వరంగల్‍ జిల్లా జనరల్​బాడీ మీటింగ్ లో జడ్పీటీసీలు, ఎంపీపీల నిరసన గళం

వరంగల్‍, వెలుగు: జిల్లాల్లో పోయినేడాది కట్టిన రైతు వేదికలు, జీపీ బిల్డింగులు, కల్లాల నిర్మాణాలకు సంబంధించిన బిల్లులు ఇంకెప్పుడిస్తారని జడ్పీటీసీలు, ఎంపీపీలు అధికారులను ప్రశ్నించారు. బుధవారం హన్మకొండ జడ్పీ ఆఫీస్‍లో జడ్పీ చైర్‍పర్సన్‍ గండ్ర జ్యోతి అధ్యక్షతన వరంగల్‍ జిల్లా జనరల్​బాడీ మీటింగ్ ​నిర్వహించారు. ఈ మీటింగ్​కు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‍రావు, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‍రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‍రెడ్డి, వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు గోపి, రాజీవ్‍గాంధీ హనుమంతు హాజరయ్యారు.  ఈ సందర్భంగా పలువురు జడ్పీటీసీలు, ఎంపీపీలు మాట్లాడుతూ గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనుల పెండింగ్‍ బిల్లులు, అభివృద్ధి పనులకు కావాల్సిన ఫండ్స్  ఇప్పించాలని సభ దృష్టికి తీసుకొచ్చారు.

ఒక్కో రైతు వేదికకు ప్రభుత్వం ఇచ్చిన డబ్బు కంటే రూ.5 లక్షల వరకు ఎక్కువైనట్లు వర్ధన్నపేట జడ్పీటీసీ భిక్షపతి అన్నారు. టాయిలెట్ల నిర్మాణంలో వరంగల్‍ జిల్లాను ఓడీఎఫ్‍గా ప్రకటించడానికి పనులు చేయించారని.. వీటికి సంబంధించిన బిల్లులు పూర్తిస్థాయిలో ఇవ్వకపోవడంతో పనులు ఆగాయని పలువురు ప్రజాప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో చేసిన ఉపాధి పనులకు సంబంధించి కూలీ డబ్బులు ఇంకెప్పుడిస్తారని సభ్యులు ప్రశ్నించారు. 15 రోజుల్లో ఇవ్వాల్సిన కూలీ.. 3 నెలలయినా ఎందుకివ్వట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈజీఎస్‍ స్కీంలో భాగంగా పంచాయతీ బిల్డింగుల నిర్మాణానికి రూ.13 లక్షల నుంచి 15 లక్షలు ఖర్చు చేశామని.. బిల్లులు ఎప్పుడు వస్తాయోనన్న టెన్షన్‍ నెలకొందన్నారు. 

తులసి,  మందార మొక్కలిస్తరా.? 

రాష్ట్ర ప్రభుత్వ చేపట్టిన హరితహారాన్ని అధికారులు ఫెయిల్‍ చేస్తున్నారని సభ్యులు మండిపడ్డారు. జనాలు ఇష్టంగా అడిగే మొక్కలు కాకుండా వేరే ఇవ్వడంతో ప్రయోజనం ఉండట్లేదన్నారు. ఒక్కో ఇంటికి 5 మొక్కలు ఇస్తుండగా.. ప్రజలు మామిడి, జామ, నిమ్మ, దానిమ్మ వంటి పండ్ల చెట్లు అడుగుతుంటే.. అధికారులు మాత్రం తులసి, మందార చెట్లు ఇస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసినా రోడ్ల వెంట మొక్కలు ఎండిపోతున్నాయని.. రైతులు తమ భూముల్లో గ్రీనరీ పెంచే చెట్లు పెడితే మాత్రం సీలింగ్‍ ఉందనడం ఏంటని ప్రశ్నించారు. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‍రెడ్డి మాట్లాడుతూ ఈ ఏడాది హరితహారంలో ఏవైనా కొత్త మొక్కలు ఇచ్చే అవకాశం ఉందా అని ప్రశ్నించారు. ఇంటికో నిమ్మ మొక్క ఇచ్చేలా చూడాలని జడ్పీ చైర్‍పర్సన్‍ జ్యోతి ఆదేశించారు. రోడ్ల తొలగిస్తున్న కోనోకార్పస్‍ చెట్ల స్థానంలో మళ్లీ కొత్తవి నాటాలని సభ్యులు కోరారు.

