
- ..మంచిర్యాల బ్రాంచి మేనేజర్ అరెస్ట్.. మరికొందరిపై కేసు
మంచిర్యాల, వెలుగు: చోళ మండలం ఇన్వెస్ట్మెంట్ అండ్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలో రూ.1.39 కోట్ల ఫ్రాడింగ్ వెలుగు చూసింది. చనిపోయిన పలువురు వ్యక్తుల పేర్ల మీద లోన్లు తీసి సొంతానికి వాడుకున్నట్టు రుజువుకావడంతో ఆ కంపెనీ మంచిర్యాల బ్రాంచి మేనేజర్ చిలుక ప్రవీణ్ రెడ్డిని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.
ప్రవీణ్‌తోపాటు కరీంనగర్ ఏసీఎం చిట్టెటి అశోక్ రెడ్డి పథకం ప్రకారం చెన్నూర్ మండలం కత్తెరశాల, కిష్టంపేట గ్రామాలకు చెందిన చేతెల్లి సమ్మయ్య పేరిట రూ.25.90 లక్షలు, చల్ల రామయ్య పేరుమీద రూ.20 లక్షలు, చేతెల్లి చిన్న బక్కయ్య పేరుతో రూ.20 లక్షలు, దోమల సారమ్మ పేరుతో రూ.24 లక్షలు, చల్ల రవీందర్ పేరుతో రూ.25 లక్షలు, బొజ్జ మల్లయ్య పేరు మీద రూ.25 లక్షలు.. మొత్తం రూ.కోటి 39 లక్షల 90 వేలు లోన్లు తీసి సొతానికి వాడుకున్నట్టు విచారణలో తేలిందని ఏసీపీ ఆర్.ప్రకాశ్, టౌన్ సీఐ ప్రమోద్ రావు తెలిపారు. ప్రవీణ్ రెడ్డిని అరెస్ట్ చేశామని, వీరికి సహకరించిన వారిని కూడా విచారణ అనంతరం అరెస్ట్ చేస్తామని పేర్కొన్నారు.