
బైక్ ను బస్సు ఢీ కొట్టడంతో బస్సు పూర్తిగా దగ్ధమైన ఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్ధిపేట జిల్లా ములుగు మండలంలోని వరదరాజపురానికి చెందిన సంపత్(26) యూజే ఫార్ములా కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈరోజు(ఆగస్టు 22) ఉదయం విధుల నిమిత్తం బైక్ పై వెళ్తుండగా.. కొల్తూరు వద్ద ప్రధాన రహదారిపై తుర్కపల్లి నుంచి ఎదురుగా వస్తున్న ఓ ఫార్మా కంపెనీకి చెందిన బస్సు బైక్ ను ఢీ కొట్టింది.
ఈ ఘటనలో సంపత్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆపై బైక్ పెట్రోల్ ట్యాంక్ లీకై మంటలు చెలరేగి బస్సుకు అంటుకున్నాయి. దీంతో బైక్‌తో పాటు బస్సు పూర్తిగా దగ్ధమైంది. బస్సులోని ప్రయాణికులు వెంటనే కిందకు దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని.. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకు వచ్చారు. అప్పటికే బస్సు పూర్తిగా తగులబడి పోయింది.