పెద్దపల్లి, వెలుగు: సౌలత్లు లేని బిల్డింగులు కట్టి ఓపెనింగులు చేస్తే.. పేదలకు ఏమి ఉపయోగమని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పెద్దపల్లి జిల్లాకు సీఎం కేసీఆర్ రాకను నిరసిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలో భారీ ర్యాలీ, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా విజయరమణరావు మాట్లాడుతూ.. పెద్దపల్లిని జిల్లాగా ప్రకటించి ఆరేండ్లు గడుస్తున్నా.. ఇప్పటి వరకు జిల్లా యంత్రాంగం దిక్కు లేదన్నారు. కలెక్టరేట్ కట్టినా అధికారులు లేరన్నారు. అన్ని శాఖలు ఇన్చార్జిల పాలనలోనే నడుస్తున్నాయన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఇటీవల మాతా శిశు సంక్షేమ కేంద్రాన్ని మంత్రి హరీశ్‌రావు ప్రారంభించి, 3నెలల గడుస్తున్నా సౌలత్లు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. కాంగ్రెస్ లీడర్లు పాల్గొన్నారు.
బాధితుల రోదనలు వినపడ్తలేవా?
హుజూరాబాద్, వెలుగు: రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్ లిమిటెడ్ (ఆర్ఎఫ్ సీఎల్) బాధితుల రోదనలు టీఆర్ఎస్ప్రభుత్వానికి వినపడ్తలేవా? అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ప్రశ్నించారు. శంకరపట్నం మండలం అంబాల్ పూర్ కు చెందిన ఆర్ఎఫ్సీఎల్కాంట్రాక్ట్ ఉద్యోగి హరీశ్ ఆత్మహత్య చేసుకోవడంతో ఆదివారం హరీశ్ మృతదేహానికి కృష్ణారెడ్డి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం మాట్లాడుతూ ఆర్ఎఫ్సీఎల్లో కాంట్రాక్టు ఉద్యోగుల పేరుతో కోట్ల రూపాయల దందా చేశారని ఆరోపణలు వస్తున్నాయన్నారు. రామగుండం కు చెందిన అధికార పార్టీ ప్రజా ప్రతినిధి దళారులను నియమించుకుని డబ్బులు వసూలు చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారన్నారు. మోసపోవడంతో హరీశ్‌లాంటి యువకులు ఆత్మహత్య చేసుకుంటున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపించాలని, హరీశ్కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా , ఆయన భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కళ్లెం వాసుదేవరెడ్డి రెడ్డి, నాయకులు గడ్డం నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
పేదల సంక్షేమమే కేసీఆర్ లక్ష్యం
కరీంనగర్ టౌన్, వెలుగు: పేద ప్రజల సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యమని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఆదివారం స్థానిక సప్తగిరి కాలనీలో నిర్వహించిన సమావేశంలో మేయర్ సునీల్ రావుతో కలిసి లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్తగా 10లక్షల మందికి కలిపి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 46 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. ఏటా పింఛన్ల కోసం రూ.12వేల కోట్లు ఖర్చు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు.
కేంద్రం వాటా రూ.1.80మాత్రమే..
ఫించన్లకు రాష్ట్రం చెల్లిస్తున్న ప్రతీ వంద రూపాయల్లో కేంద్రం వాటా కేవలం రూ.1.80 మాత్రమేనని మంత్రి అన్నారు. ఆసరా పెన్షన్లు నిరంతర ప్రక్రియ అని,పెన్షన్ రానివారు మళ్లీ దరఖాస్తు చేసుకుంటే మంజూరు చేస్తామని చెప్పారు.
మట్టి గణపతుల పంపిణీ..
అంతకుముందు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో స్థానిక కళాభారతిలో మట్టి గణపతులను మంత్రి కమలాకర్మేయర్ తో కలిసి పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ మట్టి గణపతులను పూజించి, పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. రాత్రి స్థానిక కోతిరాంపూర్ లో హైమాస్ లైట్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఆర్వి కర్ణన్, అడిషనల్ కలెక్టర్ గరిమ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్ఎఫ్సీఎల్ నిందితులు.. టీఆర్ఎస్ లీడర్లే
పెద్దపల్లి, వెలుగు: టీఆర్ఎస్పార్టీ లీడర్లే రామగుండం ఎరువుల కర్మాగారం ఉద్యోగాల స్కాంలో నిందితులుగా ఉన్నారని, కేటీఆర్ అనుచరుడైన రామగుండం ఎమ్మెల్యే చందర్‌పై ఆరోపణలు వస్తుండడంతో ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ధర్మారంలో ఆదివారం జీవన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారు టీఆర్ఎస్ వారే అని, వారంతా మంత్రి ఈశ్వర్, ఎమ్మెల్యే చందర్ అనుచరులే అని జీవన్‌రెడ్డి ఆరోపించారు. ఆర్ఎఫ్సీఎల్ బాధితుడు హరీశ్ సోషల్ మీడియా ద్వారా దోషులెవరో చెప్పారని, దాన్ని ఆధారంగా ఎమ్మెల్యేను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ ఏ ముఖం పెట్టుకొని వస్తున్నవ్?
