- ఆరుతడి పంటలపై అవగాహన’ ఎక్కడ?
- ఆఫీసర్లను నిలదీసిన సభ్యులు
- మనబడి పనుల్లో నాణ్యత లేమిపై ప్రశ్నల వర్షం
- గరంగరంగా వనపర్తి జడ్పీ మీటింగ్
వనపర్తి, వెలుగు: వనపర్తి జడ్పీ సమావేశంలో వ్యవసాయంపై వాడీ వేడీగా చర్చ జరిగింది. ఆరుతడి పంటలపై అవగాహన కల్పించడం లేదని అగ్రికల్చర్, హార్టికల్చర్ ఆఫీసర్లపై జడ్పీటీసీలు, ఎంపీపీలు ఫైర్ అయ్యారు. మంగళవారం జడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి అధ్యక్షతన జరిగిన వనపర్తి జడ్పీ సమావేశంలో వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి, కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, అడిషనల్ కలెక్టర్ సంచిత్ గాంగ్వార్, జడ్పీ సీఈవో రామమహేశ్వర రెడ్డి పాల్గొన్నారు.
పెద్దమందడి, ఖిల్లాగణపురం, మదనాపురం జడ్పీటీసీలు రఘుపతిరెడ్డి, సామ్యానాయక్, కృష్ణయ్యయాదవ్ మాట్లాడుతూ రైతుబంధు అందలేదని, రుణమాఫీ కాలేదని ఆవేదన వ్యక్తంచేశారు. సబ్సిడీ గొర్రెల కోసం ఎదురుచూస్తున్న కాపరులకు4 న్యాయం చేయాలని కోరారు. దీనిపై స్పందించిన వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి, కాంగ్రెస్ జడ్పీటీసీ రాజేంద్రప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వం సబ్ కమిటీ వేసిందని, 100 రోజుల్లో హామీలను నెరవేరుస్తామని సమాధానం ఇచ్చారు. జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, ప్రజలకు సేవలందించి గుర్తింపు తెచ్చుకోవాలన్నారు. జడ్పీ పాలకమండలి గడువు మరో ఆరు నెలల్లో ముగుస్తుందని, మిగిలిన సమయం ప్రజల సమస్య తీర్చేందుకు కేటాయించాలని కోరారు.
వివిధ అంశాలపై చర్చ
సదరం క్యాంపుల్లో దివ్యాంగులు ఇబ్బందులు పడుతున్నారని, పర్మినెంట్ డిజేబుల్ సర్టిఫికెట్ రెన్యూవల్‌ను తొలగించాలని పలువురు సభ్యులు డిమాండ్ చేశారు. చిన్నంబావి, వీపనగండ్ల పీహెచ్‌సీల్లో అంబులెన్స్‌లు ఏర్పాటు చేయాలని కోరారు. స్పందించిన డీఎంహెచ్‌వో జిల్లాలోని దివ్యాంగులందరికీ ఒకేసారి సర్టిఫికెట్లు ఇచ్చేలా క్యాంప్ నిర్వహిస్తామని తెలిపారు.
వ్యవసాయ శాఖపై జరిగిన చర్చలో సభ్యులు మాట్లాడుతూ ఆరుతడి పంటలపై ప్రచారం చేయడంలో విఫలమయ్యారని అగ్రికల్చర్, హార్టికల్చర్ ఆఫీసర్లపై ఫైర్ అయ్యారు. ఆఫీసర్లు సరైన సమయంలో స్పందించడం లేదని మండిపడ్డారు. మామిడి చెట్లకు ఇంకా పూత రాలేదని, దీనిపై రైతులకు సలహాలు, సూచనలు అందించాలని కోరారు. శ్రీనిధి స్కీంలో ఒకరిద్దరు డిఫాల్టర్లు ఉంటే గ్రూప్ మొత్తానికి లోన్లు ఇవ్వడం లేదని చిన్నంబావి జడ్పీటీసీ వెంకటరమణమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో మహిళా సంఘాలకు వచ్చిన కమీషన్ వెంటనే అందించాలని కలెక్టర్ దృష్టికి తెచ్చారు.
జడ్పీ చైర్మన్ లోక్‌నాథ్ రెడ్డి మాట్లాడుతూ రైతు వేదికల్లో సమావేశాలు ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. మనబడి కింద నాసిరకం పనులు జరిగాయని, కొన్ని చోట్ల పనులు ఆలస్యం అవుతున్నాయని గోపాల్ పేట జడ్పీటీసీ భార్గవి సభ దృష్టికి తెచ్చారు. దీనిపై వివరణ ఇవ్వాలని సంబంధిత అధికారిని కలెక్టర్ ఆదేశించగా, ఆయన మీటింగ్‌కు గైర్హాజరు కావడంతో షోకాజ్ నోటీస్ ఇవ్వాలని ఆదేశించారు. జిల్లాలోని 50 శాతం పశు వైద్యశాలల్లో డాక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని పలువురు సభ్యులు సభ దృష్టికి తెచ్చారు. ఖాళీల వివరాలు తెలియజేయాలని కలెక్టర్ సంబంధిత అధికారిని ఆదేశించారు. రెండో సెషన్ లో 15 అంశాలపై చర్చించాల్సి ఉండగా, ఆఫీసర్లు లేకపౌవడంతో సమావేశాన్ని ముగించారు.