భాగ్యనగరంలో ఆషాడ మాసబోనాలు మహా నగరంలో ఈరోజు కన్నుల పండువగా సాగుతు న్నాయి. సిటీలో గల్లీగల్లీలు ఆధ్యా త్మిక శోభను సంతరించు కున్నాయి.. ఈనెల 7వ తేదీన గోల్కొండ జగ దాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో ఈ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇవాళ ( జులై 14) గోల్కొండ జగదాం బికా అమ్మవారికి బోనం సమర్పించడానికి మహిళలు పెద్ద యెత్తున తరలి వస్తున్నారు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్త కుండా గోల్కొండ కోట కింద పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు
గోల్కొండలోని జగదాంబికా అమ్మవారి ఆలయం వద్ద బోనాల సందడి నెలకొంది. మహిళలు పెద్దఎత్తున బోనాలతో అక్కడికి చేరుకున్నారు. అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. డప్పు చప్పుళ్లు, తీన్మార్ దరువులతో ఆ ప్రాంతమంతా మార్మోగుతోంది. పోతరాజుల వీరంగాలు, శివసత్తుల ఆటలతో జాతర శోభ సంతరించుకుంది.
దశాబ్ది బోనాల వేడుకల పేరుతో ఈ సారి ప్రభుత్వం బోనాలను మరింత శోభాయమానంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. రూ.20 కోట్ల నిధులను కేటాయించింది. ఈ సందర్భంగా అమ్మవారికి డప్పు చప్పుళ్లు, పోతురాజుల విన్యాసాలు ప్రదర్శించారు. హైదరాబాద్, సంస్కృతి, సంప్రదాయాలకు అద్దంపట్టేలా, బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని మంత్రి చెప్పారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టామని తెలిపారు. గోల్కొండలో ఈ నెల 7న మొదలైన బోనాలు నెల రోజుల పాటు ఘనంగా జరుగుతాయి. ఆగస్టు 4 వరకు గోల్కొండలో బోనాల ఉత్సవాలు కొనసాగనున్నాయి. ఈ నెల 21, 22 తేదీల్లో సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి.. 28, 29 తేదీల్లో లాల్ దర్వాజా బోనాలు జరగనున్నాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్రలతో పాటు దేశ, విదేశాల సందర్శకులు తరలివస్తారు. ప్రతి ఆదివారం, గురువారం జగదాంబిక అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. గోల్కొండ బోనాల కోసం భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు.
బోనాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం కోసం 600 మంది పోలీస్ సిబ్బందిని వినియోగిస్తున్నామని, సీసీ కెమెరాల నిఘాలో బోనాలను పర్యవేక్షిస్తామని చెప్పారు. గోల్కొండ కోటకు వచ్చే వారికి మూడు ప్రాంతాల్లో పార్కింగ్ ఉంటుందని, సెవన్ టూంబ్స్ వద్ద ఓ పార్కింగ్, లంగర్‌హౌస్ హుడా పార్కు వద్ద పార్కింగ్, రాందేవ్‌గూడ దాటిన తర్వాత ఓ పార్కింగ్ ప్రదేశాన్ని కేటాయిస్తున్నామని వివరించారు. ప్రజలందరూ పోలీసులకు సహాయ సహకారాలు అందించి ప్రశాంత వాతావరణంలో బోనాలను జరుపుకోవాలని కోరారు.