
- మెగా లోక్ అదాలత్‌లో1,83,182 కేసులు పరిష్కారం
హైదరాబాద్, వెలుగు: సత్వర పరిష్కారానికి అవకాశం ఉన్న కేసులు, సైబర్ మోసాలకు గురైన బాధితులకు లోక్ అదాలత్ మెరుగైన సేవలు అందిస్తున్నది. ఈ నెల 8న నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో భారీ సంఖ్యలో కేసుల పరిష్కారం అయ్యాయి. క్రిమినల్, సైబర్ మోసాలకు సంబంధించిన కేసులు కలిపి మొత్తంగా 1,83,182 కేసులు పరిష్కారం అయ్యాయని డీజీపీ జితేందర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో 4,961 కేసులు సైబర్‌మోసాలకు సంబంధించినవి కాగా, మిగిలిన కేసులు 1,78,221 ఉన్నాయని చెప్పారు.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలు, పోలీస్ కమిషనరేట్లు, ఇతర జిల్లాల పోలీసు అధికారులు, టీజీ సైబర్‌సెక్యూరిటీ బ్యూరో, తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, ఆయా కోర్టుల జడ్జిల పూర్తి సహకారంతో పెద్ద సంఖ్యలో కేసులను పరిష్కరించినట్టు పేర్కొన్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 32,740 కేసులు, సైబరాబాద్ కమిషనరేట్ లో 22,213 కేసులు, రాచకొండ కమిషనరేట్ లో16,969 కేసులు, రామగుండం కమిషనరేట్ లో12,899 కేసులు, సూర్యాపేట కమిషనరేట్ లో 12,037 కేసులు పరిష్కారం అయ్యాయని వివరించారు.
సైబర్ మోసం కేసులలో బాధితులకు ఊరట
సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన బాధితులకు జాతీయ లోక్ అదాలత్‌లో ఊరట లభించింది. సైబర్ మోసాలకు సంబంధించిన 4,961 కేసులలో బాధితులు పోగొట్టుకున్న సొమ్ములో రూ.43.31 కోట్లు రీఫండ్ చేయించినట్టు డీజీపీ జితేందర్ వివరించారు. అత్యధికంగా కేసులు పరిష్కారం అయిన వాటిలో సైబరాబాద్ (1,331 కేసులు), రాచకొండ (747 కేసులు), హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ (510 కేసులు), టీజీసీఎస్‌బీ (116 కేసులు), నిజామాబాద్ (250) ఉన్నాయని వెల్లడించారు.
కాగా, దీనికి ముందు 2024 డిసెంబర్‌లో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో 4,893 మంది సైబర్ బాధితులకు రూ.33.2 కోట్లు రీఫండ్ చేయించగా..ఈ సారి ఆ మొత్తం పెరిగిందని డీజీపీ జితేందర్ అన్నారు.