తోటపల్లిలో అగ్రికల్చర్ కాలేజీ .. వంద ఎకరాలు, రూ.100 కోట్లు కేటాయింపు

తోటపల్లిలో అగ్రికల్చర్ కాలేజీ .. వంద ఎకరాలు, రూ.100 కోట్లు కేటాయింపు
  • మొదటి విడతలో రూ.47 కోట్లు మంజూరు 
  • కాలేజీ బిల్డింగ్ నిర్మాణానికి సన్నాహాలు

సిద్దిపేట/బెజ్జంకి, వెలుగు:  సిద్దిపేట జిల్లాకు అగ్రికల్చర్ కాలేజీ మంజూరైంది. ఇప్పటికే  తోర్నాలలో అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజీ ఉండగా ఇటీవల బెజ్జంకి మండలం తోటపల్లిలో  సాంఘిక సంక్షేమ గురుకుల అగ్రికల్చర్ కాలేజీ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతించింది. దీంతో వంద ఎకరాల్లో కాలేజీ  ఏర్పాటుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఇందుకు సంబంధించి గురుకుల విద్యా సంస్థల కార్యదర్శి అలుగు వర్షిణి తోటపల్లిని సందర్శించి నిర్దేశిత స్థలాన్ని పరిశీలించారు. 

భూమిని చదును చేయడమే కాకుండా  హద్దుల దగ్గర జెండాలను పాతారు. తోటపల్లి శివారులో రాజీవ్ రహదారికి సమీపంలోనే అగ్రికల్చర్ కాలేజీని ఏర్పాటు చేస్తున్నారు. గతంలో తోటపల్లి రిజర్వాయర్ కోసం భూములను సేకరించినా తర్వాత ప్రాజెక్టు రద్దు కావడంతో ఆ భూములు ఖాళీగా ఉన్నాయి. వాటిలో అగ్రికల్చర్ కాలేజీ ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే పది రోజుల్లో ఈ భూములను కలెక్టర్ అధికారులకు అప్పగించనున్నారు. 

రూ.100 కోట్లు  కేటాయింపు

తోటపల్లిలో ఏర్పాటు చేసే అగ్రికల్చర్ కాలేజీ కోసం ప్రభుత్వం రూ.100  కోట్లను కేటాయించింది. మొదటి విడతగా రూ.47 కోట్లు మంజూరుచేసింది.  ఈ నిధులతో కాలేజీ బిల్డింగ్, తరగతి గదులు, హాస్టల్, సిబ్బంది క్వార్టర్స్ నిర్మించాలని భావిస్తున్నారు. మిగులు భూముల్లో వివిధ రకాల పంటలను పండించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అగ్రికల్చర్ కాలేజీ స్టూడెంట్స్ కు ఉపయోగపడడంతో పాటు ప్రయోగాలకు అనువుగా ఉండేలా మిగులు భూములను తీర్చిదిద్దనున్నారు. 

గురుకుల స్టూడెంట్స్​కు ప్రత్యేక రిజర్వేషన్

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సంస్థ ఆధ్వర్యంలో అగ్రికల్చర్ కాలేజీని ఏర్పాటు చేస్తుండడంతో ఈ సంస్థల్లో చదివిన స్టూడెంట్స్​కు 75 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నారు. ఈ విషయాన్ని గురుకుల విద్యా సంస్థల కార్యదర్శి అలుగు వర్షిణి వెల్లడించారు. ఈ కాలేజీలో దశలవారీగా డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, అగ్రికల్చర్ ఇంజినీరింగ్, ఆర్గానిక్ కల్చర్, ఎమ్మెస్సీ ఇన్ అగ్రికల్చర్, బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సులను ప్రవేశపెట్టనున్నారు. వీటన్నిటికీ ప్రత్యేకంగా ఎంట్రన్స్ నిర్వహించి మెరిట్ ప్రకారం సీట్లను కేటాయిస్తారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచే అడ్మిషన్లు ఇవ్వాలనే ఆలోచనతో అధికారులు ప్రయత్నాలు చేస్తున్నా ఎంత వరకు సఫలం అవుతోందో వేచి చూడాలి.