ముంబై: కోటక్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలో 51 శాతం వాటాని రూ. 4,051 కోట్లకు స్విట్జర్లాండ్ ఇన్సూరెన్స్ కంపెనీ జ్యూరిచ్ కొనుగోలు చేస్తోంది. గ్రోత్ క్యాపిటల్, షేర్ పర్చేజ్‌ల కాంబినేషన్‌తో ఈ ఇన్వెస్ట్మెంట్ ఉంటుందని కోటక్ మహీంద్రా బ్యాంక్ గురువారం వెల్లడించింది. మూడేళ్ల తర్వాత మరో 19 శాతం వాటాను కూడా జ్యూరిచ్ ఇన్సూరెన్స్ కొనేందుకు ఒప్పందం కుదిరినట్లు తెలిపింది.
నాన్–లైఫ్ ఇన్సూరెన్స్ మార్కెట్లో ప్రీమియం పరంగా కోటక్ జనరల్ ఇన్సూరెన్స్‌కు 0.52 శాతం వాటా ఉంది. 2022–23 లో ఈ కంపెనీకి రూ. 1,148 కోట్ల ప్రీమియం ఆదాయం వచ్చింది. ప్రపంచంలోని కీలకమైన మార్కెట్లలో ఇండియా ఒకటని, ఇక్కడ ఎదగడానికి చాలా అవకాశం ఉందని జ్యూరిచ్ఇన్సూరెన్స్ సీఈఓ (ఏషియా పసిఫిక్) తుల్సి నాయుడు చెప్పారు. రెండు కంపెనీల సామర్ధ్యం కలిస్తే కస్టమర్లకు మరిన్ని ఇన్నొవేటివ్ ప్రొడక్టులు అందించడానికి వీలవుతుందని కోటక్ జనరల్ ఇన్సూరెన్స్ మేనేజింగ్ డైరెక్టర్ దీపక్ గుప్తా తెలిపారు.
ALSO READ : అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్‌ను గెలిపించండి : వన్నెల అశోక్
జ్యురిచ్ ఇన్సూరెన్స్కంపెనీతో వాటా అమ్మకానికి డెఫినిటివ్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్లు కోటక్ మహీంద్రా బ్యాంక్, కోటక్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రకటించాయి. ఆర్బీఐ, ఐఆర్డీఏఐ, సీసీఐల నుంచి అవసరమైన అనుమతులు ఈ డీల్‌కు లభించాల్సి ఉంటుంది.