పుణె : వరల్డ్ కప్‌లో ఐదు వరుస పరాజయాల తర్వాత ఇంగ్లండ్‌కు ఊరట విజయం లభించింది. ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ (84 బాల్స్‌లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 108) సెంచరీతో చెలరేగిన వేళ.. బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఇంగ్లిష్ టీమ్ 160 రన్స్ భారీ తేడాతో నెదర్లాండ్స్‌ను చిత్తు చేసింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 339/9 స్కోరు చేసింది. డేవిడ్ మలన్ (74 బాల్స్‌లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లతో 87), క్రిస్ వోక్స్ (45 బాల్స్‌లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 51) రాణించారు. డి లీడె 3 వికెట్లు తీశాడు. తర్వాత నెదర్లాండ్స్ 37.2 ఓవర్లలో 179 రన్స్‌కే కుప్పకూలింది. తెలుగు బ్యాటర్ తేజ నిడమనూర్ (34 బాల్స్‌లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 41), బారెసీ (37), ఎడ్వర్డ్స్ (38) పోరాడి విఫలమయ్యారు. మొయిన్ అలీ, రషీద్ చెరో మూడు వికెట్లు తీశారు. స్టోక్స్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
కీలక పార్ట్‌నర్‌షిప్స్..
ఫ్లాట్ పిచ్‌పై ఆరంభంలో బెయిర్‌స్టో (15), మలన్ డచ్ బౌలింగ్‌ను దీటుగా ఎదుర్కొన్నారు. వాన్ బీక్ (2/88) వేసిన రెండో ఓవర్‌లోనే మలన్ వరుసగా మూడు ఫోర్లతో టచ్‌లోకి వచ్చాడు. స్పిన్నర్ ఆర్యన్ దత్ (2/67) వేసిన తర్వాతి ఓవర్‌లో మరో రెండు బౌండ్రీలు బాదాడు. రెండో ఎండ్‌లో బెయిర్ స్టో కూడా బ్యాట్ ఝుళిపించే ప్రయత్నం చేసినా ఏడో ఓవర్‌లో ఔటయ్యాడు. దత్ టర్నింగ్ బాల్‌కు స్క్వేర్ లెగ్‌లో క్యాచ్ ఇచ్చాడు. ఫలితంగా తొలి వికెట్‌కు 48 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. ఈ ఔట్ పెద్దగా ప్రభావం చూపకపోవడంతో ఇంగ్లండ్ తొలి పది ఓవర్లలో 70/1 స్కోరు చేసింది. వన్‌డౌన్‌లో రూట్ (28) జాగ్రత్తగా ఆడినా.. అవతలి వైపు 37 బాల్స్‌లో హాఫ్ సెంచరీ చేసిన మలన్ తన దూకుడును తగ్గించలేదు.
మెర్వ్ బౌలింగ్‌లో సిక్స్, ఫోర్‌తో రెచ్చిపోయాడు. ఇక ఇన్నింగ్స్ గాడిలో పడిందనుకున్న టైమ్‌లో డచ్ బౌలర్లు డబుల్ స్ట్రోక్ ఇచ్చారు. 21వ ఓవర్‌లో రూట్‌ను వాన్ బీక్ బౌల్డ్ చేస్తే తర్వాతి ఓవర్‌లో మలన్ రనౌటయ్యాడు. రెండో వికెట్‌కు 85 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగియడంతో ఇంగ్లండ్ 139/3తో నిలిచింది. ఈ దశలో వచ్చిన స్టోక్స్ సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. మధ్యలో స్పిన్నర్లు సత్తా చాటడంతో హ్యారీ బ్రూక్ (11), బట్లర్ (5), మొయిన్ అలీ (4) వరుస విరామాల్లో ఔటయ్యారు. 53 రన్స్ తేడాతో మూడు కీలక వికెట్లు పడ్డాయి. లోయర్ ఆర్డర్‌లో క్రిస్ వోక్స్ దీటుగా నిలబడ్డాడు. స్టోక్స్‌కు మంచి సహకారం అందిస్తూనే వీలైనప్పుడల్లా బౌండ్రీలు బాదాడు.
వికెట్ కోసం డచ్ ఎన్ని ప్రయత్నాలు చేసినా సమర్థంగా అడ్డుకున్నాడు. హాఫ్ సెంచరీతో ఏడో వికెట్‌కు 129 రన్స్ జోడించి ఇంగ్లండ్ భారీ స్కోరుకు బాటలు వేశాడు. డేవిడ్ విల్లే (6), అట్కిన్సన్ (2 నాటౌట్), ఆదిల్ రషీద్ (1 నాటౌట్) ఫెయిలైనా స్టోక్స్ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో స్టోక్స్ 78 బాల్స్‌లో సెంచరీ చేసి మంచి టార్గెట్‌ను నిర్దేశించాడు.
స్పిన్నర్లు తిప్పేశారు..
ఛేజింగ్‌లో డచ్ ఇన్నింగ్స్‌ను మొయిన్ అలీ, రషీద్ కట్టడి చేశారు. మిడిల్, లోయర్ ఆర్డర్ బ్యాటర్లను సింగిల్ డిజిట్లకే పరిమితం చేశారు. ఆరంభంలో పేసర్ల దెబ్బకు టాప్ ఆర్డర్ బెంబేలెత్తింది. వోక్స్ (1/19), విల్లే (2/19) వరుస ఓవర్లలో మ్యాక్స్ ఓ డౌడ్ (5), అకెర్‌మన్ (0)ను ఔట్ చేశారు. దీంతో 13 రన్స్‌కే 2 వికెట్లు కోల్పోయిన డచ్‌ను బారెసీ, సైబ్రాండ్స్ (33) ఆదుకునే ప్రయత్నం చేశారు. ఈ ఇద్దరు మూడో వికెట్‌కు 55 రన్స్ జోడించారు.
కానీ 18వ ఓవర్‌లో బారెసీ రనౌట్ కావడంతో ఇన్నింగ్స్ తడబాటుకు గురైంది. మధ్యలో ఎడ్వర్డ్స్, సైబ్రాండ్స్ ఫర్వాలేదనిపించినా ఎక్కువసేపు వికెట్లను కాపాడుకోలేకపోయారు. తేజ నిడమనూర్ నిలబడినా.. రెండో ఎండ్‌లో అలీ, రషీద్ సూపర్ టర్నింగ్‌తో భయపెట్టారు. దీంతో డి లీడె (10)తో కలిపి లోయర్ ఆర్డర్‌లో వాన్ బీక్ (2), మెర్వ్ (0), ఆర్యన్ దత్ (1), మీకెరెన్ (4) సింగిల్ డిజిట్‌కే పరిమితం కావడంతో డచ్‌కు భారీ ఓటమి తప్పలేదు.
సంక్షిప్త స్కోర్లు
ఇంగ్లండ్ : 50 ఓవర్లలో 339/9 (స్టోక్స్ 108, మలన్ 87, డి లీడె 3/74).
నెదర్లాండ్స్ : 37.2 ఓవర్లలో 179 ఆలౌట్ (తేజ 41*, ఎడ్వర్డ్స్ 38, మొయిన్ అలీ 3/42, రషీద్ 3/54).