రెండు నెలల్లో పాత పైపులైన్ల మార్పు..లీకేజీలు, నీటి కాలుష్యంతో వాటర్​ బోర్డు అలర్ట్

రెండు నెలల్లో పాత పైపులైన్ల మార్పు..లీకేజీలు, నీటి కాలుష్యంతో వాటర్​ బోర్డు అలర్ట్
  • తనిఖీకి స్పెషల్​ డ్రైవ్​ షురూ 
  • చాలా చోట్ల పైపులకు రస్ట్​
  • సగం వరకూ హోల్స్​తో ఉన్నట్టు గుర్తింపు  
  • వర్షాకాలంలోపు పాడైపోయిన పైపులను మార్చాలని నిర్ణయం 

హైదరాబాద్​ సిటీ, వెలుగు :  గ్రేటర్​పరిధిలో వాటర్​లీకేజీలకు, కాలుష్యం ప్రబలడానికి ప్రధానంగా పాత పైపు లైన్లే కారణమని వాటర్​బోర్డు అధికారులు భావిస్తున్నారు. నగరంలోని కొన్ని చోట్ల రంగు మారిన నీళ్లు రావడం, కలుషిత నీళ్లతో ప్రజలు ఇబ్బందులు పడుతుండడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. వారం నుంచి పాత పైపు లైన్లను తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో చాలా చోట్ల పూర్తిగా చెడిపోయిన పైప్​లైన్లు బయటపడుతుండడంతో విస్తుపోతున్నారు. 

ఇలాంటి పైప్​లైన్లన్నీ 25 నుంచి 30 ఏండ్ల క్రితం వేసినవి కావడంతో పూర్తిగా పాడైపోయాయని తెలుసుకున్నారు. చాలా ప్రాంతాల్లో పైపులు రస్ట్​ పట్టి సగం వరకూ రంధ్రాలతో ఉన్నట్టు గుర్తించారు. ఈ కారణంగానే నీటి లీకేజీలతో పాటు కాలుష్యం కేసులు నమోదవుతున్నట్టు తెలుసుకున్నారు. వచ్చే రెండు నెలల పాటు పాత పైపులను తనిఖీ చేసి మార్చేందుకు స్పెషల్​డ్రైవ్​ నిర్వహించాలని బోర్డు ఎండీ అశోక్​రెడ్డి అధికారులను ఆదేశించారు. 

నిజాం కాలం నాటివి కావడంతో..

నగరంలోని అన్వర్​ఉల్​ఉలూమ్​కాలేజీ సమీపంలో రోడ్డుపై తరచూ లీకేజీలవుతున్న పైప్​లైన్​ను శుక్రవారం తవ్వి తీయగా సగానికి సగం పైప్​ తప్పుపట్టిపోయివుంది. ఈ కారణంగా ఈ ప్రాంతంలో లీకేజీలు వస్తున్నట్టు అధికారులు గుర్తించారు. వెంటనే కొత్త పైప్​లైన్​ వేశారు. నాలుగు రోజుల క్రితం రెడ్​హిల్స్​ లోనూ కాలుష్య సమస్య ఏర్పడగా, అధికారులు తవ్విచూడగా పైప్​లైన్​ పూర్తిగా తప్పుపట్టి కనిపించింది. గ్రేటర్​ పరిధిలో ముఖ్యంగా కోర్​సిటీలో నిజాం కాలం నాటి పైప్​లైన్లు ఎక్కువగా ఉండడం వల్ల చాలా చోట్ల లీకేజీలతో పాటు  కాలుష్య సమస్యలు వస్తున్నాయి.  

వర్షాకాలం నాటికి పరిష్కారం.. 

వచ్చే వర్షాకాలం నాటికి నగరంలో పైప్​లైన్​లీకేజీలు, పొల్యూషన్​ అన్నది లేకుండా చూడాలని అధికారులను ఎండీ ఆదేశించిన నేపథ్యంలో శుక్రవారం నుంచి ఆయా ప్రాంతాల్లో స్పెషల్​డ్రైవ్​ప్రారంభించారు. గ్రేటర్​ పరిధిలో 9,850 కి.మీ. పైప్​లైన్​నెట్​వర్క్​ ఉండగా, ఇందులో 3వేల కి.మీ లైన్లను 25 నుంచి 30 ఏండ్ల కింద వేశారు. ప్రత్యేకించి పాతబస్తీ, రెడ్​హిల్స్, మోజంజాహి మార్కెట్​ఏరియా, ఆళ్లబండ, బేగంబజార్​ తదితర ప్రాంతాల్లో పాత పైప్​లైన్లు ఉన్నాయి. 

ఈ ఏరియాలకు వెళ్లి పాత పైపులైన్లను గుర్తించి మార్చాలని నిర్ణయించారు. నిత్యం నగరంలో సరఫరా చేస్తున్న నీటిలో దాదాపు 30శాతం లీకేజీల కారణంగానే భూమిలోకి ఇంకిపోవడం, డ్రైనేజీల్లో కలుస్తున్నట్టు అంచనా వేస్తున్నారు. పూర్తిగా పాత లైన్లను దశల వారీగా తొలగించి కొత్త లైన్లను వేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ పనులను రెండు నెలల్లో పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.