కబితాస్ కిచెన్ యూట్యూబ్ ఛానెల్.. నెలకు రూ.11లక్షల ఆదాయం

‘‘ఎవరూ పుట్టుకతో గ్రేట్‌‌ కుక్‌‌ కాలేరు. కానీ.. ప్రయత్నిస్తే అందరూ నేర్చుకోవచ్చు. నేర్చుకుంటే గ్రేట్‌‌ కుక్ కావొచ్చు” ఫేమస్‌‌ చెఫ్ జూలియా చైల్డ్‌‌ అన్న మాటలివి. కబితా సింగ్‌‌ ఈ మాటలను బలంగా నమ్మింది. అందుకే ప్రయత్నించింది.. సక్సెస్‌‌ అయింది. ఉద్యోగాన్ని కూడా వదులుకుని కుకింగ్‌‌పై దృష్టి పెట్టింది సొంత యూట్యూబ్ ఛానెల్‌‌ ‘కబితాస్ కిచెన్’ని మొదలుపెట్టి.. 11.9 మిలియన్ల సబ్‌‌స్క్రయిబర్ల మెప్పు పొందింది. యూట్యూబ్ నుంచి డైమండ్ ప్లే బటన్‌‌ అందుకున్న కొద్దిమంది ఇండియన్ యూట్యూబర్లలో ఈమె ఒకరు. 

కబితా సింగ్ ఫేమస్‌‌ ఇండియన్ కుక్, ఫుడ్ బ్లాగర్, రెస్టారెంట్ కన్సల్టెంట్. ఆమె ప్రస్తుతం ముంబైలో ఉంటోంది. కోల్‌‌కతాలో 21 ఫిబ్రవరి 1978న పుట్టిన కబిత ‘జ్ఞాన్ భారతి బాలికా విద్యాలయ’లో స్కూల్‌‌ ఎడ్యుకేషన్‌‌ కంప్లీట్‌‌ చేసింది. తర్వాత కలకత్తా యూనివర్సిటీలో బి.కామ్‌‌ ఆనర్స్‌‌ పూర్తి చేసింది. కబితకి చిన్నప్పటి నుంచి వంట చేయడం అంటే ఇష్టం. కానీ.. ఆమె బ్యాంకర్‌‌గా సెటిల్‌‌ అయింది. మొదట ఉత్తరప్రదేశ్‌‌లోని ఐసీఐసీఐ బ్యాంక్‌‌లో లయబిలిటీ డెస్క్ ఆఫీసర్‌‌‌‌గా ఉద్యోగంలో చేరింది. అందులో మూడేండ్లు పనిచేసింది. తర్వాత ‘‘ఐఎల్‌‌అండ్‌‌ఎఫ్​ఎస్‌‌’’లో రిలేషన్ షిప్ మేనేజర్‌‌గా పనిచేసింది. ఆ తర్వాత ‘‘మైక్రోసెక్‌‌ క్యాపిటల్ లిమిటెడ్”లో డీలర్‌‌గా చేరింది. చాలా రోజులు స్టాక్ మార్కెట్‌‌ సెక్టార్‌‌‌‌లో కూడా పనిచేసింది. ఆరు నెలల తర్వాత మైక్రోసెక్ క్యాపిటల్ లిమిటెడ్‌‌ నుంచి హెచ్‌‌ఎస్‌‌బీసీ బ్యాంక్‌‌లో డెస్క్ ఆఫీసర్‌‌గా చేరింది. అక్కడ మూడు నెలలు పనిచేసింది. 2009లో మనీష్ సింగ్ అనే సాఫ్ట్‌‌వేర్ ఇంజనీర్‌‌ని పెళ్లి చేసుకుంది. మనీష్​ లండన్‌‌లో సాఫ్ట్‌‌వేర్ ఇంజనీర్‌‌గా పనిచేసేవాడు. దాంతో ఆమె కూడా బ్రిటన్‌‌ వెళ్లాల్సి వచ్చింది. భర్త ఉద్యోగం కోసం తన ఉద్యోగానికి రిజైన్‌‌ చేసింది.  

లండన్‌‌లో వంట కోసం..

