అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా అధ్యక్ష అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, కమలా హ్యారీస్ ఒకరిపై ఒకరు విమర్శల దాడి చేసుకుంటున్నారు. తాజాగా మాజీ అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కమలా హ్యారీస్ నిజంగా నల్లజాతీయురాలా?.. లేక 2024 అధ్యక్ష ఎన్నికల్లో గెలవడం కోసం అలా చెప్పుకుంటున్నారా? అని ఆయన ప్రశ్నించారు.‘‘కమలా హ్యారీస్ ఎప్పుడూ భారతీయ వారసత్వం కలిగిన వ్యక్తిగానే ఉండేవారు.
భారతీయ వారసత్వాన్ని మాత్రమే ఆమె ప్రచారం చేసుకున్నారు. నల్లజాతిగా మారిన కొన్నేళ్ల కిందటి వరకు ఆమె నల్లజాతీయురాలని నాకు తెలియదు’’ అని ట్రంప్ అన్నారు. ప్రస్తుతానికైతే తనను నల్లజాతీయురాలిగానే పిలవాలని కమలా హ్యారీస్ కోరుకుంటున్నారని, కాబట్టి ఆమె భారతీయురాలా? లేక నల్లజాతీయురాలా? అనేది తనకు తెలియదని ట్రంప్ విమర్శించారు.
తాజాగా ట్రూత్ సోషల్ హ్యాండిల్ లో చీరకట్టుతో పాటు తన తల్లిదండ్రులు ఇతర కుటుంబ సభ్యులతో ఉన్న కమలా హారిస్ ఫోటోను ట్రంప్ పోస్ట్ చేశారు. చాలా సంవత్సరాల క్రితం మీరు ఈ ఫోటో పంపించారని.. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు అంటే తనకు ఎనలేని గౌరవం అన్నారు.
స్పందించిన వైట్‌హౌస్..
డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. కమలా హ్యారీస్‌పై వ్యక్తిగత దాడి చేశారంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై వైట్‌హౌస్ కార్యాలయం తక్షణమే స్పందించింది. ట్రంప్ అవమానకరమైన వ్యాఖ్యలు చేశారంటూ మండిపడింది. ‘‘వాళ్లు అది.. వీళ్లు ఇది.. అని చెప్పే హక్కు ఎవరికీ లేదు’’ అని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్-పియర్ వ్యాఖ్యానించారు.