ఎలక్షన్​ కమిషన్​ రాజీపడింది.. మహారాష్ట్ర ఎన్నికల నిర్వహణే అందుకు ఉదాహరణ: రాహుల్

ఎలక్షన్​ కమిషన్​ రాజీపడింది.. మహారాష్ట్ర ఎన్నికల నిర్వహణే అందుకు ఉదాహరణ: రాహుల్

న్యూఢిల్లీ: ఎన్నికల కమిషన్​పై కాంగ్రెస్​ అగ్రనేత, లోక్​సభ ప్రతిపక్ష నేత రాహుల్ ​గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. కమిషన్​ రాజీపడిందని, ఇటీవల జరిగిన  మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నిర్వహణే ఇందుకు ఉదాహరణ అని వ్యాఖ్యానించారు.  కేంద్ర ఎన్నికల వ్యవస్థలో అనేక లోపాలు ఉన్నాయని.. వీటిపై తాను చాలాసార్లు ప్రశ్నించానని ఆయన తెలిపారు. అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్​ గాంధీ.. బోస్టన్​లో అక్కడి ఎన్నారైలు నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.

మహారాష్ట్ర​ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు గంటల్లోనే 65 లక్షల మంది ఓటేసినట్లు ఎన్నికల సంఘం ప్రకటించిందని.. ఇది ఎలా సాధ్యమని నిలదీశారు. ‘‘సాయంత్రం 5.30 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు 65 లక్షల మంది ఓటేసినట్లు స్వయంగా ఎన్నికల కమిషన్​ ప్రకటించింది. రెండు గంటల్లో ఇంత మంది ఓటేయడం భౌతికంగా సాధ్యం కాదు.

ఒక్కో ఓటరు ఓటు వేసేందుకు  కనీసం 3 నిమిషాలు పడ్తుంది. ఆ లెక్కన చూస్తే  అర్ధరాత్రి 2 గంటల వరకు పోలింగ్​ జరగాలి. మరి ఏం జరిగింది? దీనిపై వీడియో సాక్ష్యాలు అడిగితే ఈసీ నిరాకరించింది. ఇప్పుడైతే ఇకపై అలా అడగడానికి వీల్లేదంటూ చట్టాన్ని మార్చేశారు” అని రాహుల్​ మండిపడ్డారు. ఈ ఘటనను బట్టి చూస్తే ఎలక్షన్​ కమిషన్​ రాజీపడినట్లు అర్థమవుతున్నదని.. ఎన్నికల వ్యవస్థలో ఎన్నో లోపాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. అమెరికా, ఇండియా సంబంధాలపై రాహుల్​ మాట్లాడుతూ.. రెండు దేశాలు కలిసి పనిచేయాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు. విదేశాల్లోనూ కాంగ్రెస్​ పార్టీ ఆదర్శాలను ఎన్నారైలు కొనసాగిస్తున్నారని, వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.  

దేశద్రోహిలా వ్యవహరిస్తున్నడు: బీజేపీ
దేశ ప్రతిష్ట అపఖ్యాతి పాలు చేయాలని రాహుల్​గాంధీ లక్ష్యంగా పెట్టుకున్నారని, అందుకే విదేశాల్లో మన వ్యవస్థల గురించి ఇష్టమున్నట్లు మాట్లాడుతున్నారని బీజేపీ మండిపడింది. ‘‘భారత దేశం గురించి, ఇక్కడి వ్యవస్థల గురించి ఇష్టమున్నట్లు విదేశాల్లో మాట్లాడటం రాహుల్​ గాంధీకి పరిపాటిగా మారింది. ఆయన మానసిక పరిస్థితి సరిగ్గా లేదు” అని బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్​ భండారీ వ్యాఖ్యానించారు.