కబితా సింగ్ లండన్‌‌లో ఉన్నన్ని రోజులు భర్త ఆఫీస్‌‌కు వెళ్లి, తిరిగి వచ్చేదాకా ఇంట్లో ఒంటరిగా ఉండేది. దాంతో ఖాళీ టైంలో కొత్త వంటలు నేర్చుకుంది. ఎలా చేయాలో తెలుసుకోవడానికి యూట్యూబ్‌‌లో వీడియోలు చూసేది. పైగా అక్కడ ఇండియన్ వంటకాలు అన్నీ దొరకవు. కాబట్టి కచ్చితంగా ఇంట్లోనే వంట చేయాల్సి వచ్చింది. ఐదేళ్ల తర్వాత 2014లో  ఇండియాకి తిరిగి వచ్చేసింది. అప్పటికే ఆమెకు ఇద్దరు పిల్లలు. వాళ్లతో ఎక్కువ టైం స్పెండ్‌‌ చేయాలనే ఉద్దేశంతో ఎక్కడా ఉద్యోగంలో చేరలేదు. కానీ.. పిల్లలు స్కూలుకు వెళ్లాక ఖాళీటైంలో ఏం చేయాలో తోచేది కాదు. దాంతో యూట్యూబ్ ఛానెల్‌‌ మొదలుపెట్టాలని నిర్ణయించుకుంది. అనుకున్న వెంటనే ఛానెల్‌‌ పెట్టి దానికి ‘కబితాస్ కిచెన్’ అని పేరు పెట్టింది. కొన్ని నెలల్లోనే ఆమె వీడియోలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక అప్పటినుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. 

ట్రెండ్‌‌ ఫాలో అవుతూ...

వంట గురించి ఏమాత్రం తెలియని వాళ్లు కూడా కబిత చేసే వీడియోలు చూస్తే ఈజీగా వంట చేయగలరు. అంత ఈజీ పద్ధతుల్లో వంట చేస్తుంది. ఇప్పుడు ఆమె చేసే వీడియోలను  దాదాపు అన్ని వయసుల వాళ్లు ఫాలో అవుతున్నారు. అందుకే అన్ని వయసుల వాళ్లకు ఇష్టమైన రెసీపీల వీడియోలు చేస్తోంది. అంతేకాదు కబిత ఎప్పటికప్పుడు ట్రెండ్‌‌ని ఫాలో అవుతుంది. ఇప్పుడు ఎక్కువగా యూట్యూబ్ షార్ట్స్‌‌ కూడా చేస్తోంది. వాటిలో వంట చిట్కాలు చెప్తోంది. ఆమె చేసే ప్రతి వంటలో దాదాపు అందరికీ అందుబాటులో ఉండే ఇంగ్రెడియెంట్స్‌‌ మాత్రమే వాడుతుంది. అందుకే ఆమె వీడియోలు ఎక్కువమందికి కనెక్ట్ అవుతాయి. అంతేకాదు.. అందరికీ ఈజీగా అర్థమయ్యేలా చక్కగా వివరిస్తుంది.  

ఈజీగా వండేవి

‘‘యూట్యూబ్‌‌ ఛానెల్‌‌ని మొదలుపెట్టినప్పుడు కొత్త రెసిపీలు ఎలా చేయాలని ఎక్కువగా ఆలోచించా. వంటకి సంబంధించిన ప్రతి విషయాన్ని చూపించే రెసిపీ వీడియోలను క్రియేట్‌‌ చేయాలని డిసైడ్‌‌ అయ్యా. అంతేకాకుండా మా ఇంటికి దగ్గరలో ఉన్న  కిరాణా షాప్‌‌లో దొరికే ఇంగ్రెడియెంట్స్‌‌తో మాత్రమే వంటలు చేయాలని నిర్ణయించుకున్నా. అలా అయితేనే వీడియో చూసిన వాళ్లంతా వండుకోగలరు. మొదట్లో వంట గురించి పెద్దగా తెలియని వాళ్ల కోసమే వీడియోలు చేశా. ఆ వీడియోలను హాస్టల్స్‌‌లో ఉండేవాళ్లు, యంగ్‌‌ వర్కింగ్ ప్రొఫెషనల్స్, కొత్త జంటలు, విదేశాల్లో ఉండేవాళ్లు ఎక్కువగా చూసేవాళ్లు. ఇప్పుడు సబ్‌‌స్క్రయిబర్ల డిమాండ్‌‌ను దృష్టిలో పెట్టుకుని అన్ని రకాల వంటలు చేస్తున్నా. మఖ్యంగా ఇండియన్ రెసిపీలు ఎక్కువగా చేస్తున్నా” అంటూ తన జర్నీని చెప్పుకొచ్చింది. 

సంపాదన

కబిత నెలకు దాదాపు 11 లక్షలకు పైగా సంపాదిస్తోంది. ఏడాదికి కోటి నలభై లక్షల రూపాయల వరకు సంపాదిస్తోంది. అయితే.. ఈ ఆదాయం కేవలం ఛానెల్‌‌ నుంచి మాత్రమే వచ్చేది కాదు. స్పాన్సర్‌‌షిప్‌‌లు, కమిషన్లు, ప్రమోషన్స్‌‌ ద్వారా కూడా కొంత డబ్బు సంపాదిస్తోంది.