మంథని, వెలుగు: వరదలతో మంథని ప్రాంతమంతా మునిగి ఇక్కడి ప్రజలంతా తీవ్రంగా నష్టపోతే రాని సీఎం.. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారని బీజేపీ రాష్ట్ర నాయకుడు చందుపట్ల సునీల్ రెడ్డి ప్రశ్నించారు. మంథని పట్టణంలోని బీజేపీ ఆఫీసులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సీఎం కేసీఆర్, భద్రాచలంలో ఇంటికి 10,000 నష్ట పరిహారం ఇచ్చినట్లు, మంథని ప్రాంతంలో కూడా ఇవ్వాలని కోరినా.. స్పందించలేదన్నారు. కేసీఆర్ పెద్దపల్లి జిల్లాకు వస్తే బీజేపీ ఆధ్వర్యంలో అడ్డుకుంటామని హెచ్చరించారు. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌లో అలజడికి కారణం కేటీఆర్ కాదా? అని సునీల్ ప్రశ్నించారు. చాలా రాష్ట్రాల్లో నిషేధం ఎదుర్కొంటున్న మునావర్ ఫారుఖీ ని హైదరాబాదుకు పిలిపించడంలో ఉద్దేశమేమిటన్నారు. మండల అధ్యక్షుడు వేల్పుల రాజు, పట్టణ అధ్యక్షుడు సదాశివ్, సంతోష్ పాల్గొన్నారు.
జిల్లాలో అవినీతిపై సీఎం స్పందించాలి
పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లాలో ప్రజాప్రతినిధులు వారి బంధువులు, అనుచరులు చేస్తున్న అవినీతికి సీఎం కేసీఆర్జవాబు చెప్పాలని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్‌రావు డిమాండ్‌చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాకు చెందిన మంత్రి బంధువులు, ఎమ్మెల్యేలు, వారి అనుచరుల అక్రమాలు వెలుగులోకి వచ్చినా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఆర్ఎఫ్సీఎల్లో జరిగిన అవినీతిలో స్థానిక ఎమ్మెల్యే హస్తం ఉన్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయన్నారు. వీటన్నింటిపై సీఎం నేడు బహిరంగ సభలో క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. నాయకులు రాములు పాల్గొన్నారు.
ఆందోళనలు చేస్తే.. బడితపూజ తప్పదు
గోదావరిఖని, వెలుగు : రామగుండం ఎమ్మెల్యే క్యాంప్‌ఆఫీస్ ముందు ఇక నుంచి ఎవరైనా ధర్నాలు, రాస్తారోకోలు చేస్తే గులాబీ సైనికులు బడిత పూజ చేస్తారని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ హెచ్చరించారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రామగుండం ఎరువుల కర్మగారంలో దళారులను నమ్మి మోసపోయిన ప్రతీ ఒక్కరిని ఆదుకుంటామని వారికి తిరిగి డబ్బులు చెల్లించే విధంగా ప్రయత్నిస్తామని చెప్పారు. అలాగే దళారుల చేతిలో మోసపోయిన హరీశ్ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని, ఆయన కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని అన్నారు. ఆర్ఎఫ్సీఎల్నిరుద్యోగులను రాజకీయంగా వాడుకుంటూ రెచ్చగొడుతున్నారని , టీఆర్ఎస్ లీడర్లను బద్నాం చేస్తున్నాని విమర్శించారు. మేయర్ డాక్టర్ అనిల్‌కుమార్ ఉన్నారు.
