- ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద గోడెందుకు?
- దళిత సంఘాలతో చర్చించాకే పనులు మొదలుపెట్టాలి: జి.చెన్నయ్య, బేర బాలకిషన్
- ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత నేతల నిరసన
ముషీరాబాద్, వెలుగు: ట్యాంక్ బండ్ సర్కిల్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం చుట్టూ ఎవరికీ తెలియకుండా జీహెచ్ఎంసీ అధికారులు ప్రహరీ గోడ నిర్మించడం ఏమిటని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి చైర్మన్ జి. చెన్నయ్య, కో చైర్మన్ బేర బాలకిషన్, ఇతర దళిత సంఘాల నేతలు ఫైర్ అయ్యారు. చుట్టూ గోడను నిర్మించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానిస్తారా? అని ప్రశ్నించారు.
బుధవారం ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి, దళిత సంఘాలు ప్రహరీ గోడ నిర్మాణంపై నిరసన తెలిపాయి. గోడను నిర్మిస్తున్న అధికారులు వెంటనే అక్కడికి రావాలని నినాదాలు చేస్తూ బైఠాయించారు. సైఫాబాద్ ఏసీపీ సంజయ్ కుమార్ అక్కడికి వచ్చి వారితో చర్చించారు.
అనంతరం జి. చెన్నయ్య, బేర బాలకిషన్ మాట్లాడుతూ.. అంబేద్కర్ విగ్రహం వద్దకు వెళ్లేందుకు, స్మరించుకోవడానికి వీలు లేకుండా గోడ నిర్మించడం సరికాదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి స్పందించి వెంటనే సంబంధిత అధికారులను సస్పెండ్ చేయాలని దళిత నేతలు డిమాండ్ చేశారు.
ఒకవేళ గోడ కట్టాలని అనుకుంటే దళిత సంఘాల నాయకులతో ప్రభుత్వం చర్చించి, అందరి ఆమోదంతోనే పనులు మొదలుపెట్టాలని కోరారు. లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు ఎర్రమళ్ళ రాములు, బూర్గుల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
అర్ధరాత్రి గోడ కూల్చివేత..
అంబేద్కర్ విగ్రహం చుట్టూ జీహెచ్ఎంసీ కట్టిన గోడను దళిత సంఘాల నాయకులు మంగళవారం అర్ధరాత్రి కూల్చివేసి నిరసన తెలిపారు. బ్యూటిఫికేషన్ పేరుతో విగ్రహం వద్దకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత సంఘాలతో చర్చించిన తర్వాతే గోడ నిర్మాణంపై నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేశారు.