నన్ను క్షమించలేనని మోదీ అప్పుడే చెప్పారు : ప్రజ్ఞా సింగ్‌ ఠాకుర్‌

రాబోయే లోక్​సభ ఎన్నికల కోసం ఇటీవల 195 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను బీజేపీ ప్రకటించిన సంగతి తెలిసిందే.  అయితే ఈ లిస్టులో   భోపాల్‌ ఎంపీ ప్రజ్ఞా సింగ్‌ ఠాకుర్‌కు చోటు దక్కలేదు.  దీనిపై తాజాగా ఆమె స్పందించారు. గతంలో తాను చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు ప్రధాని మోదీని అసంతృప్తికి గురిచేశాయన్న ఠాకుర్..   తనను క్షమించలేనని మోదీ చెప్పారంటూ వ్యాఖ్యనించింది.  ప్రజ్ఞా సింగ్‌ ఠాకుర్‌ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.  

తాను గతంలోనూ టికెట్‌ ఇవ్వమని కోరలేదన్న  ప్రజ్ఞా సింగ్‌ .. ఇప్పుడు కూడా అడగడం లేదన్నారు. గతంలో తాను చేసిన కొన్ని వ్యాఖ్యల్లో ఉపయోగించిన పదజాలం మోదీకి నచ్చలేదని... ఈ విషయాన్ని మోదీ అప్పుడే చెప్పారంది. తనను  ఎప్పటికీ క్షమించలేనని కూడా అన్నారని తెలిపింది. అయినప్పటికీ తాను మాత్రం ఆయనను క్షమాపణలు కోరానని వెల్లడించింది.  

మాలేగావ్ పేలుళ్ల కేసులో నిందితురాలిగా ఉన్న సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ దిగ్గజం దిగ్విజయ్ సింగ్‌పై 3.65 లక్షల ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇప్పుడు  ఆమె స్థానంలో మాజీ మేయర్ అలోక్ శర్మకు అధిష్టానం టికెట్ కేటాయించింది.   వివాదాస్పద ప్రకటనలకు పేరుగాంచిన ఠాకూర్  గతంలో మహాత్మా గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.  ఆ విషయంపై మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వ్యాఖ్యలు చేయడం సమాజానికి మంచిది కాదని, ప్రజ్ఞా క్షమాపణలు అడిగినా పూర్తిగా క్షమించలేకపోతున్నానని ప్రధాని వ్యాఖ్యానించారు