సైక్లింగ్ స్టేట్ లెవల్ పోటీలకు ‘అల్ఫోర్స్ స్టూడెంట్లు’
కరీంనగర్ టౌన్, వెలుగు: రాష్ట్ర స్థాయి సైక్లింగ్ పోటీలకు తమ స్టూడెంట్లు ఎంపికయ్యారని అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ వి.నరేందర్ రెడ్డి తెలిపారు. ఆదివారం వావిలాలపల్లిలోని అల్ఫోర్స్ స్కూల్ లో పోటీలకు ఎంపికైన స్టూడెంట్లను అభినందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్టూడెంట్లలో క్రీడల ద్వారా ఆత్మవిశ్వాసం పెంపొందుతుందన్నారు. సైక్లింగ్ వల్ల ఎంతో ఉత్సాహం కలుగుతుందని చెప్పారు. ఈ క్రీడకు విదేశాల్లో మంచి ఆదరణ ఉన్నా.. ఇండియాలో సరైన ప్రాధాన్యం దక్కడం లేదన్నారు. ప్రతి ఒక్కరూ సైక్లింగ్ పై ప్రత్యేక దృష్టి ప్రాధాన్యం పెంచాలన్నారు. ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్బుర్ర మధుసూధన్ రెడ్డి, టీచర్స్, పేరెంట్స్ పాల్గొన్నారు.
రేప్ కేసు పెట్టిన యువతితోనే పెళ్లి
గన్నేరువరం, వెలుగు : మండల కేంద్రానికి చెందిన మోతె మధు(22) పై అదే గ్రామానికి చెందిన సిరిగిరి ప్రియాంక(19) మూడేళ్ల కింద రేప్ కేసు పెట్టింది. పోలీసులు పోక్సో చట్టం కింద మధును అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అయితే కొన్ని నెలల కింద బెయిల్‌పై వచ్చిన యువకుడు ఇటీవల ప్రియాంక మేజర్కావడంతో ఆదివారం పెళ్లి చేసుకొని గన్నేరువరం పోలీసులను ఆశ్రయించారు. ప్రియాంక తల్లిదండ్రుల నుంచి ప్రాణహాని ఉందని తమకు రక్షణ కల్పించాలని కోరారు.
మిడ్ మానేర్ నిర్వాసితుల ధర్నాకు మద్దతు
వేములవాడ, వెలుగు: శ్రీ రాజరాజేశ్వర(మిడ్ మానేర్) ప్రాజెక్టు ముంపు ప్రాంత నిర్వాసితుల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ముంపు గ్రామాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నేడు నందికమాన్ వద్ద నిర్వహిస్తున్న మహాధర్నా కు బీజేపీ మద్దతు ఇస్తోందని జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ అన్నారు. ఆదివారం వేములవాడ లోని భీమేశ్వర గార్డెన్ లో ఐక్యవేదిక సభ్యులతో కలిసి మాట్లాడారు. ప్రాజెక్టు నిర్మాణంలో సర్వం కోల్పోయిన బాధితులకు నేటికీ పరిహారం అందకపోవడం బాధాకరమన్నారు. ఎన్నో సార్లు ఆందోళనలు చేసినా ప్రభుత్వంలో కదలిక లేదన్నారు. ఆందోళనలు చేస్తే కేసులుపెట్టడం అలవాటుగా మారిందన్నారు. సీఎం కేసీఆర్ రాజన్న ఆలయం వద్ద నిర్వాసితులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. గాలిపల్లి స్వామి, బుర్ర శేఖర్ గౌడ్, జింక అనిల్ తదితరులు ఉన్నారు.
నేడు హెచ్‍సీఎల్ ఎర్లీ కెరీర్ ప్రోగ్రాం సెలక్షన్స్
కరీంనగర్ సిటీ, వెలుగు: గవర్నమెంట్ ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీలో సోమవారం ‘టెక్ బి- హెచ్‍సీఎల్ ఎర్లీ కెరీర్’ ప్రోగ్రాంలో చేరేందుకు రాత పరీక్ష, ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఆర్ వి కర్ణన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్ పూర్తి చేసి టెక్నాలజీని కెరీర్ గా ఎంచుకుని, ఉపాధి కోరుకునే వారికి ఇది గొప్ప అవకాశమని పేర్కొన్నారు. మ్యాథ్స్ , బిజినెస్ మ్యాథ్స్ ప్రధాన సబ్జెక్టులుగా 2021, 2022 అకడమిక్ ఇయర్స్‌లో ఇంటర్పాసై 60 శాతం మార్కులు పొందిన వారు దీనికి అర్హులని తెలిపారు. టెక్ బీ ప్రోగ్రాంలో చేరిన స్టూడెంట్లకు శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత హెచ్‍సీఎల్ కంపెనీలో ఫుల్ టైం ఉద్యోగులుగా నియమిస్తామన్నారు. శిక్షణ కాలంలో రూ. 10,000 స్టైఫండ్ ఇస్తామని తెలిపారు. హాజరయ్యే విద్యార్థులు ఆధార్ , ఇంటర్ సర్టిఫికెట్లు తీసుకురావాలని తెలిపారు.