నా కొడుకు నుంచి మమ్మల్ని కాపాడండి

నా కొడుకు నుంచి మమ్మల్ని కాపాడండి
  •  డీజీపీకి ఓ సీఐ తల్లిదండ్రుల ఫిర్యాదు

బషీర్ బాగ్, వెలుగు: ఆపదలో ఉన్నవారిని కాపాడాల్సిన ఓ సీఐ.. ఆస్తి కోసం కన్న తల్లిదండ్రులనే వేధిస్తున్నాడు. అతడి నుంచి తమకు రక్షణ కల్పించాలంటూ బాధిత తల్లిదండ్రులు రాష్ట్ర డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు. వనపర్తి జిల్లా ఖల్లా ఘనపురం మండలం  వెంకటాయింపల్లి గ్రామానికి చెందిన రఘునాథ్​ రెడ్డి, బొజ్జమ్మ దంపతులకు ఇద్దరు కొడుకులు , ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కొడుకు నాగేశ్వర్ రెడ్డి సీఐగా, చిన్నకొడుకు యాదయ్య కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారు. తండ్రి పేరిట 30 ఎకరాల 23 గుంటల భూమి ఉంది. ఇందులోంచి తనకు 20 ఎకరాలు రాసివ్వాలని పెద్దకొడుకు (సీఐ) నాగేశ్వర్ రెడ్డి తన తండ్రి రఘునాథ్​ రెడ్డిని వేధించాడు.

 దాంతో దంపతులు గ్రామపెద్దల సమక్షంలో పెద్దకొడుకు పేరుపై 15 ఎకరాలు , చిన్న కొడుకు పేరుపై 11 ఎకరాలు రాసిచ్చారు. మిగిలిన భూమిని కూతుళ్లకు ఇచ్చేందుకు వారి వద్దనే ఉంచుకున్నారు.  కానీ సీఐ నాగేశ్వర్ రెడ్డి తనకు మరో 5 ఎకరాల భూమి ఇవ్వాలని వేధిస్తున్నాడు. పెద్ద కొడుకు వేధింపులు తాళలేక రఘునాథ్​ రెడ్డి, బొజ్జమ్మ దంపతులు రాష్ట్ర డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు.  తన కొడుకు నాగేశ్వర్ రెడ్డి తమను వేధించకుండా చర్యలు తీసుకొని, తమకు రక్షణ కల్పించాలని వేడుకున్నారు. నాగేశ్వర్ రెడ్డి రాచకొండ కమిషనరేట్ మల్టీ జోన్ 2 లో సీఐగా పనిచేస్తున్నాడని వివరించారు. సీఐ కావడం వల్ల తన పలుకుబడితో ఎక్కడికి వెళ్లినా తమకు న్యాయం జరగడం లేదని డీజీపీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.