రెడీ అయిన చర్లపల్లి మోడ్రన్ రైల్వే టెర్మినల్

రెడీ అయిన చర్లపల్లి మోడ్రన్ రైల్వే టెర్మినల్
  • రూ.430 కోట్లతో ఆధునీకరణ పనులు పూర్తి
  • అందుబాటులోకి వస్తే సిటీలో మిగిలిన స్టేషన్లపై తగ్గనున్న ఒత్తిడి
  •  ప్రస్తుతం  మనుగడ లోనున్న లైన్లలోనే  రైళ్ల రాకపోకల నిర్వహణ 
  • కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరగానే ప్రారంభం

హైదరాబాద్,వెలుగు : చర్లపల్లి మోడ్రన్ రైల్వేస్టేషన్​ ఓపెనింగ్ కు రెడీ అయింది. కొద్దిపాటి పనులు స్టేషన్​ ను త్వరగా ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చేందుకు రైల్వే అధికారులు పనుల్లో నిమగ్నం అయ్యారు. మోడ్రన్ స్టేషన్​ దేశంలోని మరే ఇతర ప్రధాన రైల్వేస్టేషన్లకు దీటుగా పలు ప్రత్యేకతలతో నిర్మించినట్టు అధికారులు తెలిపారు. ముఖ్యంగా హైదరాబాద్​, సికింద్రాబాద్​, కాచిగూడ రైల్వేస్టేషన్ల తర్వాత స్థానంలో చర్లపల్లి మోడ్రన్ స్టేషన్​కు నిలుస్తుందని చెప్పారు. కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే ఓపెన్ చేస్తారని అధికారులు పేర్కొన్నారు. దీంతో రైల్వేస్టేషన్ తుది దశ అభివృద్ధి పనులను స్పీడ్ గా నడుస్తున్నాయి. 

రూ.430 కోట్లతో ప్రాజెక్టు 

చర్లపల్లి రైల్వే టెర్మినల్ ను రూ.  430 కోట్ల వ్యయంతో దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఆధునీకరించారు.  ఇందులో పలు మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ప్రయాణికులకు వసతులను కల్పించారు. భారీ సంఖ్యలో ప్రయాణికుల రాకపోకలకు అనుగుణంగా కొత్తగా నిర్మించే స్టేషన్ బిల్డింగ్ ను అత్యంత ఆధునికంగానే కాకుండా అందమైన ముఖద్వారంతో నిర్మించారు. స్టేషన్ లో గ్రౌండ్ ఫ్లోర్​ లో ఆరు టికెట్ బుకింగ్ కౌంటర్లు, లేడీస్, పురుషుల వెయిటింగ్ హాల్స్,  ఎగువ తరగతి వెయిటింగ్ హాల్, ఎగ్జిక్యూటివ్ లాంజ్, మొదటి అంతస్తులో కేఫేటేరియా, రెస్టారెంట్, స్త్రీ, పురుషులకు రెస్ట్ రూమ్స్ ఉన్నాయి. స్టేషన్ బిల్డింగ్ లో విశాలమైన కాన్కోర్స్ ప్రాంతాలు, స్టేషన్ ముఖద్వారానికి అత్యాధునిక లైటింగ్​ వ్యవస్థ ఏర్పాటు చేశారు. అదనంగా 4  ఎత్తైన ప్లాట్ ఫారాలు ఉంటాయి.  ఇప్పటికే ఉన్న 5 ప్లాట్ ఫామ్ లను కూడా పూర్తి నిడివితో పునర్నిర్మాణం చేశారు. 

రెండు కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు,  12 మీటర్ల వెడల్పు, మరొకటి 6 మీటర్ల వెడల్పుతో -  ప్లాట్​ఫారాల మధ్య కదలికను సులభతరం చేయడానికి అనువుగా రూపొందించారు. మొత్తం 9 ప్లాట్ ఫారాల్లో ఎస్కలేటర్లు, లిఫ్టులు ఉంటాయి. ఇందులో 7 లిఫ్టులు, 6 ఎస్కలేటర్లు ప్రయాణికుల కోసం నిర్మించారు. స్టేషన్ నుంచి రైళ్లను ప్రారంభించేందుకు కోచ్ నిర్వహణ సౌకర్యాలను కూడా కల్పించినట్టు అధికారులు తెలిపారు.  ఇవేకాకుండా ప్రయాణికులకు బస్ బే ఏర్పాటు చేశారు. రైలు సూచిక బోర్డులతో పాటు 4-, 3-, 2 -వీలర్స్ కు  పార్కింగ్ ఏరియా,  అన్ని ప్లాట్ ఫారాల్లో పబ్లిక్ అనౌన్స్ మెంట్ సిస్టమ్,  యట్ ఏ  గ్లాన్స్ బోర్డులు,  24 గంటలు  సీసీటీవీ నిఘా వ్యవస్థ ను అమర్చారు. మొత్తానికి చర్లపల్లి రైల్వే టెర్మినల్​ను అంతర్జాతీయస్థాయిలో రూపుదిద్దినట్టు అధికారులు తెలిపారు.హైదరాబాద్​ లో మిగిలిన స్టేషన్లకు దీటుగా చర్లపల్లి రూపుదిద్దుకుంది. 

సిటీలో కీలకం ​

జంట నగరాల్లో ప్రధానంగా 3 ప్రధాన రైల్వే టెర్మినల్స్ ఉన్నాయి.  సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ ద్వారా ప్రయాణికులకు సేవలు అందిస్తున్నాయి. సిటీలో రోజురోజుకూ  పెరుగుతున్న రద్దీ నేపథ్యంలో ప్రయాణికుల అవసరాలను తీర్చడానికి, సిటీకి పశ్చిమ వైపున లింగంపల్లిని మరొక రైల్వే టెర్మినల్ స్టేషన్ గా అభివృద్ధిచేశారు. ఇదేవిధంగా చర్లపల్లి రైల్వేస్టేషన్ ను కూడా మరో టెర్మినల్ స్టేషన్ గా దక్షిణ మధ్య రైల్వే అధికారులు డెవలప్ చేస్తున్నారు. సిటీకి తూర్పు వైపున చర్లపల్లి ఉంది. దీంతో ఆ ప్రాంతం స్పీడ్ గా అభివృద్ధి చెందడంతో పాటు ప్రతిష్టాత్మకమైన ఔటర్ తో అనుసంధానానికి సమీపంలోనే ఉంది. తద్వారా ప్రయాణికులకు ఎంతో  సౌకర్యవంతంగా ఉంటుంది. అంతేకాకుండా జంట నగరంలోని ఇతర రైల్వే టెర్మినల్స్​లోనూ రద్దీని తగ్గించడం,  ముఖ్యంగా సిటీకి తూర్పున ఉండే ప్రయాణికులకు సేవలను అందించేందుకు కూడా స్టేషన్ ను రైల్వే టెర్మినల్ స్టేషన్ గా అభివృద్ధి చేశారు.