్ చైర్మన్ ఉరిమెళ్ల కృష్ణప్రసాద్, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహార, సుడా డైరెక్టర్ షేక్ ముక్త్యార్, ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు .
టీచర్ల మధ్య లొల్లి పెడ్తున్రు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: ఐటీడీఏ పరిధిలోని గిరిజన హాస్టల్స్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులను ఆశ్రమ పాఠశాలల్లో పని చేస్తున్న టీచర్లకు ఇవ్వడం సరైంది కాదని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు వజ్జా సురేశ్ అన్నారు. టీచర్ల మధ్య గొడవలు పెట్టేందుకే పర్మినెంట్ పోస్టులను టీచర్లకు ఇస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే డిప్యూటీ వార్డెన్ రేసులో టీచర్ల మధ్య విభేదాలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆశ్రమ పాఠశాలల్లో కూడా డిప్యూటీ వార్డెన్ పోస్టులను పర్మినెంట్గా భర్తీ చేయాలన్నారు.
మనుస్మృతి దహనం
ఖమ్మం, వెలుగు: నగరంలోని అంబేద్కర్ సెంటర్లో మాలమహానాడు ఆధ్వర్యంలో మనుస్మృతి దహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మనువాదం నశించాలి, భారత రాజ్యాంగం వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ ఎన్నో అవమానాలనుఎదుర్కొన్నారన్నారు. విదేశాల్లో ఉన్నత చదువులు చదివి స్వదేశానికి వచ్చిన తర్వాత కూడా అంటరానితనంతో ఇబ్బంది పడ్డారని అవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాలమహానాడు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాల సంఘాల నేతలు పాల్గొన్నారు.
చీరలు, నగదు అందజేత
సత్తుపల్లి, వెలుగు: క్రిస్మస్ సందర్భంగా మండలంలోని నారాయణపురం గ్రామంలో ఆత్మ కమిటీ చైర్మన్ శీలపరెడ్డి హరికృష్ణారెడ్డి, ఆయన సోదరుడు బాలకృష్ణారెడ్డి నిరుపేదలకు రూ.లక్షన్నర విలువైన చీరలు, నగదు పంపిణీ చేశారు. రోగులకు రూ.50 వేల ఆర్థికసాయం, 200 మంది నిరుపేద మహిళలకు రూ. లక్ష విలువైన చీరలు పంపిణీ చేశారు. పేదలు, ఆపదలో ఉన్న వారికి అండగా ఉండేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. పీఏసీఎస్ చైర్మన్ మందపాటి వెంకటరెడ్డి, సర్పంచ్ దేశిరెడ్డి రంగారెడ్డి, పాకలపాటి శ్రీను, వేల్పుల కృష్ణ, యలమంచి ఉమామహేశ్వరరావు, తనూజ్, అవినాశ్, అశోక్, వెంకటేశ్వరరావు, కృష్ణ, ఈశ్వర్, సంతోష్, మారేశ్, వేణు, నాగరాజు, మధు, దామెర్ల రామారావు పాల్గొన్నారు.