Mahashivratri 2024 : మహా శివుడి గురించి.. కొన్ని ఆసక్తికర విషయాలు ఇలా..

Mahashivratri 2024 : మహా శివుడి గురించి.. కొన్ని ఆసక్తికర విషయాలు ఇలా..

మహాశివుడికి ఎంతో ఇష్టమైన రోజు మహా శివరాత్రి. అందుకే భక్తులు ఆ రోజంతా శివ నామాన్ని స్మరిస్తారు. రాత్రంతా జాగారం చేస్తారు. భోళా శంకరుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఉపవాసం ఉంటారు. భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. శివుడి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం..

* శివుడు తన జఠాజూఠంలో గంగను పట్టుకొని ఉండటం తెలుసు కదా ! భగీరథుడు పరలోకం నుండి గంగ కోసం వేచిచూస్తున్న సమయంలో, గంగ ఎంతో అహంకారంతో పృథ్విని నాశనం చేసేంత శక్తి గల వేగంతో వస్తానని చెబుతుంది. అప్పుడు భగీరథుడి విన్నపం మేరకు పరమశివుడు గంగను తన జఠాజూఠంలో పట్టుకుని భూమిపైకి చిన్న ధారగా గంగా నదిగా వదిలాడు. అందుకే ఆయనకు 'గంగాధర' అనే పేరొచ్చింది.

* రాక్ష సుల బాధపడలేక దేవతలు చేసిన క్షీరసాగర మథనంలో పుట్టిన హాలాహలం అందరినీ నాశనం చేస్తుందన్న ఆలోచనతో శివుడు తానే ఆ విషాన్ని తన కంఠంలో ఉంచుకున్నాడు. అందుకే ఆయనకు నీలకంఠుడన్న పేరుంది.

also read :మహా శివరాత్రి స్పెషల్ : తెలంగాణలో ప్రముఖ శివుడి ఆలయాలు ఇవే

* భక్తులకు కోరికలను తీర్చే మహాదేవుడిగా పేరున్న శివుడికి అందరు దేవుళ్లతో పోల్చితే ఇంకో ప్రత్యేకత ఉంది. ఇతర దేవతలకు ఎవరికీ లేని విధంగా శివుడికి లింగరూపం ఉంది, మహేశ్వరుడు పరబ్రహ్మ స్వరూపుడు. ఆ పరబ్రహ్మ తన ఇచ్ఛానుసారం కొన్నిసార్లు నిరాకారుడిగానూ, కొన్నిసార్లు సాకారుడిగానూ ఉంటాడు. నిరాకారుడికి చిహ్నమే శివలింగం.