కేంద్రమే కారణమని చెప్పండి 

అధికారులతో వరంగల్‍ జడ్పీ చైర్‍ పర్సన్‍ గండ్ర జ్యోతి ఉపాధి హామీ పైసల గురించి అడిగితే కేంద్రం ఫండ్స్​ ఇవ్వకపోవడమే కారణమని చెప్పాలని వరంగల్‍ జడ్పీ చైర్‍పర్సన్‍ గండ్ర జ్యోతి అధికారులకు సూచించారు. వర్ధన్నపేట ఎంపీపీ అప్పారావు మాట్లాడుతూ.. ఉపాధి పనులు చేసిన కూలీలకు మూడు నెలలు కావస్తున్నా పైసలు ఎందుకివ్వట్లేదని సంబంధిత శాఖ పీడీని ప్రశ్నించారు. దీనికి ఆయన బదులిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఫండ్స్​ రిలీజ్‍ చేయాల్సి ఉందని చెప్పగా.. సభ వేదికపై ఉన్న జడ్పీ చైర్‍పర్సన్‍ మధ్యలో కల్పించుకొని కేంద్రం ఫండ్స్ మంజూరు చేయలేదు కాబట్టే రైతులకు ఇవ్వాల్సిన కూలీలు ఆలస్యమవుతున్నట్లు చెప్పాలన్నారు. దీంతో ఆఫీసర్‍ ఉపాధి పైసలు రాకపోవడానికి 'కేంద్రమే కారణమని సమాధానం చెప్పి వెళ్లిపోయారు. 

బీజేపోళ్లు సర్పంచులను పక్కదారి పట్టిస్తున్రు

జీపీ బిల్లుల విషయంలో సర్పంచులను బీజేపీ లీడర్లు పక్కదారి పట్టిస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‍రావు అన్నారు. వరంగల్​ జడ్పీ జనరల్​బాడీ మీటింగ్​లో మంత్రి మాట్లాడుతూ కేంద్రం.. రాష్ట్రానికి గతంలో ఏడాదికి రూ.1850 కోట్లు ఇవ్వగా దానిని రూ.1350 కోట్లకు తగ్గించిందన్నారు. ఇందులోనూ రూ.700 కోట్లు ఇచ్చి మిగతావి ఆపినట్లు చెప్పారు. రాష్ట్ర సర్కారు గ్రామాలకు ఏడాదికి రూ.330 కోట్లు ఇస్తున్నట్లు వెల్లడించారు. దేశంలో కేంద్రం ఇచ్చే గ్రాంట్‍తో సమాన గ్రాంట్‍ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. పామాయిల్‍ సాగుకు అధికారులు రైతులను ప్రోత్సహించాలన్నారు. ఉమ్మడి జిల్లాలో పామాయిల్‍ ఫ్యాక్టరీలు పెట్టనున్నట్లు తెలిపారు. జడ్పీటీసీలు, ఎంపీపీలకు రూ.కోటి ఫండ్స్​ ఇవ్వాలని జడ్పీ ఫ్లోర్‍ లీడర్‍ పెద్ది స్వప్న ఆధ్వర్యంలో మంత్రిని కోరగా.. అందరినీ తృప్తి పరిచేలా నిధులిస్తామని మంత్రి చెప్పారు. ఎమ్మెల్సీ శ్రీనివాస్‍రెడ్డి మాట్లాడుతూ.. చేర్యాల జడ్పీటీసీ మల్లేశంను హత్య చేసిన దుండగులను ఫాస్ట్​ట్రాక్‍ కోర్టు ద్వారా శిక్షలు పడేలా చూడాలన్నారు. పెండింగ్‍ బిల్లులు, జడ్పీటీసీలు, ఎంపీపీలకు హెల్త్​కార్డుల కోసం తీర్మానం చేసి పంపిస్తే వాటిని ఇప్పించేలా కృషి చేస్తానని ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు.