ఒంటెలను మేపడం, పిల్లలు పుట్టాక వాటిని అమ్ముకోవడం మాత్రమే తెలుసు వాళ్లకు. అలాంటివాళ్ల జీవితాల్లో రాజస్తాన్ గవర్నమెంట్ తీసుకొచ్చిన చట్టం పెను మార్పు తెచ్చింది. ఒంటెల పెంపకానికి దూరం చేసింది. జర్మనీ నుంచి వచ్చిన ‘ఇల్సే’ వాళ్లకు ఒంటె పాల విశిష్టత గురించి చెప్పింది. వాళ్ల కోసం ప్రత్యేకంగా ఒక డైరీ కూడా ఏర్పాటు చేసింది. దాంతో వాళ్లకు మళ్లీ పాత రోజులు వచ్చాయి. ఒకప్పుడు ఒంటెలను అమ్మి పొట్టపోసుకునే వాళ్లు కాస్తా.. ఇప్పుడు ఒంటె పాలు అమ్మి జీవనం సాగిస్తున్నారు.
రాజస్తాన్‌లోని పాలి జిల్లాలో సద్రీ అనే పట్టణం ఉంది. అక్కడ రైకా అనే కమ్యూనిటీ వాళ్లు ఎక్కువగా ఉంటారు. ఎడారి ప్రాంతం కావడం వల్ల అక్కడ ఎప్పుడూ వేడిగా ఉంటుంది. ఎండ బారిన పడకుండా ఉండేందుకు తలకు పెద్ద తలపాగా చుట్టుకుంటారు అక్కడి వాళ్లంతా. తెల్లటి అంగ్రఖా బట్టలు వేసుకుంటారు. ఒంటెలను పెంచడమే వాళ్ల జీవనాధారం. అక్కడి ఒంటెలు కూడా ప్రత్యేకంగా ఉంటాయి. మామూలుగా అయితే ఒంటెలు ఒంటరిగా కూడా ప్రయాణిస్తుంటాయి. కానీ.. ఇక్కడి ఒంటెలు ఎక్కడికి వెళ్లినా గుంపుగా వెళ్లాల్సిందే. వాటి యజమానులను దూరం నుంచే గుర్తిస్తాయి అవి. ఆ ఒంటెలను ఊరు చుట్టుపక్కల ఉన్న బీడు భూములు, పంటకోసిన పొలాల్లో మేపుతారు.
డాక్టర్ సలహా..
జర్మనీకి చెందిన డాక్టర్ ఇల్సే కోహ్లెర్–రోలెఫ్సన్ మూడు దశాబ్దాలకు పైగా ఒంటెల మీద రీసెర్చ్ చేశారు. ఇల్సే ఒకసారి సద్రీకి వచ్చినప్పుడు అక్కడి పరిస్థితులు గమనించిన ఆమెకు ఒక ఐడియా వచ్చింది. అక్కడి ఒంటెలు 36 రకాల మొక్కల్ని తింటాయి. దాని వల్ల పాల ఉత్పత్తి, నాణ్యత బాగుంటాయి. కానీ.. రైకా కమ్యూనిటీ వాళ్లు పాల మీద ఆధారపడరు చాలావరకు. పెంచిన ఒంటెలను మేళాలకు తీసుకెళ్లి అమ్ముకుని డబ్బు సంపాదించేవాళ్లు. పూర్వీకుల నుంచి వస్తున్న అలవాటు అది. ప్రతి నవంబర్‌లో అక్కడ లైవ్‌స్టాక్ ఫెయిర్ జరుగుతుంది.
దాన్ని పుష్కర్ మేళా అంటారు. రైకా కమ్యూనిటీకి చెందిన కరణ్ రామ్ ఆ రోజులను గుర్తుచేసుకుంటూ “మేళా ద్వారా చాలా డబ్బు సంపాదించేవాళ్లం. నిజానికి, ఏడాది పొడవునా సంపాదించే దానికంటే ఆ ఒక్క నెలలోనే ఎక్కువ సంపాదిస్తాం. కానీ.. 2014లో పరిస్థితులు మారిపోయాయి. రాజస్తాన్ ప్రభుత్వం రాష్ట్రంలో ఒంటెల సంఖ్య తగ్గిపోవడాన్ని గుర్తించింది.1998 నుంచి 2012 సంవత్సరాల మధ్య వాటి సంఖ్య 54 శాతం తగ్గింది. అందుకే ఒంటెను రాజస్తాన్ రాష్ట్ర జంతువుగా ప్రకటించారు. దాంతో 2015 తర్వాత ఒంటెల వ్యాపారం బాగా తగ్గింది. రాజస్తాన్ క్యామెల్ యాక్ట్ తీసుకొచ్చింది. దాని ప్రకారం.. ఒంటెల్ని వధించడం నిషేధం అక్కడ. అనధికారిక రవాణా, ఎగుమతులను నిలిపివేశారు” అని చెప్పాడు.
ఈ చట్టం ఒంటెలకు మేలు చేసేదే అయినప్పటికీ రైకా కమ్యూనిటీ జీవనోపాధిని దెబ్బతీసింది. ఆ తర్వాతి సంవత్సరాల్లో పుష్కర మేళా నిర్మానుష్యంగా మారింది. దాంతో రైకా కమ్యూనిటీ ఒంటెల పెంపకం మానేయాలని డిసైడ్ అయింది.
ఒంటెల వ్యాపారం ఆగిపోవడంతో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కొన్ని సంవత్సరాలు గడిచాక మళ్లీ పాత రోజులు వచ్చేశాయి. కరణ్ దగ్గర ఇప్పుడు 40 ఒంటెలు ఉన్నాయి. వాటి సంఖ్య పెంచేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇంతకీ ఈ మధ్యకాలంలో ఏం జరిగింది? మళ్లీ ఒంటెలు పెంచాలని ఎందుకు అనుకున్నారు? అంటే..ఒంటె పాలకు ఉన్న డిమాండ్ తెలియడమే..
క్యామెల్ చరిష్మా
డాక్టర్ ఇల్సే కోహ్లెర్–రోలెఫ్సన్, హన్వంత్ సింగ్ రాథోడ్ కలిసి ‘క్యామెల్ చరిష్మా’ పేరుతో ఈ ప్రాంతంలో సోషల్ ఎంటర్‌ప్రైజ్‌ని స్థాపించారు. ఒంటె నుండి సేకరించిన పర్యావరణ అనుకూల ఉత్పత్తులను మార్కెట్ చేయడం లక్ష్యంగా ఈ ఎంటర్ప్రైజ్ పనిచేస్తోంది. జర్మనీకి చెందిన ఇల్సే వెటర్నరీ మెడిసిన్‌లో పీహెచ్‌డీ చేశారు. రాజస్తాన్‌కు చెందిన రాథోడ్ రాష్ట్రంలోని ఒంటెల సంరక్షణ కోసం పనిచేస్తున్న లోఖిత్ పశు పాలక్ సంస్థాన్ (ఎల్‌పీపీఎస్) స్థాపకుడు. వీళ్లిద్దరికీ స్నేహం ఎలా ఏర్పడింది? స్టార్టప్ పెట్టడానికి కారణమేంటి? అని ఇల్సేని అడిగితే..1991 నాటి విషయాలను చెప్పుకొచ్చిందామె.
‘‘ఫెలోషిప్ కోసం నేను ఇండియాకి వచ్చా. అప్పుడే రైకా కమ్యూనిటీ గురించి తెలిసింది. అప్పట్లో ఎక్కువగా ఒంటెలున్న దేశాల్లో ఇండియా మూడో ప్లేస్‌లో ఉంది. కాబట్టి వాటి గురించి మరింత తెలుసుకునేందుకు పాలి జిల్లాకు వెళ్లాలి అనుకున్నా. అందుకోసం ఒక ట్యాక్సీ మాట్లాడుకున్నా. ఆ ట్యాక్సీ డ్రైవర్ హన్వంత్ సింగ్ రాథోడ్. నాకు పాలీ జిల్లా అంతా తిప్పి చూపించడమే కాకుండా ఎన్నో కబుర్లు చెప్పాడు. అతనికి ఒంటెల గురించి బాగా తెలుసు. స్థానిక మాండలికంలో కూడా నిష్ణాతుడు. అతనితో ఆ టాక్సీలో జరిగిన సంభాషణతో మా ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది” అంటూ చెప్పుకొచ్చారు.
తర్వాత డాక్టర్ ఇల్సే ఫెలోషిప్ పూర్తయినా ఇండియాలోనే ఉండాలని నిర్ణయించుకుంది. కొన్నేండ్ల తర్వాత రాథోడ్ తన డ్రైవర్ వృత్తిని వదిలేయాలి అనుకున్నాడు. అందుకు ఏదైనా అవకాశం రాకపోతుందా అని ఎదురుచూసేవాడు. అప్పుడే వాళ్లకు ఒంటె పాల డైరీ అనే ఆలోచన వచ్చింది. దీనిద్వారా ఒంటెల సంఖ్య తగ్గకుండా కాపాడడంతో పాటు రైకా కమ్యూనిటీ వాళ్లకు ఉపాధిని ఇచ్చినట్టు అవుతుంది అనుకున్నారు. అలా క్యామెల్ చరిష్మా అనే స్టార్టప్ పెట్టారు. 2019లో రాజస్తాన్‌లోని మొట్టమొదటి క్యామెల్ డైరీ ‘కుంబల్‌ఘర్’ని ఏర్పాటు చేశారు.
లాక్డౌన్లో ఫేమస్
కరోనా ప్యాండెమిక్ వల్ల 2020లో లాక్‌డౌన్ విధించారు. అప్పుడు పాల వ్యాపారం ఆగిపోతుంది అనుకున్నారు. కానీ.. ఒంటెపాలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయని తెలిసి ఎక్కువమంది వాటిని కొనడం మొదలుపెట్టారు. అదే టైంలో టైమ్స్ ఆఫ్ ఇండియా ‘ఎక్స్’ ఎకౌంట్లో క్యామెల్ మిల్క్ గురించి ఒక స్టోరీ పోస్ట్ చేసింది. అందులో ఒకామె ‘‘నా మూడున్నరేళ్ల బిడ్డ ఆటిజంతో బాధపడేవాడు. ఒంటె పాలు, పప్పు ధాన్యాల డైట్‌తో ఆ సమస్య దూరమైంది” అని చెప్పింది. అది చదివిన వాళ్లంతా ‘ఒంటె పాలకి అంత శక్తి ఉందా?’ అనుకున్నారు. ఒంటెపాలలో పోషకాలు ఉంటాయని ఎన్నో రీసెర్చ్ పేపర్స్ చెప్పాయి.
ఒంటె పాలు ఆటిజం మాత్రమే కాదు.. అనేక అనారోగ్య సమస్యలను దూరం చేస్తాయని రీసెర్చ్‌లు చెప్తున్నాయి. 2021లో ప్రచురించిన మరో రీసెర్చ్ పేపర్లో ఒంటె పాలలోని పోషకాలు, ఔషధ గుణాల గురించి ప్రస్తావించారు. బయోయాక్టివ్ పెప్టయిడ్స్, లాక్టోఫెర్రిన్, జింక్, మోనో అండ్ పాలీ అన్ శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఈ పాలలో సమృద్ధిగా ఉన్నాయని తేలింది. క్షయ, ఆస్తమా, జీర్ణాశయ వ్యాధులు, కామెర్లు లాంటి వాటిని తగ్గించడంలో ఈ పాలు సాయపడతాయి.
ఇదిలా ఉండగా.. బికనీర్‌లోని ఎస్‌పి మెడికల్ కాలేజీలో డయాబెటిక్ కేర్ అండ్ రీసెర్చ్ సెంటర్ హెడ్ ఆర్.పి. అగర్వాల్ 2011లో చేసిన అధ్యయనం ప్రకారం... ఎక్కువ కాలం ఒంటె పాలు తాగడం వల్ల టైప్ 1 డయాబెటిస్‌తో బాధపడుతున్న రోగుల ఇన్సులిన్ డిపెండెన్స్ 60 నుంచి 70 శాతం వరకు తగ్గించవచ్చని కనుగొన్నాడు. ఈ రీసెర్చ్ల వల్ల చాలామందికి ఒంటెపాల మీద అవగాహన పెరిగింది. దాంతో డిమాండ్ కూడా పెరిగింది.
నెలకు పాతిక వేలు
కరణ్ అనే రైతు ఒంటె పాలను అమ్ముతూ నెలకు పాతికవేలు సంపాదిస్తున్నాడు. ఒంటెలు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలంటే వాటిని బయట తిప్పాలని నమ్ముతారు ఇక్కడి రైతులు. అందుకే ఒంటెల్ని గడ్డి, ఆకులు ఉన్న చోటికి తీసుకెళ్తారు.
పాలు ఫ్రీజ్ చేసి...
క్యామెల్ చరిష్మా ఇప్పుడు తిరుగులేని కంపెనీ. కానీ.. మొదట్లో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. సరైన ప్యాకింగ్ వ్యవస్థ లేని టైంలో 200 ఎం.ఎల్. బాటిళ్లలో పాలు నింపి వాటిని ఫ్రీజ్ చేసి డెలివరీ చేసేవాళ్లు. కానీ.. ఇప్పుడు ఒంటెపాలతో చేసిన రకరకాల ప్రొడక్ట్స్ అమ్ముతున్నారు. క్యామెల్ చరిష్మాకు డైరీ యూనిట్‌తోపాటు పేపర్, వూల్, చీజ్–మేకింగ్ యూనిట్లు కూడా ఉన్నాయి. వూల్ మేకింగ్ యూనిట్లో వూల్ని ఫైబర్‌గా మారుస్తారు. దాంతో ధుర్రీలు (రగ్గులు) తయారుచేస్తారు. పేపర్ మేకింగ్ యూనిట్లో ఒంటెల పేడ నుండి పేపర్ తయారుచేస్తున్నారు. క్యామెల్ చరిష్మా తయారుచేసే ప్రొడక్ట్స్‌లో క్యామెల్ చీజ్ బాల్స్ ఎక్కువగా అమ్ముడవుతున్నాయి.
రైకాలకు చెప్పి..
రైకా కమ్యూనిటీ వాళ్లు ఒంటెల పోషణ తగ్గిస్తున్న టైంలో ఇల్సే వాళ్ల దగ్గరకు వెళ్లింది. ఒంటె పాలు పిల్లలు, రక్తహీనత ఉన్న మహిళలకు మంచివని ప్రచారం చేసింది. మొదట్లో వాళ్లు ఈ పాలకు మార్కెట్ ఉంటుందని నమ్మలేదు. చాలా సార్లు వాళ్లతో మీటింగ్‌లు పెట్టి అవగాహన కల్పించింది. తర్వాత వాళ్లకు నమ్మకం కుదిరి ఒంటెల పెంపకం మళ్లీ మొదలుపెట్టారు. అలా పాల ప్రొడక్షన్ పెరిగింది.
సుప్రీం కోర్టు వరకూ..
ఒంటెపాలు మంచివని నిరూపించేందుకు రాథోడ్ సుప్రీం కోర్టు వరకు వెళ్లాడు. రాజస్తాన్ హైకోర్టు 1999లో ‘ఒంటె పాలు మానవ వినియోగానికి మంచిది కాద’ని చెప్పింది. ఇల్సే ఒంటెపాల గురించి ప్రచారం చేస్తున్నప్పుడు కొందరు ఆమెతో అదే విషయాన్ని చెప్పారు. దాంతో.. రాథోడ్ సుప్రీంకోర్టుకు వెళ్లి ఆ ఉత్తర్వులు రద్దు చేయాలని కోరాడు. సుప్రీం వాటిని రద్దు చేస్తూ మళ్లీ ఆర్డర్స్ ఇచ్చింది. అక్కడితో ఆగకుండా.. 2016లో ఒంటె పాలను ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఫుడ్ ప్రొడక్ట్‌గా గుర్తించే వరకు పోరాడాడు రాథోడ్.