త్వరలోనే భారత విద్యార్థులను సేఫ్గా తీసుకొస్తం

న్యూఢిల్లీ: రష్యా, ఉక్రెయిన్ వార్పై భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. చర్చల ద్వారానే యుద్ధాన్ని ఆపగలమన్నారు. వార్కు దారితీసే ఏ అంశాన్నీ తాము సమర్థించబోమని స్పష్టం చేశారు. శాంతియుత పరిస్థితులు నెలకొనాలన్నదే తమ ధ్యేయమని చెప్పారు. ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారత పౌరులు, విద్యార్థులను సాధ్యమైనంత త్వరగా స్వదేశానికి సురక్షితంగా రప్పించేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే పలు విమానాలను ఉక్రెయిన్ కు పంపామని.. కొందరు స్టూడెంట్స్ భారత్ కు సేఫ్ గా చేరుకున్నామని తెలిపారు. అయితే ఒక ఫ్లయిట్ ఉక్రెయిన్ లో ఇంకా ల్యాండ్ కాలేదని.. అక్కడ కఠిన పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలను కేంద్ర ప్రభుత్వం తీసుకుంటోందని పేర్కొన్నారు. 

కాగా, ఉక్రెయిన్లో తాజా పరిస్థితుల నేపథ్యంలో ఇండియన్ ఎంబసీ మరో అడ్వైజరీ జారీ చేసింది. భారతీయులంతా సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించింది. ఉక్రెయిన్ లో మార్షల్ లా అమల్లో ఉన్నందున రాకపోకలు సాధ్యంకావని, కీవ్ లో చిక్కుకుపోయిన విద్యార్థులకు తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పింది. దగ్గరలో బాంబ్ సైరన్ శబ్దాలు వినిపిస్తే విద్యార్థులు వెంటనే గూగుల్ మ్యాప్స్లో ఉన్న వివరాల ఆధారంగా బాంబ్ షెల్టర్లకు తరలి వెళ్లాలని అధికారులు సూచించారు. భారత పౌరులంతా పశ్చిమ ఉక్రెయిన్ వైపు తరలివెళ్లాలని, పాస్ పోర్టులతో ఇతర డాక్యుమెంట్లు తమ వెంట పెట్టుకోవాలని ఇండియన్ ఎంబసీ స్పష్టం చేసింది. తాజా సమాచారం కోసం ఎంబసీ వెబ్సైట్, సోషల్ మీడియా అకౌంట్లను ఫాలో కావాలని సూచించింది.

మరోవైపు రష్యా బాంబు దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్ తన గగనతలాన్ని మూసివేసింది. ఫలితంగా విమాన సర్వీసులు నిలిచిపోయాయి. స్వదేశానికి తిరిగి వచ్చేందుకు సిద్ధమైన వేలాది మంది భారతీయులు ఉక్రెయిన్లో చిక్కుకుపోయారు. కీవ్లోని ఎయిర్ పోర్టులో ఫ్లైట్ల కోసం వందల మంది పడిగాపులు కాస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం వారిని భారత్కు తీసుకువచ్చేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తోంది. గగనతలం మూసివేసినందున ఇతర మార్గాల్లో వారిని రప్పించేందుకు ప్రయత్నిస్తోంది.

మరిన్ని వార్తల కోసం: 

భారత్ తీరుపై ఉక్రెయిన్ అసంతృప్తి

వార్ ఎఫెక్ట్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు

దాడులు ఉక్రెయిన్ ప్రజలకు వ్యతిరేకం కాదు